– సులభతరమైన పౌరసేవలకు సహకారం అందించండి
– అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండి రేచల్ స్కాఫ్ తో మంత్రి లోకేష్ భేటీ
లాస్ వెగాస్(యుఎస్ఎ): అమెరికాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల జైత్రయాత్ర కొనసాగుతోంది. లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన మంత్రి అక్కడి ప్రాంగణంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యుఎస్) మేనేజింగ్ డైరెక్టర్ రేచల్ స్కాఫ్ ను కలిసి ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రేచల్ స్కాఫ్ మాట్లాడుతూ… క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ పై అమెజాన్ దృష్టి సారిస్తోంది. ప్రపంచ మార్కెట్ లో క్లౌడ్ సేవలు, పరిష్కారాలను విస్తరించడంలో మా సంస్థ కీలక పాత్ర వహిస్తోంది.
ఏఐ అండ్ ఎంఎల్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణలకు ప్రస్తుతం ప్రాధాన్యతనిస్తున్నాం. ప్రభుత్వాలు, భారీ పారిశ్రామిక సంస్థలకు అత్యాధునిక డిజిటల్ సొల్యూషన్స్ సేవలు అందజేయడంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, స్టోరేజి, డేటా నిర్వహణ సేవల్లో అంతర్జాతీయంగా మా సంస్థ పాత్ర కీలకమైంది. నెట్‌ఫ్లిక్స్, ఎయిర్‌బిఎన్‌బి, 3ఎమ్ వంటి అనేక రకాల పరిశ్రమలను తమ సంస్థ కలిగి ఉంది. ఏడబ్ల్యుఎస్ ప్రపంచవ్యాప్తంగా 32% మార్కెట్ వాటాతో క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్లో అతిపెద్ద ప్లేయర్‌గా ఉంది. 2023 నాటికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యుఎస్) వార్షిక ఆదాయం సుమారు $90.8 బిలియన్లుగా ఉండగా, 2024కి $100 బిలియన్లకు చేరుకుందని రేచల్ స్కాఫ్ చెప్పారు.
స్మార్ట్ గవర్నెన్స్ కు క్లౌడ్ సేవలు అందించండి
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు ఏడబ్ల్యుఎస్ నాయకత్వం ఉపకరిస్తుంది. స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో ఏడబ్ల్యుఎస్ క్లౌడ్ సేవలు కీలకపాత్ర వహించే అవకాశాలున్నాయి. ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ లో మీరు చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధతలు ఏపీని ఏఐ ఇన్నొవేషన్ కేంద్రంగా మార్చాలన్న మా ఆశయానికి ఊతమిస్తాయి. పునరుత్పాదక శక్తితో నడిచే క్లౌడ్ డేటా సెంటర్‌ల స్థిరత్వానికి ఏడబ్ల్యుఎస్ కట్టుబడి ఉండటం 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ 72 GW పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఉంది.
స్థిరమైన క్లౌడ్ కార్యకలాపాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు రాష్ట్రంలో బలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భరోసానిస్తాయి. ఏడబ్ల్యుఎస్ తదుపరి డేటా సెంటర్‌కు ఆంధ్రప్రదేశ్‌ను అనువైన ప్రదేశంగా ప్రతిపాదించండి, ఆంధ్రప్రదేశ్ లోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళిక, పౌరసేవలకు ఏడబ్ల్యుఎస్ సహకారం అవసరం. ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్, డిజిటల్ గవర్నెన్స్ మెరుగుదల, ఈ-గవర్నెన్స్ కార్యకమాలకు ఏడబ్ల్యుఎస్ సహకారాన్ని కోరుతున్నట్టు మంత్రి లోకేష్ చెప్పారు. దీనిపై రేచల్ స్పందిస్తూ ఎపిలో క్లౌడ్ సేవలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
రెవేచర్ సీఈవో అశ్విన్ భరత్ తో మంత్రి లోకేష్ భేటీ
ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో రెవేచర్ సీఈవో అశ్విన్ భరత్ తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి రెవేచర్ భాగస్వామ్యం వహించాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటి నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక కోడింగ్ బూట్ క్యాంప్‌లను అందించడానికి ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో కలసి పనిచేయాలని అన్నారు. ఏపీలో స్టార్టప్ ఏకో సిస్టమ్ అభివృద్ధి చెందుతోంది. స్థానిక స్టార్టప్‌లు, చిన్న-మధ్యతరహా సంస్థలకు (MSMEలు) టెక్ టాలెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నైపుణ్యాన్ని అందించడంలో మీ వంతు సహకారం అందించండి. ఈ-గవర్నెన్స్, స్మార్ట్ సిటీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లలో పని చేయడానికి శిక్షణ పొందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లను అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని లోకేష్ కోరారు.