ఈనెల 20న యువగలం పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. సభ వేదిక నిర్మాణ పనులకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేడు భూమి పూజ చేయనున్నారు. ఈ సభకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని టిడిపి వర్గాలు పేర్కొన్నాయి.
ఇది ఇలా ఉండగా, సైకో సర్కారును ఇంటికి సాగనంపుదామన్నారు నారా లోకేష్. సైకో జగన్ అరాచక పాలనలో అక్షరాలు నేర్పే గురువులూ ఆత్మహత్యాయత్నం చేయడం చాలా దారుణం అని ఆగ్రహించారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ గద్దెనెక్కి 200 వారాలు దాటిపోయినా సీపీఎస్ రద్దు చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన మాట తప్పాడు, మడమ తిప్పాడన్నారు. శాంతియుతంగా సీపీఎస్ రద్దు కోసం ఉద్యమించిన ఉపాధ్యాయులు అలిసిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.