Suryaa.co.in

Telangana

మహేశ్వర్‌రెడ్డికి బీజేపీలో గుర్తింపు లేదు

– అందుకే కాంగ్రెస్‌పై విమర్శలు
– తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డే
– భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్‌: 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏం చేసింది? ఏం హామీలను అమలు చేసిందో చెప్పాలని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

చిత్తశుద్ధి లేని పాలన చేస్తున్నందుకు మొదట ప్రధాన మంత్రి మోదీని ప్రశ్నించాలని.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారని, ఇప్పటి వరకు ఇందులో తెలంగాణ వాటా 80 లక్షలు రావాలని, అవి ఏమయ్యాయో చెప్పాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గుర్తింపు బీజేపీలో లేదని, కేంద్రంలో బీజేపీ చిత్తశుద్ధి లేని పాలనను సాగిస్తోందని చామల విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకుంటే రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం సరికాదని అన్నారు. బీజేపీలో గుర్తింపు కోసమే ఆయన 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

బడాబాబులకు వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మాఫీ చేశారని, కానీ పేదవారి అకౌంట్లలో రూ.15 లక్షలు మాత్రం పడలేదని, తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డేనని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని, ఈ నెల 22వ తేదీన దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి కిషన్ రెడ్డి హాజరు కావాలని, తెలంగాణ రాష్ట్రం తరఫున నిలబడాలని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE