– ఏడాది నుంచే టీడీపీతో టచ్‌లో కోటంరెడ్డి ఉన్నారంటున్న వైసీపీ
– చెన్నైలో ఓ యువనేతతో కోటంరెడ్డి భేటీ అయ్యారన్న ప్రచారం
– హైదరాబాద్‌లో టీడీపీ అధినేతతో భేటీ అయ్యారన్న మాజీ మంత్రి నాని
– సర్కారుపై పోరాడుతున్న ఓ మీడియా అధినేత రాయబారం చేశారంటున్న టీడీపీ నేతలు
– ఇప్పటికే ‘వైసీపీ నెంబర్ టూ’తో సదరు మీడియా అధిపతి టచ్‌లో ఉన్నారన్న గుసగుసలు
– గత ఎన్నికల్లో బీజేపీకి దూరం చేసే అంశంలో కీలకపాత్ర పోషించిన ఆ మీడియా అధినేత
– మళ్లీ ఇప్పుడు ఎవరినో తెచ్చి మాపై రుద్దుతున్నారంటూ నెల్లూరు నేతల ఆగ్రహం
– కోటంరెడ్డికి సహకరించిన ఆ ఐపిఎస్ ఎవరు?
– ఆ ఐపిఎస్ ఎవరంటూ సీఎంఓ ఆరా?
– టీడీపీ-వైసీపీ వర్గాల్లో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీ మారే వ్యవహారంలో, ఓ మీడియా అధిపతి రాయబారి పాత్ర పోషించారా? ఆయన సలహా ప్రకారమే కోటంరెడ్డి టీడీపీ అధినేత, ఓ యువనేతతో హైదరాబాద్-చెన్నైలో భేటీ అయ్యారా? అసలు ఈ కప్పదాటు తతంగమంతా గత ఏడాది నుంచీ జరుగుతోందా? మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని కోటంరెడ్డిని హెచ్చరించిన ఆ ఐపిఎస్ ఎవరు? పోలీసు శాఖలో అంతర్గత కలహాలే ఈ కథను వెలుగులోకి తెచ్చాయా?..ఇవీ ఇప్పుడు టీడీపీ-వైసీపీ వర్గాల్లో హాట్‌టాపిక్.
నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నానంటూ పేల్చిన బాంబు తీవ్రత ఇంకా తగ్గలేదు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా, తమ పార్టీలో చేరుతున్నానంటూ కోటంరెడ్డి చేసిన ప్రకటనను నెల్లూరు జిల్లా తమ్ముళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కోటంరెడ్డి బాధితులయిన కార్యకర్తలు.. ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో, ఆయనను పార్టీలో ఎలా చేర్చుకుంటారన్నది తమ్ముళ్ల వాదన. తమను సంప్రదించకుండా కోటంరె డ్డిని ఏకపక్షంగా పార్టీలోకి తీసుకునే ప్రక్రియపై నెల్లూరు జిల్లా నేతలంతా ఒక్కతాటిపైకి రావడం విశేషం.
అయితే.. కోటంరెడ్డి చేరిక వెనుక, అసలు కథ తెలిసిన తమ్ముళ్లు అవాక్కవుతున్నారు. జగన్ సర్కారుపై యుద్ధం చేస్తున్న ఓ మీడియా అధిపతి, కోటంరెడ్డి చేరిక వెనుక చక్రం తిప్పారని నెల్లూరు తమ్ముళ్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు కూడా.. బీజేపీతో కలసి వెళ్లవద్దని తమ నాయకత్వానికి హితోపదేశం చేసి.. ఆ మీడియా అధిపతి టీడీపీ పతనానికి పుణ్యం కట్టుకున్నారని చెబుతున్నారు.
మళ్లీ ఇప్పుడు తమ జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుని, పార్టీని భ్రష్టుపట్టించి పుణ్యం కట్టుకుంటున్నారని కారాలు మిరియాలు నూరుతున్నారు. సదరు మీడియా అధిపతి సలహాతోనే కోటంరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారని, అలాగే యువనేతను చెన్నైలో కలిశారన్న విషయం, తమకు ఆలస్యంగా తెలిసిందని నెల్లూరు నేతలు చెబుతున్నారు. అటు మాజీ మంత్రి పేర్ని నాని కూడా, చంద్రబాబును కోటంరెడ్డి డిసెంబర్ 25న హైదరాబాద్‌లో కలిశారని బయటపెట్టడం ప్రస్తావనార్హం.
ఇదిలాఉండగా.. పోలీసు శాఖలో అంతర్గత అధిపత్యపోరు కూడా ఈ ట్యాపింగ్ ఆరోపణలకు ఒక కారణంగా కనిపిస్తోంది. జరిగింది రికార్డింగే తప్ప, ట్యాపింగ్ కాదన్నది ఒక వాదన. అంటే కోటంరె డ్డి మిత్రుడే తన ఫోన్‌లో కాల్‌రికార్డు చేసి, దానిని మరో నేత ద్వారా ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుకు పంపించారట. ఆయన కోటంరెడ్డితో తనకున్న పరిచయం మేరకు ఆ రికార్డును కోటంరెడ్డికి పంపించారన్నది ఇప్పుడు వైసీపీ నేతల విశ్లేషణ.
అయితే తనకు కొద్దినెలల క్రితమే ఓ ఐపిఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి, మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పారంటూ.. కోటంరెడ్డి చేసిన ఆరోపణ ఆషామాషీ కాదు. అది కొట్టిపారేసే అంశం కాదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అంటే పోలీసు శాఖలోనే విభీషణులు ఉన్నారని, కోటంరెడ్డి మాటల బట్టి స్పష్టమయింది. సహజంగా ట్యాపింగ్ అంశం నిఘా విభాగంలో ఇద్దరు కీలక అధికారులకు మాత్రమే తెలిసే అవకాశం ఉంటుందని ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి వెల్లడించారు.
కాగా కోటంరెడ్డికి ఫోన్ చేసి, మీ ఫోన్ ట్యాప్ అవుతోందని హెచ్చరించిన ఆ ఐపిఎస్ ఎవరన్న దానిపై సీఎంఓ దృష్టి సారించినట్లు సమాచారం. సదరు అధికారి కోటంరెడ్డిపై అభిమానంతో చెప్పారా? లేక ఒక అధికారితో సరిపడక లీక్ చేశారా? అన్న కోణంపై విచారణకు ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కాగా నిఘా విభాగంలో ఇద్దరు కీలక అధికారులు, పోలీసుశాఖలో ఒక కీలక అధికారి-మరికొందరు సీనియర్ల మధ్య చాలాకాలం నుంచి అంతర్యుద్ధం జరుగుతోందన్న ప్రచారం కొద్దినెలల నుంచి వినిపిస్తోంది. అందులో భాగంగానే.. కోటంరెడ్డికి ట్యాపింగ్‌కు సంబంధించి, ముందస్తు లీకేజీ అంది ఉండవచ్చంటున్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఓ అధికారి ప్రమేయం, ఈ వ్యవహారంలో ఉండి ఉండవచ్చన్న చర్చ జరుగుతోంది. నిజం ‘జగ న్నా’ధుడికెరుక?