– కూటమి ప్రభుత్వం ₹9,000 కోట్ల బాండ్ల విడుదల కోసం ₹1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను సెక్యూరిటీగా పెట్టింది
– మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.యస్.జగన్ ట్వీట్
అమరావతి: నిన్న చంద్రబాబునాయుడు , టీడీపీ కూటమి ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధ భాగానికి సంబంధించిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) ప్రాథమిక అంచనాలను విడుదల చేసింది. చంద్రబాబు డైరెక్షన్లో ప్రజలను మోసం చేయడానికి ఈ అంకెలను తయారు చేసినట్టుగా చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ప్రాథమిక అంచనాల గణాంకాలను ప్రభుత్వం తయారు చేయగలుగుతుంది. అలాగే కావాలనుకుంటే వక్రీకరించగలుగుతుంది కూడా. కానీ, దేశంలోనే రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన కాగ్ (CAG), రాష్ట్ర ఖాతాలను ఆడిట్ చేసి వెల్లడించే గణాంకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు కూడా వక్రీకరించ లేరు.
రాష్ట్ర ఖాతాలను పరిశీలించి కాగ్ విడుదల చేసిన గణాంకాల ద్వారానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాస్తవికత ఏంటో తెలుస్తుంది. కాగ్ వెల్లడించే గణాంకాలు చంద్రబాబుగారి సలహా ప్రకారమో లేక ఆయన మార్గనిర్దేశంలోనూ తయారైనవి కావు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నిజమైన ఆదాయాలు, చేసిన వాస్తవ ఖర్చుల ఆధారంగా ఈ సమగ్ర గణాంకాలు వెల్లడవుతాయి.
ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో కాగ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాస్తవం ఏమిటంటే…
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. రాష్ట్ర ఆదాయాల పెరుగుదల అతి దారుణంగా పడిపోయింది చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో రాష్ట్ర అప్పులు పెరిగాయి. మూలధన వ్యయం అత్యంత తక్కువ స్థాయికి చేరింది. మూలధన వ్యయం, సగటు పౌరుడు చేసే ఖర్చులు ప్రమాదకరంగా తగ్గాయి. రెవెన్యూ లోటు, ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి.
భారీ అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయాలకు భారీగా గండి పడుతోంది.
పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సరే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటూ ప్రజలను మోసం చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా, అబ్రహం లింకన్ గారి మాటలు గుర్తు చేయాల్సి వస్తోంది. ‘‘కొంతకాలం పాటు ప్రజలను మభ్య పెట్టగలవు, ఎల్లకాలం ప్రజలందరినీ మభ్య పెట్టలేవు’’ అంటూ లింకన్ గారు అన్న మాటలు ఇప్పుడు చంద్రబాబుకి సరిపోతాయి.
నేను అడిగే ఈ ప్రశ్నలకు చంద్రబాబునాయుడుగారు సమాధానం చెప్పగలరా?.
నిజంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది?
2014–19 మధ్య అప్పటి మీ పాలనలో GSDP వృద్ధి అంత గొప్పదైతే, దేశ GDP లో రాష్ట్రం వాటా 4.45%కి మాత్రమే ఎందుకు పరిమితమైంది.
వైయస్ఆర్సీపీకి ప్రజలిచ్చిన ఐదేళ్ల కాలంలో కోవిడ్ మహమ్మారి ద్వారా రెండేళ్ల పాటు సంక్షోభం తలెత్తినా సరే వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో దేశ GDP లో రాష్ట్రం వాటా (2019–24) మధ్య 4.78%గా ఉన్న మాట వాస్తవం కాదా?
మీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత బాగా నడిచినట్లయితే, తలసరి ఆదాయంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం ర్యాంకు ఒక్క మెట్టైనా ఎందుకు పెరగలేదు?
విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయలేదని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. వాస్తవాలకు ఇది పూర్తి విరుద్ధం. FPPCA (Fuel and Power Purchase Cost Adjustment) పేరుతో, చంద్రబాబుగారి ప్రభుత్వం గత ఒకటిన్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలపై ₹18,272 కోట్లు భారం వేసింది. గత ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలపై సెక్యూరిటీ సృష్టించింది, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టింది అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
సరే గత ప్రభుత్వం ₹25,000 కోట్ల రుణం కోసం ₹1,941 కోట్ల విలువైన ఆస్తులను తాకట్టు పెట్టింది.
కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ₹9,000 కోట్ల బాండ్ల విడుదల కోసం ₹1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను సెక్యూరిటీగా పెట్టింది. భవిష్యత్తు ఆదాయాలనూ అప్పులకోసం పణంగా పెట్టింది. ఇంకా, రాష్ట్ర సంచిత నిధి (Consolidated Fund of the State) మీద బాండ్ హోల్డర్లకు యాక్సెస్ రైట్ ఇచ్చింది. ఇది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని, అత్యంత ప్రమాదకరమైన చర్య.