Suryaa.co.in

Editorial

మంచి ప్రభుత్వానికి ‘మల్లి’పూదండ!

  • నాడు గన్నవరం ఎయిర్‌పోర్టులో బంగారంతో పట్టుబడ్డ ఓ మహిళ భర్తకు మళ్లీ అదలం

  • సీఎంఓ అధికారి హస్తంపై నాడు టీడీపీ ఆరోపణలు

  • ఇప్పుడు సాంస్కృతిక శాఖలో ‘మల్లి’ జగనాభిమానికే పట్టం

  • జగన్ జమానాలో పుస్తకాలతో రెచ్చిపోయిన ఓ అధికారి

  • అభివన అంబేద్కర్ పేరుతో భజన

  • విశాఖలో తనను బెదిరించిన ఓ పత్రికకు అల్లూరి ఉత్సవ బాధ్యతలు

  • కూటమిలో మళ్లీ సాంస్కృతిక శాఖలో డైరక్టర్‌గా ఎంట్రీ

  • జనసేన మంత్రి సిఫార్సుతో వచ్చేందుకు రంగం సిద్ధం

  • రిటైరయినా సాంస్కృతిక శాఖలో డైరక్టర్‌గా రంగప్రవేశం?

  • నోరెళ్లబెడుతున్న కూటమి నేతలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆ విమానం దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత డిఆర్‌ఐ అధికారులు.. దుబాయ్ నుంచి నమ్మకపైన సమాచారం మేరకు, ప్రయాణికులను తనిఖీ చేశారు. అందులో ఒక మహిళ వద్ద లెక్కకుమించిన బంగారం దొరికిందన్న వార్తలు, టీవీ చానెళ్లలో హల్‌చల్ చేశాయి. అయితే సదరు మేడమ్ గారు ఏమాత్రం భయపడకుండా, నాటి సీఎం జగన్ సీఎంఓలో పనిచేసే ఓ కీలక అధికారి పేరు చెప్పి బెదిరించారు. మరికొందరు ఐఏఎస్‌ల పేర్లు కూడా మేడమ్ గారు చెప్పడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ఈలోగా సీఎంఓలో జగన్‌కు సన్నిహితుడైన ఓ రెడ్డిగారు ఆ అధికారులపై ఒత్తిడి చేశారు.

దానితో ఏదో సంసారపక్షంగా పెనాల్టీ విధించి, మేడమ్ గారిని వదిలేశారు. దానిపై నాటి విపక్ష టీడీపీ కూడా ఆ సీఎంఓ అధికారిపై ఆరోపణలు సంధించింది. దానికి ఆగ్రహించిన జగన్ సర్కారు.. దుష్ర్పచారం చేస్తున్నారంటూ కేసులు నమోదు చేసింది. ఇదంతా జగనన్న జమానాలో గన్నవరం ఎయిర్‌పోర్టులో జరిగిన ఓ అద్భుత దృశ్యం.

సదరు మేడమ్ గారి భర్తగారు.. అప్పట్లో సాంస్కృతిక శాఖలో చక్రం తిప్పిన అధికారి. సదరు సారు ‘మల్లి’ కూటమి సర్కారులోనూ డైర క్టర్‌గా అవతరించేందుకు విచ్చేస్తున్నారట. అప్పుడు జగన్ జమానాలోనే రిటైయిన అధికారికి పట్టం కట్టినట్లే.. ఇప్పుడు మంచి ప్రభుత్వమైన కూటమి సర్కారు కూడా, ‘మల్లి’ ఆయనకే పట్టం కట్టేందుకు తెగ సంబరపడిపోతోందట.

ఆయనో జగనాభిమాని. అభిమాని అంటే అట్లాంటిట్లాంటి, అల్లాటప్పా అభిమాని కాదండోయ్. జగన్‌ను అభివన అంబేద్కర్‌గా కీర్తిసూ పుస్తకాలు ముద్రించిన వీరాభిమాని. సాంస్కృతిక శాఖను జగన్‌కు అంకితం చేసిన ఘనునుడాయన. రోజా జీవితచరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన అధికారి. ఇప్పుడాయన రిటైరయిపోయారు. మరి రిటైరయిన అధికారి గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకనేకదా ఈ అసహనం? అక్కడికే వస్తున్నాం.

సదరు జగన్ వీరాభిమానికి.. జనసేన మంత్రి గారొకరు దొడ్డ మనసు చేసుకుని, సాంస్కృతిక శాఖ డైరక్టర్‌గా సిఫార్సు చేయడం, అది కాస్తా రెండు మూడురోజుల్లో జీఓగా కార్యరూపం దాల్చేందుకు.. ఫైలు పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడేంత వేగంతో పరుగులు తీస్తోందట.

జగన్ జమానాలో చక్రం తిప్పిన అధికారులు.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కులాలు, మతాలు, ప్రాంతాల ముసుగులో మళ్లీ హవా కొనసాగిస్తున్న వైనం, కూటమి కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తోంది. జగన్ ప్రభుత్వం లేకపోయినా మళ్లీ ఈ అధికారులకు కీలక పోస్టింగులు ఎలా వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారు? ఇదంతా ఏ స్థాయిలో జరుగుతోంది? అని కూటమి కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గత సర్కారులో జగన్‌ను అంబేద్కర్‌తో పోలిస్తూ, ఆయనను ఆకాశానికెత్తిన ఓ రిటైర్డ్ అధికారి.. ‘మల్లి’ కొత్తరూపంలో సాంస్కృతిక శాఖ డైరక్టర్‌గా రానున్నారన్న వార్తలు, ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. జనసేన మంత్రి ఒకరు ఆయనను సిఫార్సు చేశారంటున్నారు.

