-వార్డులలో పెండింగ్ రోడ్డు డ్రైయిన్ నిర్మాణ పనులు ప్రారంభం
-వెజ్ , నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించాలి
– అమృత్ పథకం 2.0 క్రింద మంథనిలోనీ పోచమ్మ వాడలో వాటర్ ట్యాంక్ తో పాటు 25 కిలో మీటర్ పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
మంథని, జూలై – 15: అభివృద్ధి, సంక్షేమం అమలులో మంథని ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా మని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.
సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని పట్టణంలోనీ పోచమ్మ వాడలో 8 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ తో పాటు 25 కిలో మీటర్ పైప్ లైన్ నిర్మాణ పనులకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసి, మంథని పట్టణంలో గురుకుల పాఠశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం క్రింద మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ,, మంథని పట్టణ వాసులకు త్రాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు అమృత్ పథకం 2.0 క్రింద 12 కోట్ల 10 లక్షల ఖర్చు 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, 25 కిలోమీటర్ల పైప్ లైన్ పనులు చేపట్టామని తెలిపారు.
మంథని ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని, రాష్ట్రంలోనే మంథని ప్రాంతాన్ని సంక్షేమం, అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఎంపీతో కలిసి పని చేస్తున్నామని అన్నారు. మంథని పట్టణంలో ఉన్న వార్డులకు కోటిరూపాయల చొప్పున అందించి మిగిలిన రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనులు ప్రారంభించామని అన్నారు.
ఆధునాతన హంగులతో 4 కోట్లతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టామని, 15 రోజుల లోపు ఆ పనులకు శంకుస్థాపన చేసి, నెల రోజుల వ్యవధిలో మార్కెట్ పనులు ప్రారంభించాలని, అదే విధంగా మూడు కోట్ల రూపాయలతో పురపాలక సంఘం కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి 10 రోజుల లోపు శంకుస్థాపన చేసే విధంగా పనులు మొదలు పెట్టాలని మంత్రి సూచించారు.
డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం రెండు కోట్ల రూపాయలతో ఏక్లాస్ పూర్ శివారున షెడ్స్ నిర్మిస్తామని అన్నారు. మంథని పట్టణంలో సోలార్ విద్యుత్ దీపాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
అభివృద్ధి పనులు ప్రజా ప్రతినిధుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావని, పోచమ్మ వాడలో చేపట్టిన వాటర్ ట్యాంక్, పైప్ లైన్ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని మంత్రి అన్నారు.
ప్రజాపాలన దరఖాస్తులలో ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారు ఎంతమంది, ఇండ్లు, ఇంటి స్థలం లేనివారు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు జాబితా సిద్ధం చేయాలని, ఆ దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవిక పరిస్థితులతో కూడిన రిపోర్ట్ రూపొందించాలని అన్నారు.
యువకులు టెన్నీస్ ఆడుకునేందుకు సింథటిక్ కోర్ట్, పట్టణంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించి అవసరమైన స్థలం సిద్దం చేయాలని అన్నారు. మంథని పట్టణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మంత్రి సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంథనికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రజా పాలనలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన మంత్రి శ్రీధర్ బాబు సమన్వయంతో పని చేస్తున్నారని ఎంపీ తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, మంథని పట్టణంలో పైప్ లైన్ వేసి రెండు వేల ఇండ్లకు నూతనంగా నల్లా కనెక్షన్లు అందించడం జరుగుతుందని, గతంలో మిసైన ఇండ్లను కవర్ చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న నీటి ట్యాంకు సామర్థ్యాన్ని సైతం రెట్టింపు చేస్తూ ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ ప్రభుత్వం నిర్మిస్తుందని, ఈ పనులను నాణ్యతతో సంబంధిత ఏజెన్సీలు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు.
అనంతరం మంథని గురుకుల పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి, ఎంపి, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ప్రజాప్రతినిధులు పాల్గోనీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వర్షాలు సరైన సమయానికి పడాలని, ఉష్ణోగ్రతలు తగ్గాలని, మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలని, దీని కోసం మొక్కల పెంపకం చాలా కీలకమనీ మంత్రి అన్నారు.
కలుషితమైన వాతావరణం నిర్మూలించడం చాలా కీలకమని, దీనికోసం చెట్లు చాలా అవసరమని మంత్రి అన్నారు. చెట్ల గొప్పతనంపై విద్యార్థులకు వివరిస్తూ వారిని వన మహోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని, ప్రతి పౌరుడు తమ బాధ్యతగా పచ్చదనాన్ని పెంచాలని అన్నారు