Suryaa.co.in

Editorial

మాస్టారూ.. మీకు అర్ధమవుతోందా?

– ‘ఫ్యాన్’ గాలికి ‘పువ్వు’ పరిమళిస్తోంది
– పవన్, రాజు, కన్నా, సుజనా దారెటు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇంత వయసొచ్చినా నీకు… అంటూ పెద్దవాళ్లను, ఇంకొంచెం పెద్దవాళ్లు అక్షింతలు వేస్తుంటారు. కారణం వాళ్లకి లోకజ్ఞానం పెద్దగా అబ్బలేదన్న ఆవేదన. ఎలా బతికేస్తారోనన్న ఆందోళన. అదీ వారి అక్షింతలకు అసలు కారణం. ఒకప్పుడు రాజకీయాల్లో కూడా సీనియర్లు, జూనియర్లకు మంచీచెబ్బర చెప్పేవాళ్లు. ఏది లాభమో, ఏది నష్టమో చెప్పేవాళ్లు. జూనియర్లు కూడా సీనియర్ల వద్దకు వెళ్లి రాజకీయాల్లో మెళకువలు నేర్చుకునేవారు. ఇప్పుడు చెప్పడానికి సీనియర్లు లేరు. వినడానికి జూనియర్లూ సిద్ధంగా లేరు. ఆంధ్రాలో జరుగుతున్న చిత్ర-విచిత్ర రాజకీయాలపై, పెద్ద వయసు నేతలు కూడా ఇలాంటి తెలిసీ-తెలియని మాటలు మాట్లాడుతున్న వైనం చూస్తుంటే.. ఇంకా లోకజ్ఞానం రాలేదా? ఒకవేళ వచ్చినా అమాయకంగా మాట్లాడుతున్నారా అనే డౌటనుమానాలొస్తున్నాయి. కావాలంటే మీరే ఓపాలి ఇటు చూడండి.

ఆంధ్రాలో అధికార వైసీపీ- ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య అప్పుడప్పుడూ మాటలు పేలుతుంటాయ్. అది కూడా అందరూ కాదు సుమా! సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, సుజనాచౌదరి, పురందీశ్వరి, ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్‌రాజు, నాగోతు రమేష్‌నాయుడు లాంటి ఐదారుగురు నేతలు మాత్రమే వైసీపీ మీద ఒంటికాలితో లేస్తుంటారు. తాజాగా ఐవైఆర్ కృష్ణారావు కూడా ఆ జాబితాలో చేరారు. అయితే సుజనాచౌదరి లాంటి వాళ్లు ఈ మధ్య కాలంలో సైలెంటయ్యారనుకోండి.

సరే.. సోము వీర్రాజు, దియోధర్, జీవీఎల్, విష్ణువర్దన్‌రెడ్డి లాంటి మరికొందరు ‘పోరాటయోధుల’ గురించి సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకోండి. వీళ్లంతా మీడియాలో అరగంట మాట్లాడితే.. అందులో ఒక ఐదునిమిషాలు పాపం వైసీపీ పాలన గురించి ప్రస్తావించి, మిగిలిన 25 నిమిషాలు మూడేళ్ల క్రితం ముగిసిన టీడీపీ పాలన గురించే ఇంకా మాట్లాడుతుంటారు. వారికి అదో తుత్తి. సరే ఎవరి తుత్తి వారిది. ఒక్క మొద్దు శీనన్నే కాదు. చాలామంది అన్నలు ‘బావకళ్లలో మెరుపుల’ కోసం పనిచేస్తుంటారు.

వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి ఓ అరడజను మంది బీజేపీని, ఆ పార్టీ ఏపీ లీడర్లను అప్పుడప్పుడూ విమర్శిస్తుంటారు. విజయసాయి దెబ్బకు, కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవే ఎగిరిపోయింది. అయితే కొందరు ఫ్లవర్ పార్టీ నేతలు పవర్‌ఫుల్‌గానే వైసీపీని విమర్శిస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం ఆ లెవల్‌లో కాకుండా, రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి మాట్లాడి.. మేమూ బీజేపీని విమర్శిస్తున్నామనిపించుకుంటారు. అయితే ఏపీలో వైసీపీ-బీజేపీది, తమలపాకులతో చేసుకునే బంతిపూల యుద్ధమేనన్నది బుర్రలో గుజ్జున్న ఎవరికయినా అర్ధమవుతుంది.

