– గురుకులం బోధనా సిబ్బందికి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదేశం
అమరావతి: రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యార్థులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెలగపూడి సచివాలయం నుంచి మంగళవారం జామ్ కాల్ లో మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, టీచర్ల బోధనా తీరు వంటి అంశాలు మంత్రి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీవోలు, ప్రిన్సిపాళ్ళతో మంత్రి మాట్లాడారు. ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థుల్లో భయం పోగొట్టి పాఠశాలలో ఆహ్లాద వాతావరణం నెలకొల్పేలా చర్యలు చేపట్టాలన్నారు.
చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో పర్సనల్ గా ఇంట్రాక్ట్ అయ్యి వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. విద్యార్థుల్లో ఆత్మనూన్యత, ఒంటరితనం వంటివి పోగొట్టాలన్నారు. ఈ సమావేశంలో గురుకులాల కార్యదర్శి వి.ప్రసన్న వెంకటేష్ మాట్లాడారు. విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు అన్ని పాఠశాలల్లో రోజుకు ఒక గంట ఆటపాట కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రికి తెలిపారు. విద్యార్థులతో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఫ్రెండ్లీగా వ్యవహరించాలని ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఈ సమావేశంలో మంగళగిరి ఎయిమ్స్ సైకాలజిస్ట్ డాక్టర్ విజయచచంద్రారెడ్డి, సంజీవరావు తదితర అధికారులు పాల్గొన్నారు.