– రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్’ సూచించాం
– దాని వల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు
– ‘మావిగన్ కారిడార్’తో తొలి రోజు నుంచే రాజధాని
– అక్కడ కేవలం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలు
– ఆ ప్రాంతంలో పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు
– ఇంకా 110 కి.మీ మేర జాతీయ రహదారి ఉంది
– ఈనాడు రామోజీ వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ సంస్థ
– బలుసు శ్రీనివాస్‌కు చెందిన బీఎస్ఆర్ సంస్థకే పనులు
– ఆ రెండు సంస్థలకే వేల కోట్ల కాంట్రాక్ట్‌లు అప్పగింత
– ఇప్పటికే వాటికి 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్
– అంతా కలిసి దోచుకో.పంచుకో.తినుకో.. అదే డీపీటీ
– ఓర్చుకోలేక రెచ్చిపోతున్న ఏబీఎన్ రాధాకృష్ణ
– మన వారి ఇళ్లలోని మహిళలపైనా అసభ్య పదజాలం
– వైయస్సార్సీపీ శ్రేణులు, వైయస్సార్ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తోందా రాధాకృష్ణా?
– అధికారంలోకి వచ్చాక రాధాకృష్ణ గట్టిగా బుద్ధి చెబుతాం
– ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు.. గుర్తుంచుకొండి
– తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్సీపీ స్ధానిక సంస్ధల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి
తాడేపల్లి: రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్’ సూచించామని, దాని వల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదని, ‘మావిగన్ కారిడార్’తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. మావిగన్ కారిడార్‌లో కేవలం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలు అన్న ఆయన, ఆ ప్రాంతంలో పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో పాటు, 110 కి.మీ మేర జాతీయ రహదారి ఉందని, దీంతో రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
అమరావతిలో కనీస మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వైయస్ జగన్ గుర్తు చేశారు. అమరావతిలో పనులు పూర్తయ్యే సరికి ఎన్నేళ్లు, ఎన్ని దశాబ్ధాలు పడుతుందని, అప్పటికి నిర్మాణ వ్యయం ఎంతకు పెరుగుతుందని, దాని వల్ల రాజధాని రుణాలు ఇంకెంత పెరుగుతాయని.. ఇంకా అసలు రాజధాని ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు.
చంద్రబాబు తన పనులతో రాజధాని లేకుండా చేస్తున్నారన్న వైయ‹స్ జగన్, అందుకే ప్లాన్–బి కింద మావిగన్ ప్రతిపాదించామని చెప్పారు.
అయితే దాని వల్ల అమరావతిలో తమ అవినీతి కోటలు బద్ధలవుతాయని, తమ సూచనకు చంద్రబాబు ఒప్పుకోవడవం లేదని, మరోవైపు ఓర్చుకోలేక రెచ్చిపోతున్న ఏబీఎన్ రాధాకృష్ణ గతి తప్పి తమ పార్టీ నాయకులపై విమర్శలు చేశారని, వారి ఇళ్లలోని మహిళలపైనా అసభ్య పదజాలం ఉపయోగించారని వైయస్ జగన్ ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చాక గట్టిగా బుద్ధి చెబుతామన్న ఆయన, ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో వైయస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..:
మన 5 సంవత్సరాల కాలంలో మనం రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా మీ జగన్ బటన్లు నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లిపోవడం చూశాం. ఆ రూ.2,73 లక్షల కోట్లు ఎవరి అకౌంట్లలోకి పోయాయి, వారి ఆధార్ నంబర్లు ఏమిటి అన్నది కూడా మనం ఇవ్వగలుగుతాం. అంతగా మనం రూ.3.31 లక్షల కోట్లు అప్పు తెస్తే రూ.2,73 లక్షల కోట్లు ఈ మాదిరిగా మనం జమా ఖర్చు కూడా ఇవ్వగలుగుతాం. ఆధార్ నంబర్లతో సహా.
