వైసీపీ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేదు
వైసీపీలో కీచకులు… కేసులున్న వారే ఆపార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు
వైసీపీలో జగన్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది నేరస్తులే
ప్రతి కుటుబానికి న్యాయం చేయడమే ‘బాబు ష్యూరిటీ : భవిష్యత్ కు గ్యారెంటీ’ ప్రధాన ఉద్దేశం
ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లెలో మహిళా ప్రజావేదిక కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి
బనగానపల్లె:- మహిళల జీవితాలు మార్చేందుకే మహాశక్తి పధకం రూపొందిచామని అధికారంలోకి రాగానే అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లెలో మహిళా ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ…“ మహిళా ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసిన నా ఆడపడుచులందరికీ స్వాగతం.. సుస్వాగతం. మీతో కలిసి మీ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవడం ఆనందించాల్సిన విషయం. గతంలో డ్వాక్రాసంఘాల ఏర్పాటుకు ముందు ఇలానే ఆడబిడ్డలతో సమావేశమయ్యాను.ఇప్పుడు మీకోసమే ‘మహాశక్తి’ కార్యక్రమం తీసుకొచ్చాను. దానిలో భాగంగా చరిత్రలో గతంలో ఏంచేశామో ఆలోచిస్తేనే భవిష్యత్ లో ఎలా ముందుకెళ్లాలో తెలుస్తుంది.
ఆడబిడ్డలు అన్నిరంగాల్లో మగవారితో సమానంగా రాణించాలని ఎన్టీఆర్ గారు ఆలోచించారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించారు. వారి ఉన్నత విద్యకోసం మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో కూడా వారిని ప్రోత్సహించి, స్థానిక సంస్థల్లో వారికోసం 9 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు.ఆ మహానుభావుడు తీసుకొచ్చిన 9 శాతం రిజర్వేషన్లను నేను 33 శాతానికి పెంచాను. చట్టసభల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది నా కోరిక..డిమాండ్. దానికోసం నేను ఎప్పుడూ ఆడబిడ్డలకు అండగానే ఉంటా.. అవసరమైతే పోరాడతాను.
ఒకప్పుడు గ్రామాల్లో పాఠశాలలు లేకపోతే, ఆడపిల్లల ఇబ్బంది గమనించి, ప్రాథమిక విద్యకోసం ప్రతి కిలోమీట ర్ కు ఒక ఎలిమెంటరీ స్కూల్, మూడు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్లకు ఒక హైస్కూల్, మండలానికి ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్ కు ఒక ఇజనీరింగ్ కాలేజీ, జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించాను. దానివెనకున్న ముఖ్యఉద్దేశం స్త్రీవిద్యే. 30 సంవత్సరాల కంటే ముందే ఆడబిడ్డల చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, వారి తెలివితేటలతో ఒనగూరే ఫలితాలను గుర్తించాను.
జనాభాలో 50శాతం మహిళలు ఉంటే, అంద రూ చదువుకునేలా చేశాం. ఆడబిడ్డలు చిన్నతనం నుంచే వివక్షత ఎదుర్కొంటారు. పుట్టినప్పటినుంచి యుక్తవయస్సు వరకు తల్లిదండ్రులపై, తరువాత భర్తలపై, అనంతరం బిడ్డలపై ఆధారపడే పరిస్థితి. చిన్నచిన్న ఖర్చులకు కూడా వారినే అడగాల్సిన పరిస్థితి. ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండా బతికేశారు. అలాంటి జీవితాలను డ్వాక్రాసంఘాల తో ఉన్నతంగా తీర్చిదిద్దాను. మహిళా శక్తి ప్రభావం ఎలా ఉంటుందో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో డ్వాక్రా సంఘాలతో చేసి చూపించాను.
డ్వాక్రామహిళలు విదేశాల్లో కూడా ఉపన్యాసాలిచ్చారు. అదీ తెలుగుదేశం మీకు అందించిన గొప్ప అవకాశం. ఇప్పుడు నూటికి 75శాతం ఆడవారే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆడవారికి బ్రెయిన్ కుడివైపున బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటే, మగవారికి ఎడమవైపున ఎక్కవ ఉంటుంది. తెలివితేటల్లో మగవాళ్లకంటే ఆడవాళ్లే మిన్న అని ఇటీవలే నిరూపితమైంది. భగవంతుడు మహిళలకు ఓర్పు, సహనం అందించాడు. కుటుంబాల నిర్వహణతో పాటు, బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడంలో మీకు మీరేసాటి.