నిజానికి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో నడిచే ఎన్డీఏకు, వైసీపీ మిత్రపక్షం కాదు. కానీ అంతకుమించి…సహాయ సహకారాలందిస్తోంది. ఫ్లవర్‌పార్టీ పవర్‌ఫుల్లయినప్పటికీ, రాజ్యసభలో కొంచెం వీక్. కాబట్టి అక్కడ ఏ కష్టం వచ్చినా పుష్పానికి చెమట పట్టకుండా ఫ్యాను వేస్తుంటుంది. పాపం.. ఏ మాటకామాట. బీజేపీ కూడా జగనన్న సర్కారుకు, కొంచెం కూడా కష్టం రాకుండా, ‘పువ్వు’ల్లో పెట్టి మరీ చూసుకుంటోంది. మరి రాజకీయాలంటే ఇచ్చి పుచ్చుకోవడమే కదా?

కావాలంటే మీరే చూడండి. పక్కనే ఉన్న కేసీఆర్ సర్కారు.. కేంద్రసాయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తుంటే, వికాసపురుషుడయిన మోదీ మాత్రం.. జగనన్న సర్కారు ఖజానా నింపేందుకే ఇష్టపడతారు. కేసీఆర్ సర్కారుపై బండి సంజయ్ నుంచి కౌన్సిలర్ వరకూ యుద్ధం చేస్తుంటే, ఏపీలో మాత్రం జగనన్న సర్కారు మీద ఈగనివ్వకుండా చూస్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మిత్రబంధం చాంతాడవుతుంది.

ఈ నిజాలు తెలియక.. తెరవెనుక దోస్తీ అర్ధం కాక.. ‘ఢిల్లీ ఫ్లవర్ల’ పాలిటిక్స్ తెలియక… పాపం ఏపీ బీజేపీ నేతలు అమాయక పుష్పాలవుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, వైసీపీపై దాడిలో టీడీపీ కూడా నివ్వెరపోయేంతగా బీజేపీ దూసుకుపోయింది. దానితో కన్నాను కట్ చేసి, సోమును తెరపైకి తెచ్చారు. కన్నా-సుజనాపై విజయసాయి ట్వీట్ చేసిన కొన్నాళ్లకే కన్నాను తొలగించేశారు. అయినా కూడా తత్వం తెలుసుకోలేని అంతపెద్ద కన్నా కూడా, ఇంకా వైసీపీ సర్కారును విమర్శిస్తుండటమే అమాయకత్వం.

కన్నా తర్వాత వైసీపీపై విరుచుకుపడిన సుజనా చౌదరి ప్రస్తుత పరిస్థితి అయోమయం, జగన్నాధం. వైసీపీతో తెరచాటు బంధం పుణ్యాన, పార్టీలో తన పొజిషన్ ఏమిటో తనకే తెలియని విషాదం. ఎంపీగా మళ్లీ రెన్యువల్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. అందుకే అందరికంటే ముందే తత్వం తెలుసుకున్న చౌదరి గారు, ఈమధ్య ఎక్కడా కనిపించడం- వినిపించడం మానేశారు. సరే.. పురందీశ్వరి అందరికంటే నాలుగాకులు ఎక్కువ చదివిన పనిమంతురాలయినందున.. ఆమె లౌక్యం, లోకజ్ఞానం వేరు. ‘ఎన్టీఆర్ కూతురి కార్డు’న్నంతవరకూ ఆమెకొచ్చిన ఢోకా ఏమీ లేదు. ఇక వ్యాపారస్తుడైన సీఎం రమేష్ రూటే సెపరేటు. చెప్పొద్దూ…పాపం వైసీపీ కూడా వీరిగురించి ఎప్పుడూ సీరియస్‌గా ఆలోచించదు. దాని టార్గెట్టల్లా సత్య, కన్నా, సుజనా మాత్రమే.