కానీ ఇదే చంద్రబాబు ఈ రెండు సంవత్సరాలు తిరక్క మునుపే.. మనం ఐదేండ్లలో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఈయన 2 సంవత్సరాలు తిరక్కుండానే రూ.3.52 లక్షల కోట్ల అప్పు. గ్రాస్ అప్పులు, ఇంకా కమిటెడ్ అప్పులు.. ఏకంగా రూ.3,52 లక్షల కోట్లు దాటాయి. మరి ఈ 3.52 లక్షల కోట్లు ఏమయ్యాయి? ప్రజలకు ఎందుకు బటన్లు లేవు. ప్రజల ఖాతాల్లోకి ఎందుకు రావడం లేదు? ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది? ఎవరి జోబుల్లోకి ఈ డబ్బంతా పోతోంది? అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ.
ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్›్జ, ల్యాటరైట్, గ్రానైట్, చివరికి చికెన్ అమ్మాలన్నా కూడా వీళ్లకు రావాల్సింది వీళ్లకు ఇస్తేనే చికెన్ అమ్ముతున్నారు మార్కెట్లో. అదర్ వైజ్ చికెన్ కూడా అమ్మనివ్వడం లేదు చాలా నియోజకవర్గాల్లో. ఆస్థాయిలో దోచుకుంటున్నారు.
ఇంకా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు. పీపీఏలు. మన హయాంలో మనం రూ.2.49కి పీపీఏ చేసుకున్నాం. రైతులకు మరో 25–30 ఏళ్లపాటు ఉచిత కరెంటు అన్నది ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా అందించాలన్న ఆరాటంతో రూ.2.49కే మనం పీపీఏలు చేస్తే ఆరోజు నానా యాగీలు చేసిన వీళ్లు ఈరోజు రూ.4.60కి పీపీఏ చేస్తున్నారు. ఎంత తేడా! కళ్ల ముందే కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూములు పప్పులూ, బెల్లాలకు అమ్మేస్తున్నారు. రూపాయికి షాపుకు పోతే చాక్లెట్ వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో రూపాయికి కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తున్నాయి. కళ్ల ఎదుటే రుషికొండకు ఎదురుగా 50 ఎకరాల ప్రభుత్వ భూమి, చంద్రబాబు తన సమీప బంధువు అయిన, విశాఖపట్నం ఎంపీకి రూ.5 వేల కోట్లు విలువజేసే భూమిని ఫ్రీగా ఇచ్చాడు. ఊరికే రెగ్యులరైజేషన్ చేశారు.
ఇక అమరావతి గురించి చెప్పాల్సిన పనిలేదు. అమరావతిలో ఎంత దారుణమైన స్కాములు జరుగుతున్నాయన్నది మనందరికీ ఇప్పటికే అర్థమైంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ లెవెల్లో.. ఇటాలియన్ మార్బుల్ వంటి సదుపాయాలతో కట్టినా నిర్మాణాలు చేయడానికి చదరపు అడుగుకి అయ్యే ఖర్చు రూ.4500కు మించదు. కానీ అమరావతిలో మాత్రం అడుగుకు రూ.12 వేల నుంచి రూ.14 వేలు ఖర్చవుతోంది. 6 లైన్ల జాతీయ రహదారి టెండర్లు పిలిస్తే కి.మీ రోడ్డు రూ.20 కోట్లకు పూర్తవుతోంది. ఇక్కడ మాత్రం రూ.53 కోట్లవుతోంది.
ఎక్కడా లేని స్కాములు. ఎవరు ఈ స్కాముల్లో భాగస్వాములు అంటే, ఈనాడు కిరణ్ వియ్యంకుడు ఒకరు. ఇంకొకరు చంద్రబాబు బినామీ బలుసు శ్రీనివాసరావు (బీఎస్సార్). అంతా వీళ్లే. వీళ్లకు కొత్తగా మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్సులు. ఇంతకుముందు వర్కులు చేస్తే బిల్లులు చెల్లించే వాళ్లం. చంద్రబాబు పాలనలో వర్కులు చేయాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు అందరూ చంద్రబాబు మనుషులే. అందరికీ 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సు. ఒక్కొక్కరికీ రూ.6 వేల కోట్ల వర్కులు. దానికి రూ.600 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు. వర్కులు చేయడం కథ దేవుడెరుగు ఫస్ట్ మొబిలైజేషన్ అడ్వాన్సులు. ఆ స్థాయిలో దోచేస్తున్నారు. ఇలా కొల్లగొడుతూ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది? ఇలా దోచుకుంటూ పోతే రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వర్గాల పరిస్థితి ఏంటి?.
