– ప్రధాని మోదీ
నాగపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగాది రోజైన ఆదివారం నాగపూర్‌లోని రేషంబాగ్‌లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లారు. ఇదే రోజు డాక్టర్ హెడ్గేవార్ జయంతి అయినందున వారికి పూలతో నివాళులు అర్పించారు.
అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ సరసంఘచాలక్ గురూజీ స్మృతి మందిరానికి కూడా వెళ్లి నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సంఘ జ్యేష్ఠ ప్రచారక్ భయ్యాజీ జోషి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా వున్నారు.
ఈ సందర్భంగా అక్కడ వుండే సందర్శకుల పుస్తకంలో ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని రాశారు.
‘‘పరమ పూజనీయ డాక్టర్జీ, గురూజీకి అనేక కోటి కోటి నమస్కారాలు. భారతీయ సంస్కృతి, జాతీయత, సంస్థాగతమైన సంఘటిత విలువలకు ఈ ప్రదేశం అంకితమైంది. దేశ సేవలో ముందుకు సాగడానికి మాకు స్ఫూర్తినిస్తుంది. నాలాంటి లెక్కలేనంత మంది డాక్టర్జీ, పూజ్య గురూజీ ఆలోచనల నుంచి ప్రేరణను, బలాన్ని పొందారు. లక్షలాది మంది స్వయంసేవకులకు ఈ స్థలం శక్తిపుంజం లాంటిది. మేం చేసే ప్రయత్నాలతో భారతమాత గౌరవం మరింత పెరుగుతుంది’’ అని మోదీ పేర్కొన్నారు.మరోవైపు ఇక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దీక్షాభూమికి వెళ్లారు. అక్కడ అంబేద్కర్ కి నివాళులు అర్పించారు.