– కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే ఈ ఆరాటం
– చదరపు అడుగుకు రూ.4 వేలయ్యే పనికి రూ.16 వేలా?
– మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో రూ. 6 వేల కోట్ల లంచాలు
– వైయస్సార్సీపీ అమరావతికి వ్యతిరేకం కాదు
– ఆ పేరుతో జరుగుతున్న దోపిడీకి మేం వ్యతిరేకం
– అప్పర్ భద్రా ప్రాజెక్టులు కడుతున్న కర్ణాటక
– అవినీతిని ప్రశ్నిస్తే మా ఇంటి మహిళలపై నీచమైన రాతలు రాయిస్తారా?
– ఎస్పీ ఆఫీసుకు తాళం వేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే
– రాష్ట్రంలో లోపించిన లా అండ్ ఆర్డర్
– వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి
తాడేపల్లి: “రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా ‘అంతా నేనే చేశాను’ అంటూ సాగిస్తున్న ప్రసంగాలు అత్యంత హాస్యాస్పదంగా మారాయని వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించి రాయలసీమ గొంతు కోసిన చరిత్ర చంద్రబాబుది అయితే, అదే ప్రాజెక్టును మళ్ళీ 40 టీఎంసీలకు పెంచి పూర్తి చేసిన ఘనత దివంగత వైయస్సార్దేనని స్పష్టం చేశారు.
అమరావతి పేరుతో రూ. 51 వేల కోట్ల అప్పు చేసి, అందులో రూ. 13 వేల కోట్లను కాంట్రాక్టర్ల కమిషన్ల రూపంలో దోచుకుంటున్నారని గణాంకాలతో సహా ఎండగట్టారు. చదరపు అడుగుకు రూ. 4 వేలు అయ్యే నిర్మాణానికి రూ. 16 వేలు కోట్ చేయడం పచ్చి దోపిడీ కాదా అని ప్రశ్నించారు. ఈ అవినీతిపై సమాధానం చెప్పలేకే వైయస్సార్సీపీ నేతల కుటుంబ సభ్యులు, మహిళలపై నీచమైన రాతలు రాయిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
హైకోర్టును, లా యూనివర్సిటీని తరలించి రాయలసీమకు ద్రోహం చేసిన చంద్రబాబు, ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఈ దోపిడీపై తాము యుద్ధం కొనసాగిస్తామని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.
“కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నా, అప్పర్ భద్రా ప్రాజెక్టు కట్టి సీమకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నా చంద్రబాబు నోరు మెదపడం లేదు. రాయలసీమ నుంచి హైకోర్టును, లా యూనివర్సిటీని తరలించి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు. వైయస్.జగన్ దాదాపు పూర్తి చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిడి వల్ల నిలిపివేసి తన సీమ ద్రోహి ముద్రను చంద్రబాబు బలపరుచుకున్నారు”.
రాజధాని అమరావతి పేరుతో రూ. 51 వేల కోట్లు అప్పు చేసి, అందులో రూ. 13 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు, కానీ అందులో ఎక్కువ భాగం లంచాల రూపంలోకే పోయింది. “మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో రూ. 8 వేల కోట్లు ఇచ్చి, అందులో రూ. 6 వేల కోట్లు కమిషన్లుగా వెనకేశారు. చదరపు అడుగుకు నిర్మాణ ఖర్చు రూ. 4 వేలు అయ్యే చోట రూ. 16 వేలు కోట్ చేయడం ఎంత పెద్ద దోపిడీ? కేవలం నాలుగు కంపెనీలకే కాంట్రాక్టులు కట్టబెట్టి 50 శాతం అదనపు లాభాలు ఇస్తున్నారు. మేం అమరావతికి వ్యతిరేకం కాదు, ఈ పేరుతో జరుగుతున్న వేల కోట్ల దోపిడీకి మాత్రమే వ్యతిరేకం”.
ప్రపంచవ్యాప్త పరిణామాలను చంద్రబాబు గమనించడం లేదు. చత్తీస్గఢ్లో గ్రీన్ ఫీల్డ్ సిటీగా కట్టిన ‘నయారాయపూర్’ నేడు నిర్మానుష్యంగా మారింది, సౌదీ అరేబియా కూడా ‘నియోం సిటీ’ కట్టలేక చేతులెత్తేసింది. “కేవలం సచివాలయం కోసం 52 లక్షల చదరపు అడుగుల నిర్మాణం ఎందుకు? దాని నిర్వహణ వ్యయం భవిష్యత్తు తరాలకు భారంగా మారుతుంది. తెలంగాణ సచివాలయం కేవలం 10 లక్షల చదరపు అడుగుల్లో అన్ని హంగులతో పూర్తి చేస్తే, మీరు మాత్రం కమిషన్ల కోసమే భారీ నిర్మాణాలకు పూనుకుంటున్నారు”.