రైతులకు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. రైతులకు కరువొచ్చినా, తుపాన్ వచ్చినా ఆదుకునే నాథుడు లేడు. వాళ్ల ఖర్మకి వదిలేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మరుసటి సీజన్‌కి రైతును సన్నద్ధం చేసేవాళ్లం. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడేవాడే లేడు. ఆక్వాకి సంబంధించీ అదే పరిస్థితి. ఎక్కడా పట్టించుకునే దిక్కు లేదు. ఈరోజు నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3200 కోట్లు బకాయిలు ఉన్నాయి, చంద్రబాబూ వాటిని చెల్లించకపోతే చేతులు ఎత్తేస్తున్నాం.. మేం బోర్డు తిప్పేస్తామని ఏకంగా ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. పేదవాడికి వైద్యం అందకపోయినా కనీసం ఆలోచన చేసే నాథుడే ఈరోజు కనిపించడం లేదు.
ఇలాంటి పరిస్థితుల మధ్య వైయస్సార్సీపీ శ్రేణులు ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు. వైయస్సార్సీపీ జెండాను చేత బట్టుకుని ప్రజలకు అండగా, తోడుగా మేం ఉన్నామని గర్వంగా చెబుతున్నాను. కళ్లు మూసుకుని తెరిచేలోపు ఐదేళ్లలో సగం కాలం అయిపోయింది. ఇక మిగిలింది సగం కాలమే.
కూటమి పాలనకు సగం టర్మ్ అయిపోయింది. మిగిలింది ఒక సగం టర్మ్ మాత్రమే. ఇంకో సంవత్సరం దాటితే, రేపటి సంవత్సరం వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నేను రోడ్డు మీదకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాను. పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తాం.
చంద్రబాబు తన చర్యలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు. ‘మావిగన్’. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబుగారు మీ చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తున్నారు. మీ తీరుతో రాష్ట్రానికి క్యాపిటల్ అనేది ఉండదు. ఇది మానుకోండి.
మచిలీపట్నం నుంచి (మా), విజయవాడ నుంచి (వీ), గుంటూరు నుంచి (గన్) అంటూ మావిగన్ ప్రతిపాదన చేశాం. ఈ 110 కిలోమీటర్ల ఎకనామిక్ కారిడార్‌ను క్యాపిటల్ కారిడార్‌గా డిక్లేర్ చేసి, ఆ కట్టే బిల్డింగ్లు ఇక్కడ కట్టండి. రెండు లక్షల కోట్లలో 10 శాతం ఇక్కడ ఖర్చు చేసి రోడ్లకు కనెక్టివిటీ ఇస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారు అవుతుంది. డే వన్ నుంచే రాజధాని వస్తుంది. ఒక గ్రోత్ ఇంజన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ల తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మావిగన్‌లోనే ఉద్యోగాలు దొరుకుతాయి అని చిలుకకు చెప్పినట్లు చెప్పినా, చంద్రబాబు ఒప్పుకోవడం లేదు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. ఆయనకెంత బాధో!:
దోచుకునేది.. పంచుకునేది.. తినుకునేది కట్ అయిపోతుందని. ఆయనకెంత బాధో.. వైయస్సార్ సీపీ శ్రేణులందరిపైనా..అన్యాయమైన మాటలు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఇదే రాధాకృష్ణకు చెబుతున్నా.. నువ్వన్న మాటలకు.. రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతాం. వైయస్సార్సీపీ శ్రేణులు, వైయస్సార్ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తోందా రాధాకృష్ణా?.
క్లియర్ గా చెబుతున్నా..వాళ్లకైనా భార్యలు ఉంటారు. వాళ్ల భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా అలా మాట్లాడితే వారికి నచ్చుతుందా? ఎవరికీ నచ్చదు. నచ్చనప్పుడు కనీసం అలాంటి మాటలు మాట్లాడటం తప్పు అని ఈ నాయకులైనా చెప్పాలి కదా? ఈ చంద్రబాబు నాయుడు చెప్పరు. . ఈ లోకేష్ చెప్పరు. .. ఈ దత్త పుత్రుడు చెప్పరు. . సిగ్గు లేకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాటలు మాట్లాడితే.. వాటిని సమర్ధిస్తారు. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోయాయి.
