Suryaa.co.in

Andhra Pradesh

బంగాళాఖాతంలో బలపడనున్న అల్పపీడనం

– 18 నాటికి దక్షిణ ఆంధ్ర, తమిళనాడు తీరానికి చేరిక
విశాఖపట్నం : ఉత్తర అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోని అల్పపీడనం క్రమంగా బలపడి ఈ నెల 18 నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ – ఉత్తర తమిళనాడు తీరానికి చేరే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.
‘ఉత్తర అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్యదిశగా ప్రయాణించి.. తూర్పు మధ్య, దాన్ని అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం నాటికి బలపడే అవకాశం ఉంది. తర్వాత ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వద్ద తీరానికి చేరుతుంది’ అని పేర్కొన్నారు.
అల్పపీడనం, దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ముసురు పట్టింది. అధికశాతం మండలాల్లో ఎడతెరపిలేకుండా జల్లులు పడుతున్నాయి. కొద్దిసేపు ఎండ, ఆ వెంటనే జల్లులు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.

LEAVE A RESPONSE