సరే.. ఒక కన్నా.. ఒక సుజనా.. ఒక ఆదినారాయణరెడ్డి.. ఒక విష్ణుకుమార్‌రాజులంటే వారికి ‘ఢిల్లీ ఫ్లవర్‌పార్టీ’ పాలిటిక్స్ గురించి తెలియదనుకోవచ్చు. కానీ.. ఏండ్లూ, పూండ్ల నుంచీ, నాయుడుగారితోపాటు పార్టీనే పట్టుకుని వేళ్లాడుతున్న సత్యకుమార్ అనుభవం ఏమయిందన్నదే ప్రశ్న. రాష్ట్రపతి అభ్యర్ధి ముర్ముకు మద్దతునివ్వాలని, తమ పార్టీ వైసీపీని కోరలేదని సత్య చెప్పడమేమిటి? ఓకే. ఓకే. పార్టీ ఇమేజీ డామేజీ కాకుండా.. తామూ వైసీపీ ఒకే తాను బట్టలం కాదని చెప్పడం కోసమే అలా చెప్పారనుకుందాం. సరే.. చెప్పారు పో.

వెంటనే వైసీపేయులు దానిని ఢిల్లీ ఫ్లవర్ పార్టీ పవర్‌ఫుల్ నేతలకు ఫిర్యాదు చేయడమేమిటి? ఆ వెంటనే కేంద్రమంత్రి షెకావత్ రంగంలోకి దిగి, ఆ సత్యకుమార్ చెప్పినవన్నీ ఆయన సొంతమే తప్ప, వాటితో

పార్టీకి సంబంధం లేదని చెపద్పడమేమిటి? ఆ మాట కేంద్రమంత్రి అయిన షెకావత్ చెప్పడమేమిటి? ఆ ముక్క చెప్పాల్సింది నద్దాజీ కదా? అంటే పార్టీలో నద్దాజీ నిమిత్తమాత్రుడేనన్న ప్రచారం నిజమేననుకోవాలా? మరిప్పుడు ‘అమాయక పుష్పం’గా మిగిలింది సత్యకుమారే కదా!

అయినా మొన్నటి భీమవరం సినిమా చూసిన తర్వాత కూడా సత్యకుమార్‌కు తత్వం బోధపడకపోతే ఎలా? వైసీపీ-బీజేపీ బంధం ఫెవికాల్ ఎంత పెనవేసుకుందో అంత అనుభవం ఉండీ తెలియకపోతే ఎలా? బహుశా..పార్టీ జాతీయ కార్యదర్శిని, పైగా ఏపీవాడిని కాబట్టి.. ఏపీకి సంబంధించిన అన్ని వ్యవహారాలూ తనతో చర్చించిన తర్వాతే, పార్టీ నిర్ణయిస్తుందన్న భ్రమ-ఆశల్లో ఉన్నారేమో?! సత్య వ్యాఖ్య, ఆ తర్వాత షెకావత్ ఖండన చూస్తే అదే అనిపిస్తుంది మరి!

అన్నట్లు.. భీమవరం సినిమా అంటే గుర్తుకొచ్చింది. మొన్నటి మోదీజీ భీమవరం టూరు దృశ్యాలు చూసిన తర్వాత కూడా, సత్యకుమార్ అలాంటి కామెంట్లు చేయడమే ఆయన అమాయకత్వం. అల్లూరి కార్యక్రమం పేరుకు కేంద్రానిదే అయినా, పెత్తనమంతా వైసీపీ సర్కారుదే. భీమవరం వేదికపై ఎవరుండాలి? ఎవరు ఉండకూడదని డిసైడు చేసింది కూడా జగనన్నే. తన కంటికి ఎవరైతే కనపడకూడదనుకున్నారో, వారినెవరినీ దరిదాపులకు రాకుండా జగనన్న విజయవంతంగా అడ్డుకున్నారు. రాజకీయ పౌరోహిత్యం చేసింది కిషన్‌రెడ్డి అయినప్పటికీ, కర్త-కర్మ-క్రియ అంతా జగన్మోహన్‌రెడ్డే. ఏపీ రెడ్డి గారు చెప్పింది, ఢిల్లీ రెడ్డి గారు పాటించారంతే. ఇది బ్రహ్మరహస్యమే కాదు, బహిరంగరహస్యమే!