1997లో ఆడబిడ్డలు పుడితే దండగని భావిస్తున్న రోజుల్లో బాలికా శిశుసంరక్ష పథకం తీసుకొచ్చి, ఆడబిడ్డ పుట్టిన వెంటనే తనపేరుతో బ్యాంకులో రూ.5వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. తరువాత ఆ డబ్బుని పెళ్లి కోసం, ఆడబిడ్డల చదువుకోసం వినియోగించేలా చేశాను. మగపిల్లలతో సమానంగా ఆడబిడ్డలు చదువులో రాణించాలని 8, 9, 10 తరగతుల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు అందించాను.
మహిళలు కట్టెలపొయ్యిల పై వంటచేస్తూ కన్నీళ్లు పెడుతుండటాన్ని చూసి ఓర్వలేక, దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించాను. ఒకప్పుడు గ్రామాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు రోడ్లపైకి వెళ్లేవారు. కాలకృత్యాల సమయంలో వారు పడే ఇబ్బందులు, అవమానాలు గమనించి ఉచితంగా మరుగుదొడ్లు కట్టించింది టీడీపీ ప్రభుత్వమే. 2014-19 మధ్య డ్వాక్రా సంఘాలకు రూ.8,500కోట్ల రుణమాఫీ చేశాం. పసుపు కుంకుమ కింద రూ.10వేలకోట్ల ఆర్థికసాయం అందించాను.
11 రకాల ఉచిత వైద్యపరీక్షలు మహిళలకు ఉచితంగా చేయించాం. బాలింతలకు, గర్భిణులకు అన్న అమృత హస్తం పథకం కింద బలవర్ధకమైన పౌష్టికాహారం అందించింది టీడీపీ ప్రభుత్వమే. నవజాత శిశువులకు బేబీకిట్లు అందించాం. సామూహిక శ్రీమంతాలు జరిపించాం. పెళ్లికానుక కింద యువతులకు ఆర్థికసాయం అందించాం. తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చి తల్లులపై బిడ్డల్లో గౌరవాభి మానాలు పెంచాం.
వైసీపీలో కీచకులు… కేసులున్న వారే ఆపార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు
వైసీపీలో కీచకులే ఎక్కువ. ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడిన ముగ్గురికి జగన్ రెడ్డి ఎంపీ సీట్లు ఇచ్చాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై 400లకు పైగా కేసులున్నాయి. వైసీపీ ప్రభుత్వం నిత్యావసరాలధరలు పెంచడంతో మహిళలు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. నిత్యావసరాలతో పాటు పెట్రోల్ డీజిల్, బియ్యం, నూనెలు, వంటగ్యాస్ ధరలు పెరిగాయి. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచారు.
వీటన్నింటిపై వైసీపీ మేం పెంచలేదని సమాధానం దాటవేస్తుంది. కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడే ధరలు పెంచారు. మహిళల జీవితాలు రోడ్డునపడేసేలా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఈ ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం చేశాకే మరలా మీ వద్ద కు వచ్చి ఓటు అడుగుతాను అని మహిళల్ని నమ్మించాడు. మద్యాన్ని నిషేధించకుండా నాసిరకం మద్యం విక్రయిస్తూ, ప్రజల రక్తం తాగుతున్నాడు.
మద్యం అమ్మకాలతో ఇప్పటికే చాలా కుటుంబాలు చితికిపోయాయి, మరోపక్క గృహహింస ఎక్కువైంది. దాంతో నేరాలుఘోరాలు పెరిగాయి. మద్యం కొనలేక చాలామంది గంజాయి సేవిస్తున్నారు. దాంతో నేరాలు ఇంకా ఎక్కువయ్యాయి. మహిళలపై అత్యాచారాలు, నేరాలు, ఘోరాల్లో రాష్ట్రం దేశంలోనే ముందుంది. నేరాలు ఘోరాల్లో జాతీయ స్థాయితో పోలిస్తే, రాష్ట్రంలో 44శాతం అధికం. సెక్సువల్ వేధింపులు జాతీయస్థాయికంటే 65 శాతం ఏపీలోనే అధికం. ప్రతి మూడు గంటలకు ఒక మహిళపై దాడి, ప్రతి 8 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నాయి.
టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళల రక్షణకోసం తీసుకొచ్చిన ఫోర్త్ లయన్ యాప్ ను దిశా యాప్ అని పేరు మార్చారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. నిర్భయనిధి కింద కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని టీడీపీ ప్రభుత్వం 5.4శాతం ఖర్చుపెట్టింది. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో కేవలం 1.4శాతమే ఖర్చుపెట్టింది.
ఆడబిడ్డల రక్షణ అనేది ఈప్రభుత్వంలో గాల్లో దీపంగా మారింది. ఆడబిడ్డలపై రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్లో 76 శాతం మద్యం, ఇతర మాదకద్రవ్యాల ప్రభావంతో జరుగుతున్నవే. ఆడబిడ్డల సురక్షణ విషయంలో మనరాష్ట్రం దేశంలో అట్టడుగున 22వ స్థానంలో నిలిచింది. అదీ ఈ ప్రభుత్వ ఘనత. డ్వాక్రా, అంగన్ వాడీ సహా అన్ని విభాగాల్లోని మహిళలు ఈ ప్రభుత్వ దుర్మార్గపు, అరాచక పాలనకు బలయ్యారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి.
ఎవరు ఏమైపోయినా, రాష్ట్రం ఎటు పోయినా మాకు అవసరంలేదు.. మాకు కావాల్సింది దోపిడీనే అన్నట్టు అధికార పార్టీ వారు వ్యవహరిస్తున్నారు. సాయంత్రమైతే ఇసుకలో ఇంతవచ్చింది.. మద్యంపై ఇంతవచ్చిందని లెక్కలు వేసుకుంటున్నారు తప్ప… ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి వీళ్లకు పట్టడంలేదు. మనపేర్లతో రూ.10లక్షలకోట్ల అప్పులు తెచ్చారు.
దానికి రూ.లక్షకోట్ల వడ్డీ కట్టాలి. ప్రభుత్వమే నడాపాలా.. .జీతాలే ఇవ్వాలా.. సంక్షేమమే అందించాలా.. అప్పులే కట్టాలా? ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పులు చేయడం ఆ సొమ్ముని దుర్వినియోగం చేయడం వీళ్లకు అలవాటైంది. వీళ్లు చేసిన అప్పులు ఇప్పుడే పుట్టిన పిల్లలు కూడా కట్టాలి. 25ఏళ్ల పాటు మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. అయినా ఎవ రూ భయపడాల్సిన పనిలేదు.
బాబు ష్యూరిటీ : భవిష్యత్ కు గ్యారెంటీ అనే కార్యక్రమం తీసుకొచ్చాను. దానిలో భాగంగా మహశక్తి పథకంలో మహిళలకు అనేక పథకాలు ప్రకటించాను. తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే, ఒక్కొక్కిరికీ ఏటా రూ.15వేలు అందిస్తాను. ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్లు పైబడి 60ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.1500లు అందిస్తాను. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు, సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాను.
మీ చేతుల్లో ఉండే సెల్ ఫోన్ల ద్వారానే మీకు ఆదాయం వచ్చేలా కొత్త ప్రణాళికలు ప్రకటిస్తాను. ఇంట్లోనే ఉండి మీరు మీజీవితాలు బాగుచేసుకునేలా, సంపద సృష్టించే విధానానికి శ్రీకారం చుట్టబోతున్నాను. నా ఆలోచనలు సాకారం కావాలంటే అందుకు మీ సహకారం ఎంతో అవసరం. అదే విధంగా మీ బిడ్డలకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తాను.
భవిష్యత్ లో విద్యుత్ ఛార్జీలు పెరగకుండా, నాణ్యమైన విద్యుత్ అందిస్తాను. ఇప్పుడు నెలానెలా కట్టే విద్యుత్ బిల్లు సొమ్ము మీకే మిగులుతుంది. అలానే పెట్రోల్ డీజిల్ కు బదులు విద్యుత్ తో నడిచే వాహనాలు అందుబాటులోకి వస్తాయి. ఆ విధంగా కూడా మీకు మేలు జరుగుతుంది. రైతులకోసం అన్నదాత పథకం కింద ఏటా రూ.20వేల ఆర్థికసాయం ప్రకటించాను. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల రక్షణకోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాను. నేను మీకు చెప్పేదొకటే. సాంకేతిక పరిజ్ఞానంతో, తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చు.
నేను చెప్పింది విని వదిలేయడం కాదు…మనసుపెట్టి ఆలోచించండి. మగవాళ్లు నేను చెప్పినదానిపై సంశయిస్తారు గానీ, ఆడబిడ్డలు తూచా తప్పకుండా పాటించారు. అందుకే మీరంటే నాకు అభిమానం. రాబోయే రోజుల్లో మంచి రోజులు చూస్తారు. మీద్వారా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది.
