– అడవుల్లో చిక్కిన మావో అగ్రనేత హిడ్మా
– ఆయన భార్య కూడా హతం
* – న్యూ ఆటోనగర్‌లో 28 మంది, రామవరప్పాడులో నలుగురు మావోయిస్టుల పట్టివేత*
*- 20 రోజులుగా తలదాచుకుంటున్నట్టు సమాచారం*
*- *ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్ చంద్ర లడ్డా
మారేడుమిల్లి: ఇటీవలి కాలంలో ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో చావుదెబ్బ తింటున్న మావోయిస్టు పార్టీకి తాజాగా మరో చావుదెబ్బ తగిలింది. గెరిల్లా యుద్ధంతోపాటు, మెరుపు దాడులు, మెరుపు వ్యూహాలు రచించే మాస్టర్‌మైండ్ హిడ్మాను.. ఏపీ ఎస్ఐబి ఆయన భార్యతో సహా మట్టుపెట్టింది. వారితోపాటు మరో ఆరుగురు మావోలు మృతి చెందారు. తాజా ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి వజ్రాఘాతమే. నిజానికి హిడ్మా కదలికలపై గత కొద్దిరోజుల నుంచి.. సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్న ఎస్ఐబి అధికారులు, చాపకింద నీరులా ఆపరేషన్ నిర్వహించి, లక్ష్యం సాధించారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో హిడ్మా మరణించాడు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, కీలకమైన మావోయిస్టు డాక్యుమెంట్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా భార్య రాజే కూడా ఉన్నారు. విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు.కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో కలిపి మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. గత నెల రోజులుగా వీరి కదలికలపై నిఘా పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులు మృతి చెందారని అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ వెల్లడించారు. మంగళవారం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగిందని తెలిపారు. మరో ఐదుగురు మావోయిస్టులు ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నారన్నారు. వారి కోసం కూంబింగ్ కొనసాగుతోందని చెప్పారు. మరణించిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా 28 హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నారని వివరించారు. అతడిపై అనేక రివార్డులు ఉన్నాయని గుర్తు చేశారు.
హిడ్మా కదలికలపై గత మూడు వారాలు నుంచే సమాచారం ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై పోలీసులు ఉక్కుపాదం మోపటం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి వారు చేరుకున్నారన్నారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. ఇప్పటికే మృతి చెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు.
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతోపాటు అతడి అనుచరులు మరణించారని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి ధృవీకరించారు. మావోయిస్టులపై ఇతర రాష్ట్రాల్లో పోలీస్ నిఘా అధికంగా ఉండడంతో ఆగ్రనేతలంతా ఏవోబీలోకి ప్రవేశిస్తున్నారని వివరించారు. విశాఖ రేంజ్లో మావోయిస్టులకు ఆశ్రయం పొందేందుకు వీలు లేదన్నారు.
విజయవాడలో చిక్కిన 28 మంది మావోయిస్టులు
విజయవాడ శివారు న్యూ ఆటోనగర్‌లో పోలీసులకు చిక్కిన 28 మందిలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక సభ్యులు ఉన్నట్లు ఎస్ఐబీ అధికారులు గుర్తించారు. న్యూ ఆటోనగర్‌లోని ఆటో మొబైల్ పరిశ్రమలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు పని చేస్తున్నారు. వీరిలో అధిక శాతం మంది ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌కు చెందిన వారు ఉన్నారు.
వారిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జికి రక్షణగా ఉన్న 9 మంది సుశిక్షితులైన కమాండోలు ఉన్నారని.. దేవ్ జికి రక్షణ దళం కమాండర్ జ్యోతి సైతం, విజయవాడ షెల్టర్ జోన్లో దొరికిన వారిలో ఒకరని అధికారులు వెల్లడించారు. మిగతా 19 మంది కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాకు రక్షణగా ఉన్న ఫ్లటూన్ సభ్యులని ఎస్ఐబీ అధికారులు వెల్లడించారు.
ఏలూరు,కాకినాడ జిల్లాలోనూ..
కాకినాడ జిల్లాలోనూ ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో దొరికిన డైరీ ఆధారంగా వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏలూరులోనూ మావోయిస్టుల కలకలం రేగింది. ఏలూరు గ్రీన్ సిటీలో తలదాచుకున్న మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పక్కా సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, దాదాపు 15 మంది మావోలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రీన్ సిటీలోని ఒక ఇంటిలో గత వారం రోజులుగా మావోలు తలదాచుకున్నట్లు సమాచారం.






