Suryaa.co.in

Andhra Pradesh

ఎపిఎస్ఆర్టీసీలో 1847 కారుణ్య నియామకాలకు చర్యలు

• ఆర్టీసీ,గ్రామ,వార్డు సచివాలయాలు,జిల్లా కలక్టర్ల ద్వారా వివిధ శాఖల్లో ఈపోస్టులు భర్తీ
• ఈప్రభుత్వం వచ్చాక 2015కు ముందు చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే 385 కారుణ్య నియామకాలు చేశాం
• బయట నుండి డీజిల్ కొనుగోలుతో ఆర్టీసీకి నెలకు 65కోట్ల రూ.ల ఆదా
• రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది
• ఏప్రిల్ నెలలో మొదటి బస్సు రాక-సియం చేతులమీద ప్రారంభం
• 60యేళ్ళు దాటిన సీనియర్ సీనియర్ సిటిజన్స్ కు 25శాతం బస్సు రాయితీ పునరుద్ధరణ-దీంతో సుమారు 2లక్షల మందికి లబ్ది
రాష్ట్ర ప్రజా రవాణా, సమాచార శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని)

అమరావతి,16మార్చి: ఎపిఎస్ఆర్టీసీలో సుమారు 1847 కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రవాణా మరియు సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు పేర్నివెంకట్రామయ్య(నాని)వెల్లడించారు. ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకు మీడియా పాయింట్ వద్ద ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీలో సుమారు 1847 కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పునరుద్ఘాటించారు.ఆర్టీసీలో 2015కు ముందు సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబాలకు చెందిన 385 మందికి ఈప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.మరలా 2016 నుండి చనిపోయిన, కోవిడ్ సమయంలో సర్వీసులో ఉండి చనిపోయిన సుమారు 1847 మందికి చెందిన కుటుంబాల వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు చెప్పారు.

ఈ కారుణ్య నియమాకాలన్నీ ఆర్టీసీతో పాటు,గ్రామ,వార్డు సచివాలయాల్లోను,జిల్లా కలక్టర్ల వద్ద ఉన్న సుమారు 40 శాఖల్లోను భర్తీ చేయడం జరుగుతుందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అందరు జిల్లా కలక్టర్లకు సంబంధిత జాబితాను పంపించామని వారు ఆయా శాఖలవారీ ఖాళీలు,రోస్టర్ విధానాలకు అనుగుణంగా ఈకారుణ్య నియామకాలను చేపడతారని మంత్రి చెప్పారు.

డీజిల్ బయట కొనుగోలుతో ఆర్టీసీకి నెలకు రూ.65కోట్ల ఆదా
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయిల్ కంపెనీల ద్వారా బల్క్ విధానంలో ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధరలను పెంచడంతో ఆర్టీసీకి పెద్దఎత్తున నష్టం వస్తున్నందున బయట బంకుల నుండి డీజిల్ కొనుగోలు చేయడం జరుగు తోందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య మీడియాకు వివరించారు.ఆవిధంగా బయట కొనుగోలు చేయడంతో ఆర్టీసికి నెలకు 65కోట్ల రూ.లు ఆదా అవుతోందని తెలిపారు. ఆర్టీసీ నెలకు సుమారు 8లక్షల లీటర్ల డీజిల్ ను వినియోగించడం జరుగుతోందని అన్నారు.