మహిళల అభిప్రాయాలు.. సందేహాలు, సమస్యలపై చంద్రబాబు నాయుడు స్పందన
• విధ్వంసం, అణచివేతధోరణి, వేధింపులకు పాల్పడటమే ఈ ప్రభుత్వానికి తెలుసు. ఈ ప్రభుత్వం, ఈ దుర్మార్గుల వల్ల నష్టపోయిన ప్రతి ఆడబిడ్డకు అండగా ఉంటాను. భవిష్యత్ లో వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడంతో పాటు, సొంత కుటుంబసభ్యుల్లా వారికి అండగా ఉంటాను.
• ప్రజలకోసం చేసే పనిలో ఉత్సాహం, ఆనందం ఉంటాయి. అందుకే అలసిపోను. అలానే మనం తినే తిండి చాలా ముఖ్యం. పోషకాలతో కూడిన మితాహారం తీసుకుంటే శరీరం, మెదడు చురుగ్గా ఉంటాయి. నాకు డబ్బుపై, పదవులపై వ్యామోహం లేదు. తెలుగుప్రజలు ఎక్కడున్నా అన్నిరంగాల్లో ముందుండాలి అన్నదే నా ఆలోచన. జగన్ లా డబ్బు వ్యామోహంతో, అహంకారంతో పనిచేస్తే ఆరోగ్యం, ఆనందం జీవితం ఏవీ ఉండవు.
• ఆనాడు మీకు ఖర్చు తగ్గించాలనే అన్నాక్యాంటీన్లు పెట్టాను. రోజు మొత్తం తిన్నా రూ.15లు కాదు. పెళ్లికానుక, చంద్రన్నబీమా పథకాల్ని ఈసారి ఇంకా సమర్థవంతంగా అమలుచేస్తాం. ముస్లిం కుటుంబాలకు సంక్రాంతి కానుక రంజా న్ తోఫా అందించాము
• ప్రజలకు అండగా, రక్షణగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే నీతితప్పి వ్యవహరిస్తున్నారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులు దోచుకుంటూ ప్రజలపైనే దాడిచేస్తున్నారు. ముఖ్యమంత్రి చెడుమార్గలో ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు సక్రమంగా ఉంటారా? అందుకే భూకబ్జాలు, ఇసుకదందాలు, మద్యంవ్యాపారం, వనరులదోపిడీలో మునిగితేలుతున్నారు. ఓటుని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే ఇలాంటి దుర్మార్గుల ఆటకట్టించవచ్చు.
• ఓటుకి రూ. 5వేలు ఇచ్చాడు.. పాపం అంటే మిమ్మల్ని చూసి పాపం అనాల్సిన పరిస్థితి వస్తుంది. మీ సొమ్ము లక్షల్లో కొట్టేసి మీకు రూ.5వేలు ఇవ్వగానే సంబరపడకండి. మీరు ధర్మాన్ని కాపాడితే అదే మిమ్మల్ని కాపాడుతుంది. అధర్మా న్ని ప్రోత్సహిస్తే అదే మిమ్మల్ని దహిస్తుంది. ప్రతి మతం ఇదే చెబుతోంది.
• నాకు ఏమాత్రం సమయం దొరికినా నా శ్రీమతితో మాట్లాడతాను. ఇంకా టైమ్ ఉంటే నా మనవడితో మాట్లాడతాను. రాజకీయపరమైన విషయాలు లోకేశ్ తో చర్చిస్తాను. నాకు ఉండేది తక్కువ సమయమే. నా కుటుంబసభ్యులు నన్ను అర్థం చేసుకుంటారు.
• 30 ఏళ్లక్రితం నేను చేసిన మంచిని, అభివృద్ధిని చాలామంది మర్చిపోయారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో నా పాత్ర సుస్పష్టం. మీరందరూ సెల్ ఫోన్లు వాడు తున్నారు. వాటి ఉపయోగం గురించి ఎప్పుడో ఆలోచించాను. కొందరు పనులు చేయకుండా కాలక్షేపంతో, మోసాలు..అబద్ధాలతో గెలుస్తారు. నేను అలాంటి వాడిని కాను. ఐదేళ్లలో మీ ఖర్చు ఎంత.. మీఆదాయమెంతో ఆలోచించండి.