మరి కాకపోతే.. దేశంలో ఏ ప్రధాని కార్యక్రమానికయినా స్థానిక ఎంపీ పేరు ఉండదా? ఆయన పేరు శిలాఫలకం మీద ఉండదా? పీఎంఓ పంపే ప్రొటోకాల్ లిస్టులో స్థానిక ఎంపీ పేరు ఉండదా? మీరు ప్రధాని కార్యక్రమానికి వస్తే ఇబ్బందని ఏ ఎంపీకయినా, ఏ కేంద్రప్రభుత్వమయినా చెప్పకనే చెబుతుందా? నర్సాపురం ఎంపీ రఘురామరాజును, స్థానిక సర్కారు రానివ్వకుండా చూస్తోందన్న సమాచారం ఉండి కూడా పీఎంఓ చేష్టలుడి చూస్తుందా? ఇదే కార్యక్రమం ఏ కరీంనగర్‌లోనో, ఏ నిజామాబాద్‌లోనో జరిగితే.. బీజేపీ ఎంపీలను వేదికపైకి రాకుండా కేసీఆర్ సర్కారు అడ్డుపడితే కేంద్రం సహిస్తుందా? అయితే ఎంపీ రాజుకు సెక్యూరిటీ ఇచ్చింది కేంద్రమే కదా అని ప్రశ్నించవచ్చు.

ఫ్లవర్ పార్టీ పాలిటిక్సే అంత. రాజును ఎంతవరకూ వాడాలో పువ్వుపార్టీకి తెలుసు. తనను కేంద్రంలోని పువ్వుపార్టీ ప్రోత్సహిస్తుంది కాబట్టి, ప్రతి చోటా తన మాట చెల్లుతుందనుకోవడం రాజు భ్రమ, అమాయకత్వం. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అన్న సామెత మాదిరి అన్నమాట. యుపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన చిరంజీవి పనికివచ్చినప్పుడు, తన మిత్రపక్షమైన జనసేనాధిపతి పవన్ ఎలా పనికిరాకుండా పోయారు? బీజేపీ రోడ్డుమ్యాప్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పిన పవన్‌ను, అసలు తాను ఓడిన భీమవరం రోడ్డే ఎక్కనీయకపోవడమే వింత. ఫాఫం.. పవన్ గరళకంఠుడు కాబట్టి, ఆ అవమానం బలవంతంగా దిగమింగుకున్నారేమో?! చిరంజీవి స్థానికుడన్న వాదనే నిజమైతే.. అదే స్థానికుడు, తన పార్టీకే చెందిన మాజీ మంత్రి కృష్ణంరాజు కూడా స్థానికుడే కదా? ఆయననెందుకు పిలవలేదు?

వేదికపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి దర్శనమిచ్చినప్పుడు టీడీపీ అచ్చెన్నాయుడు, సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, కాంగ్రెస్ శైలజానాధ్ చేసిన పాపమేమిటి? సోము, పురందీశ్వరి చేసిన పుణ్యమేమిటి? అనువాదం పురందీశ్వరే చేయనక్కర్లేదు. కిషన్‌రెడ్డి కూడా చేయగలరు కదా? ఇలాంటి సవాలక్ష సందేహాలు, చర్చలు, విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా భీమవరం సినిమాను విజవయంతం చేశారు కదా.

మరి ఆ విషయం తెలిసి కూడా, వైసీపీ మద్దతు బీజేపీ కోరలేదని సత్యకుమార్ చెప్పడం అమాయకత్వమా? అవగాహనాలోపమా? ఏదేమైనా.. బీజేపీతో బంధం ఉన్న వైసీపీని ఎదిరించడమంటే ఏటికి ఎదురీదడమే అన్న తత్వం తెలుసుకుని.. ఒక సోము వీర్రాజు, ఇంకో జీవీఎల్, విష్ణువర్దన్‌రెడ్డి, మరో దియోధర్ లా పనిచేసుకుపోవడమే ఉత్తమమన్న సత్యాన్ని భీమవరం సినిమా బోధించింది. బుద్దుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయమయితే, ఏపీ పువ్వుపార్టీ నేతలకు భీమవరంలో జ్ఞానోదయమయింద్నన మాట. కాబట్టి..పవన్, సత్య,కన్నా,రఘురామకృష్ణంరాజు, విష్ణుకుమార్‌రాజు, ఆదినారాయణరెడ్డిగారూ… మీకు అర్ధమవుతోందా?

LEAVE A RESPONSE