Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్

– మంత్రి పొంగులేటి మధ్యవర్తిగా వ్యవహారం నడిపిస్తున్నారు
– అందుకే గత ప్రభుత్వ తప్పిదాలపై సీబీఐ ఎంక్వైరీ కోరడం లేదు
– దమ్ముంటే సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాయాలి
-రాష్ట్రం కోరితే 24 గంటల్లో సీబీఐ ఎంటర్ అవుతుంది
– కేటీ రామారావు కాదు డ్రామా రావు
– నేను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నో అవినీతి అంశాలను లేవనెత్తా
– మంత్రి పొంగులేటి, మాజీ మంత్రి కేటీఆర్, రాజకీయ డ్రామలో భాగంగానే సవాళ్లు చేసుకుంటున్నారు
– కాంగ్రెస్ అవినీతిపై నేను రోజూ మాట్లాడినా ఆరు నెలల టైం కూడా సరిపోదు
– నేను కూడా సవాల్ చేస్తున్న… ఎక్కడి రమ్మంటే… ఎపుడు రమ్మంటే అప్పుడు అవినీతి అక్రమాలు బయటపెట్టడానికి సిద్ధం
– మంత్రి పొంగులేటి, మాజీ మంత్రి కేటీఆర్ సిద్ధమేనా?
– నిరూపించకుంటే…రాజకీయాల నుంచి తప్పుకుంటా
– నిరూపిస్తే మంత్రి పొంగులేటి, మాజీ మంత్రి కేటీఆర్ తప్పుకుంటారా? అందుకు సిద్దమా?
– బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్ : బీజేపీ తరపున ఎప్పుడూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రజల దృష్టికి తీసుకొచ్చా. కానీ కేటీఆర్.. బీజేపీ ఏం చేయనట్లుగా.. ఆయనే ఏదో కొత్తగా ఆరోపణలు చేసినట్లుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడు కండ్లు తెరుచుకుని ఏదో రెండు మాటలు మాట్లాడి, మా పార్టీ బతికే ఉందని చెప్పుకునేందుకు మాట్లాడుతున్నాడు.

నేను అసెంబ్లీ సాక్షిగా ఎన్నో అవినీతి ఆరోపణలు చేశాను. అప్పుడు ఎన్నడూ స్పందించని కేటీఆర్.. ఇప్పుడు నా పేరు ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. 3 నెలల కింద ఒక ఆరోపణ చేసి ఢిల్లీ నుంచి ఫోన్లు రావడంతో, పార్టీ వద్దంటే సైలెంట్ అయ్యారని మాట్లాడాడు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. బీజేపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుంది. ఇలాంటి అంశాల సమయంలో ప్రజల పక్షానే నిలబడాలని చెబుతుంది.

ఎన్నడూ లేనిది కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు? దానికి కాంగ్రెస్ ఎందుకు స్పందిస్తోందనేది నిజాన్ని మీకు చెబుతాను. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే.. కాంగ్రెస్. ఆయన కుటుంబాన్ని పూర్తిగా కాపాడుతున్నదే ఢిల్లీ కాంగ్రెస్. కేటీఆర్, హరీశ్ రావు.. ఢిల్లీకి వెళ్లి కేసీ వేణుగోపాల్ తో ఏం ఒప్పందం చేసుకున్నారు? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాం. ఆ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుంటామని చెప్పింది వాస్తవం కాదా? మీరు కాంగ్రెస్ తో కలుస్తుంటే అందుకు ఒప్పుకోని సీఎం రేవంత్ వెళ్లకపోవడంతో, నేరుగా పొంగులేటి మధ్యవర్తిత్వంతో కలిసింది నిజం కాదా? రెవెన్యూ మంత్రి పొంగులేటి మీకు, కేసీ వేణుగోపాల్ రెడ్డికి మీడియేట్ చేస్తున్నది వాస్తవం కాదా? కలుపుకునే ప్రయత్నం చేస్తుంది నిజం కాదా?

