– కార్పొరేటర్‌కు 14 రోజుల రిమాండ్
– ఫలించిన మంత్రి కేటీఆర్ ట్వీట్
– కార్పొరేటర్ బరి తెగింపుపై పోలీసులలో ఆగ్రహం
పోలీసులను బహిరంగంగా బెదిరించిన భోలక్‌పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. పోలీసులను ‘వందరూపాయలగాళ్లంటూ’ కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలు, సోషల్‌మీడియాలో వైరల్ అవడంతో పోలీసు శాఖ తలదించుకోవలసివచ్చింది. తమను కార్పొరేటర్ బెదిరిస్తు, అవమానిస్తున్నా మౌనంగా ఉన్న ముషీరాబాద్ పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ‘అదే కార్పొరేటర్ స్థానంలో మరొకరు ఉంటే, వారిని అదే పోలీసులు పెడరెక్కలు విరిచి తీసుకువెళ్లేవారు కదా’ అన్న వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో ట్రోల్ అయ్యాయి. ఇప్పుడు కూడా మంత్రి కేటీఆర్ స్పందించడంతోనే కార్పొరేటర్‌ను అరెస్టు చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నగరంలోని భోలక్‌పూర్‌లో పోలీసులపై కార్పొరేటర్ సహా కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని మంత్రి కేటీఆర్ కోరారు. ‘‘డ్యూటీలో ఉన్న పోలీసు
అధికారులను అడ్డుకున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని..తెలంగాణలో ఇలాంటి మూర్ఖత్వాలను సహించవద్దని.. రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని అభ్యర్థిస్తున్నా’’ ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆయన ట్వీట్ చేశారు. దీనితో స్పందించిన ముషీరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి కార్పొరేటర్ గౌసుద్దీన్‌ను అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు కార్పొరేటర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది.
వివరాల్లోకి వెళితే.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భోలక్‌పూర్‌లో దుకాణాలు మూసేయాల్సిందిగా స్థానిక పోలీసులు కోరారు. రంజాన్ సందర్భంగా దుకాణాలు తెరుచుకున్నామంటూ కొందరు దుకాణదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ పోలీసులపై దుర్భాషలాడారు. దుకాణాలను మూసివేయించేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘‘రంజాన్ మాసంలో తెల్లవార్లూ హోటళ్లు తెరిచి ఉంటాయి. నిర్వాహకులను ఇబ్బంది పెట్టొద్దు. పోలీసులు తమాషాలు చేస్తున్నారు. తమ డ్యూటీ తాము చేసుకొని వెళ్లిపోవాలి’’ అని కార్పొరేటర్ అంటున్నట్లు వీడియోలో ఉంది. తమ డ్యూటీ తాము చేస్తున్నామని ఓ కానిస్టేబుల్ అనగానే ‘‘రూ.100 వ్యక్తివి నువ్వు.. నాకు సమాధానం చెబుతావా? మీ ఎస్సైని పిలిపించు.. కార్పొరేటర్ వచ్చాడని చెప్పు’’ అంటూ ఆయన దురుసుగా మాట్లాడారు.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేస్తూ కార్పొరేటర్‌ఫై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేటీఆర్ ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వాళ్లపై చట్ట
ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇలాంటి చర్యలను ఉపేక్షించవద్దని.. రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.