• ఒకప్పుడు మీ ఎమ్మెల్యే ప్రజలకు భయపడేవాడు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేల కు భయపడుతున్నారు. మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. సరైన నాయకుడిని ఎంపిక చేసుకుంటే మీ భవిష్యత్ బంగారు భవిష్యత్ అవుతుంది. నేను మంచి చేశానంటే అధికారం ఉండబట్టే చేశాను. అది లేకుండా ఎన్నిచెప్పినా ప్రజలు గ్రహించరు. మంచి నాయకుడు ఉంటే రాష్ట్రం, దేశం బాగుపడతాయి. మంచి ఇల్లాలు ఉంటే కుటుంబం బాగుంటుంది.. తద్వారా సమాజం బాగుపడుతుంది. నేను ఓట్లకోసం పనిచేయడం లేదు..చేయను. ప్రజలకోసమే పనిచేస్తాను
• పుస్తకాల్లో చదివి రాసేకంటే ఆలోచనతో, జ్ఞానంతో రాస్తే మంచి మార్కులు వస్తాయి. ఆర్టీసీలో మహిళలు కండక్టర్లుగా ఉన్నారంటే టీడీపీ ప్రభుత్వ ఆలోచనే. మహిళలకు బస్సుల్లో కొన్ని సీట్లు రిజర్వు చేసింది మనమే. మహిళలకు పురుషులతో ఆస్తిలో సమానహక్కు కల్పించింది టీడీపీనే. ఎవరో చేశారని మనం చేయడంలేదు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఎక్కడోచూసి ప్రకటించింది కాదు. ప్రపంచంలో రాబోయే మార్పులను ముందే ఊహించి నిర్ణయాలు తీసుకు నే వ్యక్తిని నేను.
• ఇతను వచ్చాక మంచిని వదిలేసి విధ్వంసానికే తెరలేపాడు. ప్రజలకోసం, వారి బాగు… భవిష్యత్ కోసం చేసేదే సుపరిపాలన. అసాధ్యమైనవి చేస్తానని చెప్పి ఓట్లు దండుకోవడం నాకు తెలియదు. జగన్ రెడ్డి మద్యాన్ని నిషేధిస్తానన్నాడు. మద్యాన్ని నిషేధించాకే మరలా ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని కూడా చెప్పాడు అధికారంలోకి వచ్చాక దశలవారీగా చేస్తానని మాటమార్చి, ధరలు పెంచాడు. తాగేవాళ్లు తగ్గుతారని కుంటిసాకులు చెప్పాడు.
మనసులో డబ్బులు సంపాదించాలనే ఆలోచన పెట్టుకొని, చివరకు డిస్టలరీలు, మద్యం విక్రయాలు అన్నీ తానే నిర్వహిస్తున్నాడు. పేదలపక్షపాతిని అంటూ పేదల సొమ్ము కొట్టేస్తున్నాడు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25ఏళ్లు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చాడు. ఇదే మోసం, దగా. విశ్వసనీయత అనేది మనం చేసే పనుల్ని బట్టే వస్తుంది.
• టీడీపీ ప్రభుత్వం రెండుసార్లు డీఎస్సీలు నిర్వహించి, 18వేల ఉద్యోగాలు ఇచ్చింది. మరలా అధికారంలోకి రాగానే డీఎస్సీలు పెట్టి, అర్హులకు న్యాయం చేస్తాం.
• మీరు ఇచ్చిన సూచనలు, మీ అవగాహన చాలా బాగుంది. నేను చెప్పిన విషయాలపై మీరు ఆలోచించండి. తెలుగుదేశంపార్టీని గెలిపించడానికి పనిచేయండి. మహాశక్తి పథకాలపై ప్రతి కుటుంబానికి అర్థమయ్యేలా చెప్పండి. ‘బాబు ష్యూరిటీ : భవిష్యత్ కు గ్యారెంటీ’ పత్రం మా ఏజెంట్ (పార్టీ మనిషి) మీకు అందిస్తారు.
దానిపై ఉండే Q ఆర్ కోడ్ స్కాన్ చేయండి. సెల్ ఫోన్ ద్వారా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. దానిపై అక్నాలెడ్జ్ మెంట్ ఇస్తాం. ప్రభుత్వం రాగానే దానిలోని వివరాల ప్రకారం ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తాం. అదే ‘బాబు ష్యూరిటీ : భవిష్యత్ కు గ్యారెంటీ ’ ప్రధాన ఉద్దేశమని చంద్రబాబు నాయడు అన్నారు.