ఈ రోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కామెంట్లు పెట్టిన పిల్లలను తీసుకువచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు.. జైళ్లలో పెడుతున్నారు.. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.. కొడుతున్నారు. రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కూడా ఇదే జరుగుతుంది. మహిళలను తక్కువగా చూసే.. తక్కువగా మాట్లాడే పరిస్థితులు ఎందుకొచ్చాయి?.
అంతా అరాచకం. దారుణం
ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఆ కోడూరు ఎమ్మెల్యే అవర శ్రీధర్ .. అత్యాచారం చేసి మోసం చేశాడని చెప్పి బాధితురాలు ఆందోళన చేస్తూ ఉంటే.. ప్రతి ఒక్కరికీ కంప్లైంట్ కూడా ఇస్తే..ఆమెనే కొడుతున్నారు. ఆ పాప రోడ్డెక్కి నాకు అన్యాయం జరిగిందని ఆమె చెబుతుంటే..పోలీసుల సమక్షంలో ఆ పాపను కొడుతున్నారు.
ఇంకొకడు.. నరసరావుపేట ఎమ్మెల్యే. కళ్లముందే కనిపిస్తోంది. జిల్లా ఎస్పీ ఆఫీసుకు వెళ్లి బాత్రూంలోకి పోయి డోర్ గడి పెట్టుకున్నాడు. ఎస్పీ ఆఫీసులోకి పోవడమేంటి? బాత్రూంలోకి వెళ్లి డోర్ గడేసుకోవడమేంటి? గడేసుకుని స్ట్రైక్ చేయడమేంటి? దానికి చంద్రబాబు నాయుడు పంచాయతీ చేస్తారు. పోయి బొక్కలో వేయకుండా..పంచాయతీ చేస్తున్నారు.
ఇంకొకడు బీఆర్ నాయుడు..ఆయనేం చేస్తున్నాడో మనందరం చేస్తూనే ఉన్నాం. తప్పులు చేశారు.. టీటీడీ చైర్మన్ గా ఉండి.. చేయకూడని తప్పులు చేస్తూ ఉంటే..ఏం చేయాలి. ఆ మనిషిని టీటీడీ పదవిలో నుంచి ఊడబెరకాలా? లేదా? చంద్రబాబు ఏం చేస్తున్నాడు.. పక్కన పెట్టుకుని తిప్పుతున్నాడు. ఎంత దారుణంగా తయారయ్యారంటే.. ఇవన్నీ కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు.
ఇంకొకరు కేజీబీవీ ప్రిన్సిపాల్.. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధించాడని ఆ తల్లి వచ్చి ఫిర్యాదు చేస్తే నో యాక్షన్. పట్టించుకునేవాడు లేడు. ఇంకొకడు..మహిళలకు వీడియో కాల్స్ చేసి అశ్లీలంగా ప్రవర్తించిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..ఆడవాళ్లకు ఫోన్ లు చేసి అశ్లీలంగా వ్యవహరించాడు. అది బహిరంగంగా కనపడుతూ ఉంది. యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకడు.. మహిళలపై దారుణంగా లైంగిక దాడులు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. మహిళలపై లైంగిక దాడికి పాల్పడినా.. ఆ వీడియోలు బయటికి వచ్చినా ఆ ఆదిమూలంపై నో యాక్షన్. వీరంతా ఎమ్మెల్యేలు.. ఒకడిని చూసి ఇంకొకడు. ఒకరు చేస్తే ఏం యాక్షన్ లేదు..ఆడి మీద యాక్షన్ లేదు.. నా మీద ఏం యాక్షన్ తీసుకుంటారులే అని ఇంకొకడు. ఒకడిని చూసి ఇంకొకడు.. రాక్షసులవుతున్న పరిస్థితి.
ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు..మహిళను లైంగికంగా వేధించిన మంత్రి సంధ్యారాణి పీఏ..ఆ పీఏ మీద కూడా నో యాక్షన్. పైగా ఆ మహిళ మీద కేసు. ఈ స్థాయిలో రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఉంటే.. ఇంకొకడు చివరికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ మనిషి మాట్లాడే మాటలు. ఒకరిని చూసి ఇంకొకరు..
తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ వడ్డి రఘురాం, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పార్టీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజుతో పాటు, పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.