– ఇదే కాంగ్రెస్ బీసీ బిల్లు అసలు లక్ష్యం
– బీసీ రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు లబ్ది
– కాంగ్రెస్ రిజర్వేషన్ వెనక కుట్ర ఇదే
– మజ్లిస్‌కు మరిన్ని సీట్లు కేటాయించే ఎత్తుగడ
– దానితో బీసీల నోట్లో మన్నుపోసే కుట్ర
– ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ విమర్శలు దారుణం
– కాంగ్రెస్‌ది పాకిస్తాన్ భాష.. దానికి టీఆర్ఎస్ వత్తాసు
– కాంగ్రెస్-టీఆర్ఎస్కు ఏదీ దేశభక్తి?
– కాంగ్రెస్ రిజర్వేషన్ వెనక కుట్ర ఇదే
– ఖమ్మం గడ్డను బిజెపి అడ్డాగా మార్చుతాం.
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు లో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు
ఇల్లందు: 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన చేస్తూ, రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగా ఆ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రకు బీసీ సంఘాలు అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలోని బీసీ నాయకులు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
GHMC పరిధిలో 50 డివిజన్లు బీసీ రిజర్వేషన్ కింద ఉన్నాయి. అయితే గతంలో బీసీలకు రిజర్వు చేసిన డివిజన్లలో 35 సీట్లను మజ్లిస్ అభ్యర్థులకు కేటాయించడం వల్ల బీసీల ప్రాతినిధ్యం తగ్గిపోయింది. మండల్ కమిషన్ రిపోర్టు వచ్చినప్పుడు వీపీ సింగ్ ప్రభుత్వానికి బిజెపి మద్దతు ఇచ్చింది.
గత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 4 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు కేటాయించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు 10 శాతానికి పెంచి, ఎంఐఎం కు ఇంకొన్ని సీట్లు దారాదత్తం చేయాలని చూస్తోంది. ప్రతిసారీ ఓబీసీలకు ఈ విధంగా అన్యాయం జరుగుతోంది.
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి నైతికంగా విమర్శించే హక్కే లేదు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అనంతరం సుప్రీంకోర్టులో కేసు ఉంది అనే నెపంతో దానిని 28 శాతానికి పరిమితం చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్లను అమలు చేయలేక బిజెపిపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లలో మతపరమైన రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడానికి అధికారం లేదు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు బిజెపి మద్దతు ఇస్తోంది. దానికి కావాల్సిన చట్ట సవరణ చేయాలి. ఆర్డినెన్స్‌ను బహిర్గతం చేయాలి.
బిజెపి ఓబీసీల పక్షాన ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంది. ఆపరేషన్ సిందూర్‌పై నిన్న పార్లమెంట్లో చర్చ జరిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం బాధాకరం. గతంలో ఉరి సర్జికల్ స్ట్రైక్స్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది.
పదేపదే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు భారత సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షిస్తున్న సైనికులను తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడారు. భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌పై.. మసూద్ అజర్ చెబుతున్నట్టే… సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని వ్యాఖ్యానించారు. భారత ఆర్మీని కించపర్చేలా మాట్లాడారు.
ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో 9 ఉగ్రస్థావరాలు ధ్వంసమయ్యాయి. కానీ ఈ విషయంలో భారత సైనికుల త్యాగాలను కించపరిచేలా, పాక్‌కు అనుకూలంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడటం బాధాకరం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ సిందూర్ గురించి, భారత ఆర్మీ చర్యల వెనుక ఉన్న సాహసాన్ని, వ్యూహాన్ని, విజయాలను స్పష్టంగా వివరించారు. కాని, కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సిందూర్‌పై విమర్శలు చేస్తూ పాకిస్తాన్ భాష మాట్లాడుతోంది. ఆ భాషకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తోంది.
దేశ వ్యతిరేక కార్యకలాపాల విషయంలో, దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలు కలిసి వ్యవహరిస్తున్నాయి. దీనిని బిజెపి సహించదు. దేశానికి, ఓబీసీలకు కాంగ్రెస్ ద్రోహం చేస్తోంది. కమ్యూనిస్టు పార్టీల నుంచి అనేకమంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు.
ఖమ్మం జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిజెపి కార్యకర్త సాయి గణేష్‌పై తప్పుడు కేసు పెట్టి ఒత్తిడి తేవడం వల్ల తీవ్ర మనోవేదనకు గురై, ఆత్మహత్య చేసుకున్నారు. ఇది బాధాకరమైన విషయం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం క్యాడర్ మొత్తం బిజెపి వైపు చూస్తోంది. బిజెపిలో చేరాలని చూస్తున్నారు.
నేను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో పర్యటిస్తున్నాను. దక్షిణ తెలంగాణలో బిజెపి ని బలోపేతం చేయడమే నా లక్ష్యం. కమ్యూనిస్టులు గతంలో ఖమ్మం జిల్లాను తమ అడ్డాగా చెప్పుకున్నారు. భవిష్యత్తులో ఖమ్మం గడ్డను బిజెపి అడ్డాగా మార్చుతాం.
మహబూబాబాద్‌లో కూడా కార్యకర్తలు, ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. పూర్తి కాకుండా నిలిచిపోయిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టులను త్వరితంగా పూర్తి చేసి బీడు భూములకు సాగునీరు అందించాలి. దీనిపై మా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వానికి స్పష్టత కోరతారు.