– ఎంపీ సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం
కాకినాడ: దేశంలోని అన్ని ప్రధాన, ముఖ్యేతర ఓడరేవులలో కార్యకలాపాల వ్యవస్థను ఏకరీతిలో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ముందడుగు వేసింది. “ఒకే దేశం – ఒకే పోర్ట్ ప్రాసెస్”(ఓఎన్ఓపీ) ఫ్రేమ్‌వర్క్ అభివృద్ధి, అమలు చర్యలపై స్పష్టత ఇస్తూ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ రాజ్యసభలో మంగళవారం సమాధానమిచ్చారు.
రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు స్పందించిన కేంద్రం మంత్రి సమాధానం ఇస్తూ, దేశవ్యాప్తంగా పోర్టుల పనితీరు, డిజిటల్ వ్యవస్థలు, నియంత్రణ ప్రక్రియలను ఏకరీతిలో అమలు చేయడం ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. “ఈ చర్యలు అన్ని పోర్టులలో సమాన ప్రామాణీకరణను అందించడంతోపాటు లాజిస్టిక్స్ రంగంలో పారదర్శకత, కార్యక్షమతను పెంచుతాయి” అని తెలిపారు. ఓఎన్ఓపీ అమలులో భాగంగా నేషనల్ లాజిస్టిక్స్ పోర్టల్ (సాగర్ సేతు)ను అప్‌గ్రేడ్ చేస్తుండటం ముఖ్యాంశంగా మంత్రి పేర్కొన్నారు.
దేశంలోని అన్ని పోర్టులలో షిప్పింగ్ సంబంధిత సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌గా సజావుగా సమర్పించడం, ప్రాసెసింగ్ చేయడం కోసం ఈ వేదికను బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. ఈ వేదికపై కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వంటి కీలక విభాగాలను ఒకే చోట అనుసంధానించడం జరుగుతుందని కేంద్రమంత్రి వివరించారు. ఓఎన్ఓపీ అమలు ద్వారా డాక్యుమెంటేషన్‌లో సుమారు 33 శాతం తగ్గింపు చోటు చేసుకోనున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. దీని వల్ల సరుకు నిర్వహణ సామర్థ్యం పెరుగుతుందని, పోర్టు కార్యకలాపాల సమయ వ్యయం తగ్గుతుందని, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయని వివరించారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవస్థలను నవీకరించడం వల్ల భారత పోర్టుల గ్లోబల్ పోటీ శక్తి మరింతగా పెరుగుతుందని మంత్రి తెలిపారు.
ఈ సంస్కరణలు పారదర్శకంగా, సమానంగా అమలవుతాయని, దేశంలోని ప్రతి పోర్టుకు — ఆంధ్రప్రదేశ్ పోర్టులను కూడా కలుపుకొని — ఈ ఫ్రేమ్‌వర్క్ వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. దీంతో పోర్టు మౌలిక వసతుల్లో, డిజిటల్ సేవల్లో, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలో ఏకరూపత నెలకొని, రాష్ట్ర పోర్టులకు ప్రత్యక్ష ప్రయోజనం చిక్కనుంది.
పోర్టు పారిశ్రామిక రంగంలో డిజిటల్ రూపాంతరం, ఖర్చు తగ్గింపు, పారదర్శకతను సాధించడంలో ఓఎన్ఓపీ కీలక పాత్ర పోషించనుందన్నారు.. దీంతో భారత్ సముద్ర లాజిస్టిక్స్ రంగంలో ప్రపంచ స్థాయిలో మరింత ముందుకు సాగుతుందని కేంద్రం నమ్ముతుందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ రాజ్యసభలో వెల్లడించారు.