-లోకేష్ నెల్లూరు యాత్ర సూపర్‌హిట్
-సర్వేపల్లిలో పోటెత్తిన జనసంద్రం
-సత్తాచాటిన సోమిరెడ్డి అండ్ సన్
-సభలలో సర్వేపల్లి ఫస్ట్
-జనంలో రూరల్ ఫస్ట్
చంద్రబాబు కుమారుడు అన్నది మాత్రమే లోకేశ్‌కు ఉన్న అర్హత. మరొక ఆకర్షణ లేదు. గొప్ప వక్త కాదు; గతంలో ఏ వర్గాన్నీ ఉత్తేజితం చేసిన ఉద్యమకారుడు కాదు; రాజకీయంగా సమర్ధత నిరూపించుకోలేదు; పక్కన గ్లామర్ కలిగిన వారెవరూ లేరు; కాబోయే ముఖ్యమంత్రి అసలే కాదు; అందువల్ల ఆయన చెప్పే మాటలు, చేసే వాగ్దానాలకు విలువ తక్కువ.
అయినా సరే, లోకేశ్‌ను చూడడానికి జనం ఎగబడుతున్నారు. వచ్చిన వారందరూ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆ యువకుడికి ఒక సినిమా హీరోకు మళ్లే జనాకర్షణ లభిస్తున్నది. నెల్లూరు జిల్లా ఆత్మీయ ఆతిథ్యంతో తన్మయుడై పోతున్నాడు లోకేశ్ బాబు.
ఇప్పటివరకు ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూ రుపేట, గూడూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కోవూరు నియోజకవర్గాల యాత్ర ముగిసింది. కావలి చూసుకొని జిల్లా సరిహద్దు దాటి వెళ్లిపోతాడు. ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్లే కొద్ది జనంలో ఉత్సాహం అంతకంతకు పెరిగి పోతున్నది. నాయుడుపేట సభ భేష్ అనుకొన్నారు. గూడూరు యాత్రలో విశేషంగా జనం వెంట నడిచారని అంచనా వేశారు. కానీ సర్వేపల్లికి వచ్చేసరికి అన్ని లెక్కలూ మారిపోయాయి. ముత్తుకూరు బహిరంగ సభ దద్దరిల్లి పోయింది.
జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ సభను భగ్నం చేయడానికి చేయని ప్రయత్నం లేదు. రెండు రోజులపాటు ఫోన్ వదలి పెట్టకుండా అన్ని గ్రామాల వైకాపా నేతలకు హెచ్చరికలు చేశాడు. మీ ఊరు నుంచి ఒక్కరు సభకు వెళ్లినా ఒప్పుకోనని ఆంక్ష పెట్టాడు. కొన్ని చోట్ల పోలీసు బలప్రయోగం చేశాడు. ఈ పప్పులేవీ వుడకవని అర్థం కావడంతో, సభకు వెళ్లడానికి బస్సు లేదా ఆటో ఎక్కిన వారికి 500 రూపాయల నోటు, చీప్ లిక్కర్ బాటిల్ చేతిలో పెట్టి, సభకు వెళ్లకుండా నిలిపే ప్రయత్నం చేశారు.
సభ భగ్నం చేయడానికి కాకాణి కోటి రూపాయల వరకు వెచ్చించాడని వినికిడి. అంత చేసినా, కట్లు తెంచుకున్నట్లుగా గ్రామాల నుంచి గుంపులు గుంపులుగా తరలి వచ్చారు జనం. అది చూసి లోకేశ్‌ను ఆనందం పట్టరాలేదు.
రూరల్ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆర్థికంగా అత్యంత బలీయుడు కావడంతో డబ్బుకు కొదవ లేదు. కొమ్ము నాట్యం, మాదిగ డప్పు, కీలు గుర్రాలు, నవరంగ్ మేళం, తెనాలి బ్యాండ్… దాదాపు పాతిక కళాబృందాలు, యాభై గుర్రాలు లోకేష్ యాత్ర ముందు సందడి చేశాయి.
కాకుపల్లిలో లోకేశ్ నడక మొదలు పెడితే, గుండ్ల పాళెం దగ్గర వరకు ఈ బృందాలు కన్పించాయి. ఆ సందడికి ఊళ్లలోని జనం వీధులలోకి పొర్లి వచ్చారు. నెల్లూరు నగరంలో అడుగు పెట్టిన తర్వాత చెప్పనే అవసరం లేదు. రోడ్డు పక్కన బారులు తీరారు. సభలలో సర్వేపల్లి ఫస్ట్ వస్తే, జనంలో రూరల్ ఫస్ట్ వచ్చిందని అంచనా.
నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ అజ్ఞాత వాసం వీడి పురప్రవేశం చేశాడు. రాజు తలచుకొంటే దెబ్బలకు, నారాయణ తలచుకొంటే డబ్బులకు కొదువ వుండదు కదా? భారీగా జన సమీకరణ జరిగింది.
అయితే VRC సెంటర్ సభలో నారాయణ ప్రసంగం, క్లాస్ రూంలో లెక్కల పాఠం చెప్పినట్లు వుండడంతో జనం ముఖాలు కళ తప్పాయి. కానీ ఆ తర్వాత లోకేశ్ నగర వీధులలో నడుస్తుంటే, జన సమూహ స్వాగతాలు అబ్బుర పరిచాయి. ఒక సినిమా హీరో ఆకర్షణ అనేది ఇక్కడే కన్పించింది. ఈ వార్త రాసే సమయానికి లోకేశ్ కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. అక్కడ కూడా జనం ఒక వెల్లువ లాగా వస్తున్నారు.
మొత్తానికి లోకేశ్ నెల్లూరు జిల్లా యాత్ర దిగ్విజయం చెందినట్లే లెక్క. ఏ ప్రత్యేక అర్హత లేని ఒక నాయకుడికి ప్రజలు ఇంత గొప్ప స్వాగతం అందించారంటే, అది వారిలో వస్తున్న రాజకీయ ఆలోచన మార్పుకు సంకేతంగా భావించాలి. మార్పు అనేది మనం ఊహించిన దానికి రెట్టింపుగా వుందని రుజువుతోంది – లోకేశ్ యాత్ర చూస్తే.