సన్నాయి నొక్కుతున్న కేటీఆర్.. మీ బాగోతం పదేండ్లలో ప్రజలంతా చూశారు. మీరు మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండిపై విమర్శలు చేస్తారా? బీజేపీ తరుపున నేను లెవనెత్తినన్ని అంశాలు మీరు లెవనెత్తారా? కేటీఆర్. ప్రధాన ప్రతిపక్షం పేరుకేనా? కాంగ్రెస్ పై ఒక్క ఘాటు ఆరోపణ అయినా చేశారా? అందుకు గల కారణాలేంటో చెప్పండి. మీపై సీబీఐ, ఈడీ ఎంక్వైరీకి కాంగ్రెస్ రాయకపోవడం వెనుక కారణాలేంటి? మిమ్మల్ని కాపాడుతున్నది కాంగ్రెస్ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?

మీరు ఇంత స్వేచ్ఛగా హైదరాబాద్ లో కార్యకలాపాలు సాగిస్తున్నారంటే మీకు కాంగ్రెస్ పెట్టిన భిక్షే కదా? మీ మధ్య చీకటి ఒప్పందం లేకుండా మీపై సీబీఐ, ఈడీ ఎంక్వైరీకి ఎందుకు లెటర్ ఇవ్వట్లేదు? మీ హయాంలో నేరుగా సీబీఐ ఎంక్వైరీ ఇవ్వడానికి వీల్లేదని జీవో తెచ్చారు. హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది నిజం కాదా? సీబీఐ రావాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే, 24 గంటల్లో వారిని ఇక్కడికి దించుతాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రాయట్లేదు?

హెటిరో డ్రగ్స్ గురించి మాట్లాడితే ఆయన స్వయంగా మీ పార్టీ ఎంపీ(రాజ్యసభ సభ్యుడు) కాబట్టి దానిపై కేటీఆర్ మాట్లాడలేదు? సివిల్ సప్లయ్ శాఖపై నేను మాట్లాడినప్పుడు, మీరేదో మాట్లాడాలి కాబట్టి నెల తర్వాత మాట్లాడారు. కానీ బీజేపీ ఈ అంశాలపై కేంద్రానికి నివేదికలు ఇచ్చింది.కేంద్రప్రభుత్వం దీనిపై స్టడీ చేస్తోంది. నేనే స్వయంగా కేంద్ర సివిల్ సప్లయ్ మంత్రికి కలిసి లెటర్ ఇచ్చాను.దీనిపై విజిలెన్స్ కమిటీ కచ్చితంగా రాబోతోంది.

సీబీఐ, ఈడీ ఎందుకు రావడంలేదని అంటున్నారు కదా? గతంలో ఈడీ వస్తదా? బోడీ వస్తదా? అని అన్నారు. ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ తీగ లాగితే డొంక తెలంగాణలో దొరికింది మీకు తెలియదా?ఆరు నెలలు మీరు ఇబ్బందులు పడింది మీకు తెలుసు కదా? ప్రతిదానికి సీబీఐ రావాలని కోరుకుంటున్నారు. సీబీఐ రావాలని కోరుకోవడం మంచిది కాదు. నిజంగా సీబీఐ వచ్చే రోజు దగ్గర్లోనే ఉంది.

వారు వచ్చినప్పుడు ఒకటి కాదు రెండు కాదు. కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, భూ కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. ఏదో మాట్లాడాలి కాబట్టి.. మాట్లాడాలనుకునే డ్రామాలు మానుకోండి డ్రామారావు. ఆర్, ఆర్ఆర్, ట్రిపుల్ ఆర్, బీ ట్యాక్స్ వంటి అన్ని అంశాలపై నేను మాట్లాడాను.. స్వయంగా మోడీ కూడా దీన్ని ప్రస్తావించారు.సుంకిశాల, యూరో ఎక్సిమ్ బ్యాంక్, అమృత్ అవినీతిపై కూడా మాట్లాడాను.

అమృత్ అవినీతిపై నివేదికలు కూడా కేంద్రానికి ఇచ్చాను. గ్లోబల్ టెండర్లు అని చెప్పి అలా కాకుండా జేవీ శోధ కంపెనీకి కట్టబెట్టారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి ఆ వర్క్ వచ్చిందని చెప్పాను. రేవంత్.. ఆయన నా బామ్మర్ది కాదని, మాజీ ఎమ్మెల్యే భూపేందర్ రెడ్డి అల్లుడని అంటున్నాడు. ఆయన ఎవరికి ఏమవుతారో మాకు, ప్రజలకు సంబంధం లేదు. వేల కోట్ల కాంట్రాక్టును మీ బంధువుకు ఎలా ధారాదత్తం చేస్తారు? ఇది ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? అధికార దుర్వినియోగం కాదా?

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా, టెండర్లు ఫ్లోట్ కాకముందే టెండర్ పొంగులేటి కంపెనీ రాఘవ కన్ స్ట్రక్షన్ కు ఇవ్వబోతున్నట్లు, వారి ఆస్థాన గుత్తేదారు మెఘాకు ఇవ్వబోతున్నట్లు ముందుగానే చెప్పాను. ఈ రెండు కంపెనీలకు చెరి సగం పంచి ఇచ్చారు?వీటిపై కేటీఆర్ ఇప్పుడు కండ్లు తెరిచి మాట్లాడుతున్నారు. నేను రెండు నెలల కిందనే చెప్పాను. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి కుటుంబీకుడికి కాంట్రాక్ట్ ఇవ్వడం అధికార దుర్వినియోగం కాదా?

పొంగులేటికి మంత్రిగా కొనసాగే హక్కు కనీసం గంట సమయం కూడా లేదు. రాష్ట్రంలో ధనబలంతో రాజకీయం సాగిస్తున్నారు.నేను చేసిన ఆరోపణలపై చాలెంజ్ చేస్తున్నా. ఇదంతా వాస్తవం కాదని ఒప్పుకోమనండి. ఎంక్వైరీకి ముందుకు వచ్చే దమ్ముందా? ఇవన్నీ వాస్తవం కాదని తేల్చకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా? దీనికి కేటీఆర్, పొంగులేటి సిద్ధమా? హైడ్రా, ధరణి, కాంట్రాక్టులు, బ్యాంకు గ్యారెంటీలు ఏ అంశంపై ముందుకు వస్తారో రండి. నేను నిరూపించకుంటే రాజీనామా చేస్తా. కేటీఆర్, పొంగులేటి మభ్యపెట్టే రాజకీయాలు ఇకనైనా మానుకోండి.

ఎప్పటికప్పుడు బహిరంగ లేఖలు రాస్తూనే కేంద్రానికి నివేదికలు అందించాను. బీఆర్ఎస్ పై ప్రేమ, మీపై చీకటి ఒప్పందం లేకుంటే సీబీఐకి లేఖ రాయాలి.రేవంత్ రెడ్డి, పొంగులేటి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వారి డిపార్టుమెంట్లపై ఎన్నో వాస్తవాలను లేఖ ద్వారా పంపించాను. ఎఫ్ ఆర్ బీఎం పరిధి దాటి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.దివాళా తీసే పరిస్థితిలో ఉంది. కానీ మంత్రులు మాత్రం వేల కోట్లు సంపాదించి దిశలో ఉన్నారు. ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అన్నట్లుగా పరిస్థితి మారింది.

వారిచ్చిన ఏ హామీ నెరవేర్చరు.ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయరు.బీఆర్ఎస్ పాలనతో జరిగిన కుంభకోణాలు, అవినీతిపై వరుసగా ఆరు నెలలు ప్రెస్ మీట్ పెట్టినా ముగిసిపోనంత డేటా నా దగ్గర ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కొద్ది నెలల్లోనే చేసిన అరాచకాలు, అవినీతిపై నేను రోజూ మాట్లాడినా ఆరు నెలల టైం కూడా సరిపోదు.

మొత్తంగా ఏడాది పాటు ప్రతి అంశంపై మాట్లాడేంత డేటా నా దగ్గర ఉంది. నువ్వు చదువుకున్నోడివి అనుకున్నా. కానీ నీచంగా వ్యాఖ్యలు చేశావు.ఇప్పటికైనా నీచ, బురద రాజకీయాలు మానుకోవాలి. కేటీఆర్- పొంగులేటి చాలెంజ్ చేసుకోవడం కాదు. ఎక్కడికి ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. రాజీనామా నువ్ చేస్తావో. నేను చేస్తానో చూద్దాం.

LEAVE A RESPONSE