Suryaa.co.in

Telangana

మినీ అంగన్‌వాడీలకు మహర్దశ

మినీ అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడి కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ జివో జారీ
మినీ అంగన్వాడిలను ప్రధాన అంగన్వాడీలుగా అప్‌గ్రేడ్‌ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై 56 కోట్ల అదనపు భారం.
3,989 అంగన్‌వాడీ కేంద్రాలను మినీ అంగన్‌వాడీ కేంద్రాల నుండి ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలకు అప్‌గ్రేడ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
టీచర్లకు పెరగనున్న వేతనం
మినీ అంగన్వాడీల కష్టాలను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం
మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో మినీ అంగన్వాడీలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు స్పష్టం చేశారు. మినీ అంగన్‌వాడీల టీచర్ల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి అండగా నిలిచిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలకు అప్‌గ్రేడ్ చేస్తు జివో జారీచేసిందని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మినీ అంగన్వాడీ టీచర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం మినీ కేంద్రంలోని టీచర్‌కు 7800 మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, ప్రధాన కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయడంతో టీచర్‌కు నెలకు 13,650 వేతనం అందుకుంటారని తెలియజేశారు. మినీ అంగన్వాడి కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం 56 కోట్లు అదనపు బారం పడనుందని తెలిపారు.

మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌ ఒక్కరే ఉండడంతో, హెల్పర్‌ లేకపోవడంతో అన్ని పనులు టీచరే చేయాల్సి వస్తుందని వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని వెంటనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్‌గ్రేడ్‌ చేశారని మంత్రి పేర్కొన్నారు.

పదేండ్ల క్రితం అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో తక్కువ జనాభా ఉండడం, రెవెన్యూ గ్రామాలకు ఆవాసాలు దూరంగా ఉండడంతో నాటి ప్రభుత్వం ఆయా ప్రాంతంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వారి కష్టాలు తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం నేడు ప్రధాన అంగన్వాడి కేంద్రాల్లో అప్ గ్రేడ్ చేశారన్నారు. మెయిన్‌ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేయడంతో హెల్పర్‌ పోస్టులతో కొంతమందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి తెలిపారు.

అంగన్‌వాడీలకు సీఎం కేసీఆర్‌ వరాలు జల్లు కురిపించాలని మంత్రి సత్యవతి రాథోడ్ మరోసారి గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందజేస్తున్నామని తెలిపారు. పదవీ విరమణ వయసును 65 ఏండ్లకు పెంచడంతో పాటు విరమణ సమయంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. సర్వీసులో ఉన్న టీచర్‌ దరదృష్టవశాత్తూ మరణిస్తే తక్షణ సహాయంగా రూ.20 వేలు, సహాయకురాలికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందనుందని. అలాగే 50 ఏండ్లలోపు వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా, వయసు మీరిన వారికి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్‌వాడీలను ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మినీ అంగన్‌వాడీ టీచర్స్‌ అసోసియేషన్‌ (బీఆర్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి ముఖ్యమంత్రి కేసీఆర్ కి, అందుకు కృషి చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

LEAVE A RESPONSE