Suryaa.co.in

Andhra Pradesh

ఉదయం సాయంత్రం వేళలలో బస్సులు ఏర్పాటు చేసేలా చర్యలు

– కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

రామచంద్రపురం: రామచంద్రపురం నుంచి చుట్టుపక్కల గ్రామాలకు విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం సాయంత్రం వేళలలో బస్సులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సోమవారం రామచంద్రపురం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రామచంద్రపురం నుంచి ఇచ్చాపురం వయా విశాఖపట్నం వెళ్లే మూడు 40 సీట్లు గల ఆల్ట్రా డీలక్స్ బస్సులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం రామచంద్రపురం నుంచి ఇచ్ఛాపురం వరకు మూడు 40 సీట్లు గల ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ బస్సులు ఉదయం, సాయంత్రం వేళలో రామచంద్రపురం నుంచి బయలుదేరుతాయన్నారు. రామచంద్రపురం నుంచి భద్రాచలం కి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజల నుంచి అర్జీలు వస్తున్నాయని.. సంబంధిత విషయాన్ని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి బస్సు సర్వీసును ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

చుట్టుపక్కల గ్రామాల నుంచి రామచంద్రపురం వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు రాత్రి సమయాలలో బస్సులు, ఆటోలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి వచ్చిన నేపథ్యంలో అతి త్వరలో వి ఎస్ ఎం కాలేజీ నుంచి చుట్టుపక్కల గ్రామాలకు బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు తెలిపారు. రాబోయే రోజుల్లో రామచంద్రపురం నుంచి సుదూర ప్రాంతాలకు మరిన్ని బస్సు సర్వీసులు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో డి పి టి ఓ శ్రీనివాసరావు , డి ఎంభాస్కర్ ,విజిలెన్స్ అధికారి రామారావు,ఏఎంఎఫ్ రవిబాబు ,రామచంద్రపురం డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE