– విశ్వేశ్వరరెడ్డితో మీ వ్యాపార బంధమేమిటి?
– 40 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినందుకే వదిలేశారా?
– జగన్ బినామీ కంపెనీ అని మీరే కదా ఆరోపించింది?
– ఇప్పుడు మళ్లీ అదే కంపెనీకి భూములెలా ఇచ్చారు?
– ఎన్నికల ముందు బాబు, పవన్, లోకేష్ హామీలు బూటమకమేనా?
– కరేడు భూములను రెడ్లు కూడా వ్యతిరేకిస్తున్నారు
– కరేడు భూసేకరణ ఎవరి కోసం?
– పెట్టుబడిదారుల బాగే కానీ ప్రజల బాగు పట్టదా?
– బీసీవై అధ్యక్షుడిని అడ్డుకోవడం దుర్మార్గం
– ఎన్నికల ముందు తిట్టి, నేడు వారికే కట్టబెడతారా?
– ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు జె. పూర్ణచంద్ర రావు
విజయవాడ: నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో జరుగుతున్న అణచివేత దారుణమని, అక్కడి ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు లాక్కోవడం దుర్మార్గమని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు, విశ్రాంత డీజీపీ జె. పూర్ణచంద్ర రావు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ మొగల్రాజపురంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, బీసీ నాయకుడైన బోడె రామచంద్ర యాదవ్‌ను సమస్యాత్మక గ్రామమైన కరేడు వెళ్లకుండా ఆపేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కరేడు గ్రామంలో జరుగుతున్న అవినీతి అంతా ఇంతా కాదని ఆక్షేపించారు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో, వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన సంస్థకు 8 వేల ఎకరాలు కట్టబెట్టారని గుర్తు చేశారు.
ఆ సమయంలో ప్రస్తుత మంత్రి అయిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తూ రైతుల వినతులు స్వీకరించి, కేటాయింపు రద్దు చేస్తానని హామీ ఇచ్చారని పూర్ణచంద్ర రావు వివరించారు. కరేడు గ్రామంలో ఎక్కువ శాతం మంది యానాదులు, బెస్తవాళ్లు, యాదవులు, రెడ్లేనని, వెనుకబడిన వారి నుంచి భూములు సేకరించడం తగదని సూచించారు. ఇక్కడ దాదాపుగా 8 వేల ఎకరాల భూమిని సోలార్ ఇండస్ట్రీ కోసం జగన్ ఇస్తే, దాన్ని వ్యతిరేకిస్తూ లోకేష్ పాదయాత్రలో మాట్లాడారని గుర్తు చేశారు.
ఇప్పటి ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత సైతం ఆనాడు పవన్ కల్యాణ్ వ్యతిరేకించారన్నారు. అంతేకాదు ప్రస్తత సీఎం చంద్రబాబు నాయుడు కూడా గతంలో వ్యతిరేకించారనేది మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు కూడా పెట్టుబడిదారీవర్గాలకు కొమ్ముకాసే పార్టీలని దుయ్యబట్టారు. పెట్టుబడులు పెట్టేవారి కోసం పని చేసే పార్టీలు కాబట్టి, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే, అదే విశ్వేశ్వర్ రెడ్డికి తిరిగి 8 వేల ఎకరాలు కట్టబెట్టడంలో నిమగ్నమయ్యారని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు ఆరోపించారు.
అందుకు కారణం ఈ విశ్వేశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రూ. 40 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారని తీవ్ర ఆరోపణ చేశారు. ఆ కృతజ్ఞతాభావంతోనే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కరేడులో యానాదులను నేడు తీవ్రంగా హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ గిరిజన మహిళను అరెస్ట్ చేసినందుకు నిరసనగా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆ గ్రామానికి వెళ్లడానికి ప్రయత్నిస్తే, నెల్లూరు జిల్లా వెంకటాచలం దగ్గర అరెస్ట్ చేసి వెళ్లకుండా చేశారని, అక్కడి నుంచి పుంగనూరు తరలించారని పేర్కొన్నారు.
పోలీస్ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేస్తున్నారో ఈ చర్యతో ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. బీసీవై అధ్యక్షుడు కరేడు వెళ్తే ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరమని, ఆయన వెళ్లడం వల్ల శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందా లేక గొడవలేమైనా జరుగుతాయా లేక వ్యతిరేకించే వారెవరైనా ఆ గ్రామంలో ఉన్నారా అని నిలదీశారు. ఆ గ్రామంలో అందరూ బాధితులేనని, ఈ భూకేటాయింపును ఆ గ్రామంలోని రెడ్లు కూడా వ్యతిరేకిస్తున్నారని పూర్ణచంద్ర రావు వివరించారు.
అయినప్పటికీ ఈ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనకు పూనుకుంటూ పెట్టుబడిదారీ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. విశ్వేశ్వర్ రెడ్డికి రెండు ప్రభుత్వాలు భూపందేరం చేసిన ఉదంతంతో ప్రజావ్యతిరేక పాలన అని రుజువవుతోందని స్పష్టం చేశారు. పీ4 అని చెబుతున్న ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని బాగు చేయాలని చెబుతున్నారని, కానీ విశ్వేశ్వర్ రెడ్డి దాదాపు 1500 కుటుంబాలను వీధిపాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే పారిశ్రామికవేత్తలు పది కుటుంబాలను దత్తత తీసుకోమనడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు.
ఉన్న ఇళ్ల నుంచి వెళ్లగొట్టి, వీళ్లు బాగు చేసేది ఏంటని నిలదీశారు. అమరావతిలో సైతం జరుగుతున్నది ఇదేనన్నారు. 40 వేల ఎకరాలు ఇప్పటికే సేకరించి, మళ్లీ 45 వేల ఎకరాలు సేకరిస్తామనడంలో అర్థం ఏంటని అడిగారు. ఉన్న భూములకే దిక్కు లేనప్పుడు, మళ్లీ భూసేకరణ అనడమేంటని, 5 వేల ఎకరాల్లో విమానాశ్రయం ఎందుకని, 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అవసరమా అని ప్రశ్నలు సంధించారు.
ఈ ప్రభుత్వాలు పెట్టుబడిదారీవర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నవే కానీ, ప్రజల కోసం కాదన్నారు. నేడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఏ ప్రభుత్వం వచ్చినా న్యాయం జరగడం లేదని, అన్యాయమే జరుగుతోందని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు, విశ్రాంత డీజీపీ జె. పూర్ణచంద్ర రావు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో భారత చైతన్య యువజన పార్టీ నేతలు పాల్గొన్నారు.