– నిర్మలా సీతారామన్ కి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ
దేశ వస్త్ర రంగంలో ఆంధ్రప్రదేశ్ చేనేతకి ప్రత్యేక స్థానం ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ మెచ్చిన పొందూరు ఖద్దరు, కళాత్మకత ఉట్టిపడే ఉప్పాడ చీరలు, మంగళగిరి పట్టు చీరలు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయి. నేతన్నల గొప్ప నైపుణ్యంతో పెడన, శ్రీకాళహస్తి, ధర్మవరం, చీరాల, వెంకటగిరి తో సహా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు చేనేత వస్త్రాలకు పేరుపొందాయి.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు, కరోనా కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేత రంగానికి అండగా నిలిచిన సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు, తక్కువ వడ్డీకే రుణాలు, ఆప్కో ద్వారా కొనుగోళ్లు, నేతన్నలకు ప్రోత్సాహకాలు లాంటి అనేక కార్యక్రమాలను వైసిపి ప్రభుత్వం అమలు చెయ్యకపోవడమే చేనేత రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధాన కారణం. అసలుకే ఇబ్బందుల్లో ఉన్న నేతన్నలకు జీఎస్టీ పెంపు శరాఘాతంగా మారింది.
చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడమే పెనుభారమైతే ఇప్పుడు ఏకంగా దానిని 12 శాతానికి పెంచాలనుకోవడం చేనేత రంగానికి మరణశాసనమే. ముడిసరుకులపై విపరీతంగా పన్ను పెంచారు. రంగులు, రసాయనాలు, నూలు ధరలు, రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో లాభం 2 నుండి 5 శాతం రావడమే గగనంగా మారింది. జీఎస్టీ పెంపు నిర్ణయంతో చేనేత పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా ఆ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. తమిళనాడు, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి.
ఏపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 65 లక్షల మంది చేనేత రంగం పై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వచ్చే జీఎస్టీ మండలి భేటీలో వెనక్కి తీసుకోవాలి. కరోనా దెబ్బతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలి. నేత కళాకారులని గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాలి.