-తెలంగాణలో ఈ రోజు 7.7 శాతం పచ్చదనం
-మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరు
-ధాన్యం ఉత్పత్తిలో మనల్ని ఎక్కిరించినవారు ఏడవ స్థానానికి పోయారు
-రంగారెడ్డి జిల్లా పర్యటన లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18 వ రోజున తలపెట్టిన ‘తెలంగాణ హరితోత్సవం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరు రిజర్వు ఫారెస్ట్ కేంద్రంలో ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కను నాటారు.
సోమవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి తుమ్మలూరు రిజర్వ్ ఫారెస్ట్ చేరుకున్న సిఎం కేసీఆర్, అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం ద్వారా ప్రయాణిస్తూ అటవీ అభివృద్ధి పనులను పరిశీలించారు. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పట్టణాల్లో హరిత ప్రగతిని వివరించే పోటోలను నివేదికలను ఈ సందర్భంగా ప్రదర్శించిన అటవీశాఖ అధికారులు వాటి గురించి సిఎం కు వివరించారు.
రాష్ట్రంలో మొక్కలు నాటి పెంచే కార్యక్రమాల పురోగతిని ఈ సందర్భంగా అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి సీఎం ఓ ఎస్ డి ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ డోబ్రియాల్ తదితరులు సిఎం కేసీఆర్ గారికి వివరించారు.సబంధిత అంశాలగురించి తెలుసుకుంటూ వివరిస్తూ చర్చిస్తూ సిఎం కేసీఆర్ ముందుకు సాగారు. వన్యమృగాలు, అడవి జంతువుల నుంచి స్వీయ సంరక్షణ, పంటల రక్షణలో భాగంగా వినియోగించే ఆయుధాలు రక్షణ పరికరాలు వ్యవస్థల ప్రదర్శనను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం అక్కడే మహాగని మొక్కను మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులతో కలిసి సిఎం నాటారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడేందుకు అక్కడ నుంచి నేరుగా సభా స్థలికి సిఎం చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రసంగంతో సభ ప్రారంభమైంది అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రసంగాలనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తన హరిత దినోత్సవ సందేశాన్నిచ్చారు.
మంత్రులు అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కె.నవీన్ కుమార్, కసిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, సుధీర్ రెడ్డి, జైపాల్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి,కాలె యాదయ్య. అంజయ్య యాదవ్, అటవీ కార్పోరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సిఎం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్, మాజీ పీసీసిఎఫ్ ప్రభుత్వ సలహాదారు శోభ, పిసిసిఎఫ్ డోబ్రియాల్, రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్, జిల్లా పరిషత్ చైర్మన్, తుమ్మలూరు సర్పంచ్ సురేఖా కరుణాకర్, తదితర అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నారంటే..
• సభకు వచ్చినటువంటి అన్నాదమ్ముళ్ళకు, అక్కా చెల్లెల్లకు అందరికీ నా నమస్కారాలు.
• తెలంగాణ పచ్చబడ్డది. ఏడెనిమిది ఏండ్ల నుండి మనందం పట్టుబట్టి, జట్టుకట్టి బీడుబారి పోయిన తెలంగాణనకు ఒక తొవ్వకు తెచ్చుకుంటున్నాం.
• తెలంగాణ పచ్చబడడానికి సంకేతంగా రెండు మూడు కారణాలున్నాయి. ఒకటి ధాన్యం ఉత్పత్తిలో 2014 లో మనం పదిహేను, పదహారవ స్థానంలో ఉన్నాం. రెండు భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ పేపర్లో రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. దీంతో పాటు అనేక రంగాల్లో మనం నెంబర్ వన్ గా వెలుగొందుతన్నాం.
• ఆస్తి, సంపదలు ఎంత ఉన్నా పిల్లలకు ఆరోగ్యంగా బతికే పరిస్థితులు ఉండాలి.
• ఇందిరా పార్కులో ఒకతను ఆక్సిజన్ అమ్ముతం కొనుక్కోండి అని అమ్మకానికి పెట్టిండు.
• మనకు భూములు, అడవులు, నీళ్ళు లేవా ? అడవులను విస్తృతంగా పెంచితే అపారమైన ఆక్సిజన్ మనకు లభిస్తుంది. ఇంతటి అద్భుతమైన పరిస్థితులున్న దేశంలో చాలా భయంకరంగా అడవులను నాశనం చేసి, ఒక మోడువారిన, బీడువారిన ప్రాంతం లాగా తయారు చేశారు.
• నేను హరితహారం గురించి చెప్తే ఎవరికీ అర్థం కాలేదు.
• అప్పట్లో పిసిసిఎఫ్ ఎస్.బి. ఎల్ మిశ్రా గారి నుండి ఇప్పటి పిసిసిఎఫ్ డోబ్రియల్ గారి వరకు ఒక ఉద్యమంలా హరితహారం కార్యక్రమాన్ని చేపడితే, అందరూ హాస్యాస్పదంగా భావించారు. ఇది అయ్యేదా, పోయేదా అన్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హరితహారం పై జోకులు వేశారు.
• తుమ్మలూరులో నేను సఫారీలో తిరుగుతుంటే మూడు నాలుగు ఏళ్ళ కిందట పెట్టిన మొక్కలు నేడు పెరిగి పెద్దవై బ్రహ్మాండంగా విస్తరిస్తున్న తీరును చూశాను. ఈ రోజు మరో 250 ఎకరాల వరకు మొక్కలను నాటారు.
• తెలంగాణలో ఈ రోజు 7.7 శాతం పచ్చదనం పెరిగింది. ఇదేదో మాటలు చెప్తే పెరగదు. తమాషాలు, కథలు చెప్తే కాదు.
• ఈ దిశగా అటవీ అధికారులు బాగా కృషి చేశారు. కానీ నేను అందరికంటే ఎక్కువగా గ్రామ సర్పంచుల్ని అభినందిస్తున్నాను. నేను చట్టం తెచ్చినప్పుడు వాళ్ళందరికి కూడా నా మీద కొంచెం కోపం వచ్చింది. కానీ నేడు ఆ చట్టం స్ఫూర్తితోనే గ్రామలు పచ్చగున్నాయి.
• ‘దారులన్నీ పూల తేరులై పోయినయ్’ అని ఈ మధ్య ఒక కవి పాట రాశాడు. రోడ్ల మీద పోతుంటే ఎటు చూసినా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. రంగుల రంగుల పూలతోని తెలంగాణ వీధులు అందంగా ఉన్నాయని కవి తన పాటలో చెప్పిండు. ఇది వట్టిగా జరిగేది కాదు.
• దాసర్ల పల్లెలో నాకు పొలం ఉండేది. నాకున్నపది పదిహేను ఎకరాలకు 20 బోర్లు వేయాల్సి వచ్చింది. సన్నగా పోసే బోర్లతో కష్టాలు పడ్డాం. ఆ బాధ వర్ణనాతీతం. తెలంగాణలో ఈ బాధలన్నీ చాలా వరకు తీరిపోయినయ్.
• మహేశ్వరం, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, వీరిద్దరినీ మించి ఎంపి రంజిత్ రెడ్డిగారు నేను కనపడినప్పుడల్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎప్పుడు పూర్తయితుందని నాతో పంచాయతీ పెట్టుకుంటారు.
• పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కూడా కాళేశ్వరంతో పాటే పూర్తి కావాల్సింది. రిజర్వాయర్లన్నీ కట్టినం. ఆగష్టులో వాటిని నింపుకోబోతున్నాం. దాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చి పనులు ఆగేట్టు చేశారు. ఈ విషయం ప్రజలను ఆలోచన చేయాలి.
• ఏదేమైనా భగవంతుని దయ వల్ల ప్రాజెక్టు పనులు దాదాపు 85 శాతం పూర్తయ్యాయి.
• మహేశ్వరం, ఇబ్రహీం పట్నం, వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్ళు తెచ్చే బాధ్యత నాది అని మీ బిడ్డగా హామీ ఇస్తున్నాను.
• ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు తన ప్రాంతానికి నీళ్ళు తెచ్చుకోవాలని చాలా తపనతో ఉన్నారు. నీళ్ళ కోసం అట్లాంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని నాకు తెలుసు.
• రాబోయే మూడు నాలుగు నెలల్లో మీరు మార్పును చూడబోతున్నారు.
• మీకో తీపి కబురు చెప్తున్నాను. కృష్ణా నదిలో నీళ్ళ కోసం పంచాయితీ ఉంద. కానీ గోదావరి నదికి సంబంధించి ఈ పంచాయితీ లేదు. గోదావరి నీళ్ళు మన హిమాయత్ సాగర్, గండిపేట వరకు లింక్ కాబోతున్నాయి. అక్కడి నుండి చిన్న లిఫ్ట్ పెట్టినా ఇక్కడి ప్రాంతాలకు కూడా నీళ్ళిచ్చే అవకాశం ఉంది. కిందనే కొండపోచమ్మ సాగర్ నుండి మూసీ నది నీళ్ళు దాటిస్తే నీళ్ళు దాదాపు లోయపల్లి దాకా వచ్చే అవకాశముంది. ఈ పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నారు. కృష్ణలో నీళ్ళు తక్కువబడినా, గోదావరి నది నుండైన ఇచ్చి ఈ ప్రాజెక్టును ఆదుకోవాలనే చర్చ జరుగుతున్నది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతానికి నీటిని తెస్తా అని నేను మనవి చేస్తున్నాను. మీరు చింతించాల్సిన అవసరం లేదు.
• నేను ముఖ్యమంత్రి అయిన మొదటి వారంలో అటవీశాఖతో రివ్యూ పెట్టాను. బీడుబారిన భూములు, నీళ్ళ కరువు. చాలా కష్టపరిస్థితులుండేవి.
• వానలు వాపస్ రావలె – కోతులు వాపస్ పోవాలే అనే పాట కూడా నేను రాశాను. పచ్చని అడవులున్నట్లయితే కోతులు ఊర్లకు రావు. మనం అనుభవించే కోతుల బాధ కూడా మీకు తెలుసు.
• ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హరితహారం కార్యక్రమాన్ని తెచ్చాం. అప్పుడు ఎంతోమంది నవ్వులాటగా ఈ చెట్లేంది కేసీఆర్ కు ఏం పని లేదా అనుకున్నారు.
• కానీ కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమం ఫలితాలు నేడు తుమ్మలూరులో కనబడుతున్నాయి. కరుణాకర్ రెడ్డి గారితో కలిసి కలియతిరిగి చూస్తూ ఓ పండుగ లాగా బ్రహ్మాండంగా కనబడుతున్నది. ఇట్లనే నాశనమైన అడవులను పునరుజ్జీవింప చేయాలి.
• భూపాల్ రెడ్డి గారు, ప్రియాంక వర్గీస్ గారు హరిత సైనికుల్లాగా పనిచేసి మంచి సమన్వయంతో గొప్ప ఫలితాలు రాబట్టారు.
• ఎక్కడ చూసినా తెలంగాణలో దారుల సుందరీకరణతో పాటు రిజర్వు ఫారెస్టులు పెరిగాయి.
• గ్రామాలు పచ్చబడిన కీర్తి సర్పంచులకే దక్కింది. దీన్ని మీరు కొనసాగించాలి.మీకు అదనంగా కావాలంటే నిధులు కూడా అందజేస్తాం.
• బతకడానికి అనువైన పర్యావరణ పరిస్థితులు కల్పించడం కూడా మన తరం బాధ్యత
• హరితహారంతో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అటవీ శాఖ అధికారులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
• పచ్చదనాన్ని పెంపొందించడంలో రెండు దేశాలు గొప్ప ప్రయత్నాలు చేశాయి. చైనా దేశంలోని గోబి ఎడారి విస్తరణను అరికట్టేందుకు ఈ దేశ ప్రజలు పట్టుబట్టి 500 కోట్ల మొక్కలు నాటారు. తగ్గుతున్న పచ్చదనాన్ని పెంపొందించేందుకు బ్రెజిల్ దేశంలో 300 కోట్ల మొక్కలు నాటి ఫలితాలు సాధించారు.
• ఇవ్వాళ తెలంగాణలో కూడా 276 కోట్ల మొక్కలను మనం ఇప్పటికే నాటాం. మనం చాలా అడ్వాన్స్ డ్ గా ఉన్నాం. ప్రతీ ఊరిలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు వాటిలొ ఓపెన్ జిమ్ లున్నాయి. అర్బన్ పార్కులు గొప్పగా తీర్చిదిద్దుకుంటున్నాం. ఇప్పటికే 170 అర్బన్ పార్కులు పూర్తయ్యాయి. ఇంకా రూపుదిద్దుకొంటున్నాయి. ఇది మనందరి విజయం. మన సమిష్టి విజయం. తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు.
• ఈ సంవత్సరం నుండి ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడానికి 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టమని నేను చీఫ్ సెక్రటరీ గారితో చెప్పాను. ఇది కూడా ప్రారంభమవుతుంది.
• సబితా ఇంద్రారెడ్డి గారి డిమాండ్లను నెరవేరుస్తాం. మహేశ్వరం నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేస్తాం. తుమ్మలూరు సబ్ స్టేషన్ ను కూడా మంజూరు చేస్తాం. వీలయినంత త్వరగా పూర్తి చేస్తాం.
మెట్రోని కూడా ఇక్కడి దాకా విస్తరించమనే డిమాండ్ దృష్ట్యా మహేశ్వరానికి మెట్రో తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తాను.
• తెలంగాణ కోసం పోట్లాడుతుంటే మీకు వ్యవసాయం చేయడం కూడా మేమే నేర్పినం.మీకు అన్నం తినుడు కూడా మేమే నేర్పినం అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో మనల్ని ఎక్కిరించినవారు ఏడవ స్థానానికి పోయారు.
• చరిత్రలో కనీవిని ఎరుగుని సంక్షేమ పథకాలను మనం అమలు చేసుకుంటున్నాం.
• దివ్యాంగులకు ఇచ్చే 3016 రూపాయల పెన్షన్ ను 1000 రూపాయలు పెంచి 4016 రూపాయలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించాను
• రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం. వాటన్నింటిని జూనియర్ కాలేజీలు చేసుకున్నాం.
• ఇవన్నీకూడా ఒక కులానికో, మతానికో, జాతికో పరిమితమైనవి కాదు
• అన్ని వర్గాలను ఆదుకుంటూ ముందుకు పోతున్నం.
• గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ కార్యక్రమాలు, ఇలా అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం.
• ఆర్థిక పరపతిలో దేశంలో నెంబర్ వన్ లో ఉన్నాం
• తలసరి విద్యుత్ వినియోగంలో, తలసరి ఆదాయంలో, అత్యధిక ధాన్యపు రాశులు పండించడంలో, 24 గంటలు విద్యుత్ సరఫరాలో, ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీటిని అందించడంలో తెలంగాణ నంబర్ వన్.
• 100 శాతం ఓడిఎఫ్ సాధించడంలో తెలంగాణ నంబర్ వన్.
• నంబర్ వన్ అంటే ఎవరు ? తెలంగాణ ప్రజలే కదా.
• సర్పంచ్ నుండి ఎమ్మెల్యే వరకు ప్రతీ ఒక్కరు అద్భుతంగా పనిచేస్తున్నారు కాబట్టీ అద్భుతంగా పనులు జరుగుతున్నాయి.
• యాదయ్య, ప్రకాశ్ గౌడ్ గారు ఎప్పుడు వచ్చిన తపనతోని మాట్లాడతారు. ప్రజలు మంచి చేసే పనులు చేయాలని ఆలోచిస్తారు. ఇలాంటి ప్రజాప్రతినిధులున్నారు కాబట్టే మనం లక్ష్యాలను సాధిస్తున్నాం.
• జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, లోకల్ బాడీలకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
• దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తుమ్మలూరుకు 1 కోటి రూపాయలతోని కమ్యూనిటి హాల్ ను మంజూరు చేస్తున్నాను. ఈ దశాబ్ది ఉత్సవాల గుర్తుగా దీనికి ‘దశాబ్ది కమ్యూనిటి హాల్’ అని పేరు పెట్టమని నేను కోరుతున్నాను.
• ఈ పరిధిలోని 65 గ్రామ పంచాయతీలకు ప్రతి పంచాయతీకి రూ. 15 లక్షల చొప్పున స్పెషల్ ఫండ్ నిమిత్తం వెంటనే జీవో జారీ చేస్తాం. వీటితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవలని కోరుతున్నాను.
• వీటితో పాటు జల్ పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు చెరో రూ. 25 కోట్లను మంజూరు చేస్తున్నాను.
• బడంగ్ పేట, మీర్ పేట మున్సిపాలిటీలకు చెరో రూ. 50 కోట్లను మంజూరు చేస్తున్నాను.
• ఈ శాఖా మంత్రి చాలా తపన పడి పని చేస్తారు కాబట్టీ ఈ నిధులను సద్వినియోగపరుచుకుంటారని మంజూరు చేస్తున్నాం
• ఒక దుర్మార్గుడు ఒక ఫారెస్ట్ అధికారిని చాలా దారుణంగా చంపాడు. కానీ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ భార్యకు నియామక ఉత్తర్వు అందేజేశాం. మనిషినైతే తేలేం. కొన్ని డబ్బులు కూడా అందించాం. ఇలాంటి ఇబ్బందులు మీకు కలగకుండా పోలీస్ స్టేషన్లతో పాటు సాయుధ సాయం కూడా అందిస్తాం. 20 వరకు స్టేషన్లు అవసరమవుతాయని చెప్పారు. ఈ దిశగా ముందుకు పోదాం.
• అటవీ శాఖ అధికారుల సహకారంతో బ్రహ్మండమైన ఫల వృక్షాలను ప్రజలు పెంచుకోవాలి.
• ఎక్కడిదాకా చెట్లు కనిపిస్తాయో అక్కడి దాకా తెలంగాణ రాష్ట్రమని, చెట్లు కనపడకపోతే అది తెలంగాణ ప్రాంతం కాదని పంజాబ్, ఢిల్లీ, ఉత్తర భారతదేశం నుండి వచ్చే డ్రైవర్లు మాట్లాడుకుంటారని వేరే డ్రైవర్లు చెప్తున్నారు.
• పసి పిల్లలను సాదినట్టు చెట్లను సాదాలి. పిల్లలను సాదుడు ఎంత ముఖ్యమో చెట్లను సాదుడు అంత ముఖ్యం
• అనేక విజయాలు సాధిస్తూ ఇంత దూరం వచ్చిన ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకొని పోవాలి. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. అన్నీ పనులు జరుగుతాయి. నీళ్ళు వస్తాయ్. మెట్రో కూడా మహేశ్వరం దాకా వస్తుంది. బిహెచ్ఈఎల్ దాకా పొడిగించుకున్నాక మహేశ్వరం దాకా వస్తుంది.
• మరో విడతలో మనమే వస్తాం కాబట్టీ అన్ని పనులు చేసుకుందాం.
• ఇంతటి ఎండలో ఉక్కపోత కూడా భరిస్తూ మీరందరూ వచ్చి దీవించినందుకు మీ అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు.
• జై తెలంగాణ – జై భారత్
ప్రసంగం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పిసిసిఎఫ్ రాకేష్ మోహన్ డోబ్రియాల్ తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి జ్ఞాపికను అందజేశారు.
ఎఫ్ఆర్ఓ శ్రీనివాస రావు సతీమణి భాగ్యలక్ష్మికి ఉద్యోగ నియామక పత్రాల అందజేత
అటవీ రక్షణలో భాగంగా, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ఆర్ఓ బండి శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకుంటామని నాడు చేసిన ప్రకటనను సిఎం కేసీఆర్ నేడు నిజం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్థిక సాయాన్ని అందించిన నేపథ్యంలో సోమవారం నాటి సమావేశ వేదిక మీద బండి శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి , డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగ నియామక ఉత్తర్వులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు అందచేశారు. తద్వారా అటవీ శాఖ ఉద్యోగులను, వారి కుటుంబాలను ప్రభుత్వం కడుపులో పెట్టి చూసుకుంటుందనే సందేశాన్ని సీఎం ఇచ్చారు.