2021 నవంబరులో ఆర్టీసీకి ఆయిల్ కంపెనీల ద్వారా ఇచ్చే బల్క్ డీజిల్ ధర లీటరు రూ.91.39లు ఉండగా బయట 96రూ.లు ఉండేదని,2021 డిశంబరులో బల్క్ ధర 88 రూ.లు ఉంటే బయట ధర రూ.96.20లు ఉండదేని,2022 ఫిబ్రవరి 1వతేదీ నాటికి బల్క్ ధర 96.24లు,బయట ధర 96.20రూ.లుగా ఉండేదని మంత్రి చెప్పారు.ఈనెల 16వతేదీ నాటికి ఆయిల్ కంపెనీలు ద్వారా సరఫరా చేసే డీజిల్ ధర రూ.113.83 లుగా ఉండగా బయట బంకుల్లో లీటరు ధర రూ.96.02లుగా ఉందని అనగా సుమారు రూ.17.81లు వ్యత్యాసం ఉందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య మీడియాకు వివరించారు.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ బయట నుండి డీజిల్ కొనుగోలు చేస్తుండగా నెలకు సుమారు 65కోట్ల రూ.లు వరకూ ఆదా అవుతోందని చెప్పారు.ఆర్టీసీ ఇప్పటి వరకూ బయట బంకుల నుండి సుమారు 33కోట్ల 83 లక్షల రూ.ల విలువైన డీజిల్ ను కొనుగోలు చేసిందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సరఫరా చేసే డీజిల్ ధరలు తగ్గినపుడు మరలా ఆర్టీసీ ఆయా చమురు సంస్థల నుండి కొనుగోలు చేయడం ప్రారంభిస్తుందని మంత్రి వెంకట్రామయ్య స్పష్టం చేశారు.

త్వరలో ఆర్టీసీలో అందుబాటులోకి ఎలక్ట్రిక్ బస్సులు-ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి
ఎపిఎస్ ఆర్టీసీలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర ప్రజా రవాణా మరియు సమాచార శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని ఏప్రిల్ నెలలో మొదటి బస్సును అందజేయనుండగా దానిని ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదగా ప్రారంభించ నున్నారని మంత్రి మీడియాకు వివరించారు.50 బస్సులను తిరుపతి నుండి తిరుమలకు నడపడం జరుగు తుందని మరికొన్ని బస్సులను తిరుపతి నుండి మదనపల్లె,మరికొన్ని కర్నూల్ తదితర మార్గాల్లో నడపడం జరుగుతుదంన్నారు.

60యేళ్ళు నిండిన సీనియర్ సిటిజన్స్ కు 25శాతం బస్సు టికెట్ రాయితీ
60యేళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు 25శాతం బస్సు టికెట్ రాయితీని కోవిడ్ సమయంలో అనగా 2020 మే నెలలో నిలిపి వేసిన రాయితీని వచ్చేనెల 1వతేదీ నుండి పునరుద్దరిస్తున్నట్టు రాష్ట్ర ప్రజారవాణా మరియు సమాచారశాఖ మంత్రి పేర్నివెంకట్రామయ్య(నాని)మీడియాకు వెల్లడించారు.దీనివల్ల సుమారు 2లక్షల మంది సీనియర్ సిటిజన్స్ కు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.ఈరాయితీని పొందగోరే వారు వారి ఆధార్ లేదా,ఓటరు గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డులో ఏదో ఒక ప్రూప్ చూపి ఈసౌకర్యాన్ని వినియోగించు కోవచ్చని అన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రభుత్వంపై సుమారు 3600 కోట్ల రూ.లు భారం
ఎపిఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ప్రభుత్వంపై సుమారు 3600 కోట్ల రూ.లు వరకూ అదనపు భారం పడిందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య చెప్పారు. అప్పుల్లో ఉన్న ఆర్టీసీని బ్రతికించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు ఆయన చేశారు.ఆర్టీసికి సుమారు 2వేల 649కోట్ల రూ.లు బ్యాంకు ఋణాలు ఉన్నాయని చెప్పారు.2021-22లో ఆర్టీసీకి 3వేల 961 కోట్ల రూ.లు ఆదాయం వచ్చిందని తెలిపారు.కోవిడ్ నష్టాలతో ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్, ఎస్బిటి,సిసిఎస్ తదితరాలకు సంబంధించి సుమారు 705 కోట్ల రూ.లను వినియోగించుకోగా ఆమొత్తాన్ని తిరిగి ఆర్టీసీ యాజమాన్యం ఆయా ఖాతాల్లో జమ చేయడం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ఆర్టీసీ తరుపున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియ జేస్తున్నట్టు మంత్రి పేర్నివెంకట్రామయ్య పేర్కొన్నారు.

LEAVE A RESPONSE