అప్పట్లో కూచిపూడి నాట్యారామం కార్పోరేషన్‌ను ఈ అధికారి వెలిగించారు. జగన్ జమానాలో సాంస్కృతిక శాఖకు పెద్దగా బడ్టెట్ లేదు కాబట్టి, లక్ష రూపాయల ఖర్చుతో ఓ కార్యక్రమం పెట్టి, వాటి బిల్లులను సీఎఫ్‌ఎంఎస్ ద్వారా పిండేసేవారట. వాటిని నిర్విహంచేది డాన్స్‌మాస్టర్ కావడంతో ఇద్దరూ కలసి, బినామీల పేరుతో కోట్ల రూపాయలు లాగించేశారన్న ఆరోపణలున్నాయి.

అయితే తర్వాత ఆ పదవికి రాజీనామా చేసిన సారు హవా, సాంస్కృతిక శాఖలో ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి, శక్తిమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి హోదా లేని సారు ఆ వేదికపైకి ఎక్కి ఫొటోలు తీయించుకోవడమే గమ్మతు. ఆ వేదికపై సాంస్కృతిక శాఖ మంత్రి.. భువనేశ్వరికి ఓ చిత్రపటం బహుమతిగా ఇచ్చారు.

అయితే దానిని తానే గీశానని సారు బిల్డప్ ఇచ్చారట. శాఖలో తన శిష్యుపరమాణువయిన ఓ డాన్స్ మాస్టర్ సహకారంతో, సారు సాంస్కృతిక శాఖలో ఇంకా వె లిగిపోతున్నారన్నది వినిపిస్తున్న ఆరోపణ. సారు ఇప్పుడు ఆ శాఖలో లేకపోయినా ఆయన బినామీలైన ముగ్గురు అఆన్నీ చెక్కబెడుతున్నారట.

జగన్‌రెడ్డి కళ్లలో పుస్తకాలు, బొమ్మల లాంటి భజనతో మెరుపులు చూపే సారు, ఒకప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్‌లో పనిచేసి రిటైరయ్యారు. విభజన తర్వాత సీఎం అయిన చంద్రబాబు వద్ద ఆర్కిటె క్ బిల్డప్పులు ఇచ్చి, కొన్ని ప్రాజెక్టులో చేరిన సారు.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎంఓలో ఓ రెడ్డిగారి పంచన చేరి కోట్లకు పడగలెత్తారన్న ఆరోపణలు లేకపోలేదు. సారు అవినీతిపై కథనం రాసిన విశాఖలోని ఓ పత్రికకు అల్లూరి సీతారామరాజు ఉత్సవ నిర్వహణ కాంట్రాక్టు ఇప్పించి దక్షణగా చెల్లించుకున్నార న్న ప్రచారం కూడా లేకపోలేదు.

సీపీఐకి అనుబంధంగా ఉండే ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో ఆవ్కిరణ కాని అంబేద్కర్ పుస్తకానికి ఆరులక్షల డబ్బు, శాఖ నుంచి ఇప్పించిన ఘనుడన్న పేరు కూడా లేకపోలేదు. ఆ ప్రెస్‌లోనే ఎన్నో బయట పుస్తకాలు ముద్రించి, ఆ ఖర్చుని సాంస్కృతిక శాఖ ముద్రించే పుస్తకాల లెక్కలో రాయడంలో, సారు నిష్ణాతుడన్న పేరు కూడా లేకపోలేదు. అన్నట్లు సారు నాటి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా జీవితచరిత్ర కూడా లిఖించారు. దాన్ని కూడా తనకు ఇష్టమైన అదే ప్రింటింగ్ ప్రెస్‌లో, సాంస్కృతిక శాఖ సొమ్ముతో ముద్రించారట.

జగన్ జమానాలో సారు అల్లూరు సీతారామనరాజు మీద ఒక పుస్తకం రాసి, దానిని జగన్‌తో ఆవిష్కరింప చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సారు అతి తెలివి ప్రదర్శించి.. అప్పటి జగన్ సర్కారు సందేశాలు తొలగించి, ‘మల్లి’ అదే పుస్తకాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో ఆవిష్కరింపచేసే, చావు తెలివితేటలు బెడిసికొట్టాయట. సారు ఓవరాక్షన్ తెలుసుకున్న స్పీకర్ పాత్రుడు, సారును మందలించారట. ఇదంటా ఆ శాఖలో తన శిష్యుడైన ఓ డాన్స్ మాస్టర్‌తో చేసిన విన్యాసమన్న విమర్శలు లేకపోలేదు.

ఎయిర్‌పోర్టులో ఓ మహిళ బంగారంతో పట్టుబడ్డ ఘటన రచ్చ అయిన తర్వాత, సారుకు పదవీ విరమణ తర్వాత మరోసారి పొడిగింపు లభించిదన్న వార్త బయటకొచ్చింది. ఇప్పుడు ‘మల్లి’ ఆ అధికారికే సాంస్కృతిక శాఖ పగ్గాలప్పగిస్తున్నారన్న వార్తలు.. ఆ శాఖ ఉద్యోగులు, ఆ శాఖపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయట. ఎంతైనా.. ‘ఇది మంచి ప్రభుత్వం’ కదా! ఆమాత్రం మంచితనం లేకపోతే ఎట్లా మరి?

LEAVE A RESPONSE