– నేనున్నానంటూ మంగళగిరి ప్రజలకు యువనేత భరోసా
అమరావతిః మంగళగిరి ప్రజలకోసం యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధవర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు.
ఉదయం 7గంటల ప్రాంతానికే వందలాదిమంది ప్రజలు వినతిపత్రాలతో ఇంటివద్ద బారులు తీరుతున్నారు. మంగళగిరి ప్రజలను తమ కుటుంబసభ్యులుగా భావించే లోకేష్ ప్రతిఒక్కరి సమస్యను వింటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. సోమవారం నాడు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు తమ సమస్యలపై యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు.
అంగన్ వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, బదిలీల కోసం ఉపాధ్యాయులు, ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు.
వైసిపి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న లోకేష్… సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతానంటూ భరోసా ఇవ్వడంతో మంగళగిరి ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.