పత్రికల రిజిస్ట్రేషన్ బిల్లుపై చర్చలో విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 3: కార్పొరేట్ల ప్రవేశంతోనే మీడియా స్వతంత్రం మంటగలిసిపోయి పెడధోరణలకు దారి తీస్తోందని వైఎస్సార్సిపి సభ్యులు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. పత్రికలు, సంచికల రిజిస్టేషన్ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం నాలుగో స్తంభం అయిన పత్రికా రంగం అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.
కానీ ఇటీవల కాలంలో పత్రికా రంగం తన బాధ్యతలు, ప్రమాణాలను విస్మరిస్తూ అవాంఛనీయమైన ధోరణలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం చూస్తున్నామని అన్నారు. చట్టప్రకారం శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల్లో కార్పొరేట్ సంస్థలకు ప్రవేశం నిషిద్ధం. కానీ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన పత్రికా రంగంలోకి ప్రవేశం మాత్రం వాటికి సునాయాసం అయింది. దీని పర్యవసానంగా మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్న కార్పొరేట్లు ప్రజాస్వామ్యానికి మూలస్థంభాలైన ఇతర వ్యవస్థలను శాసించే స్థితికి చేరుకున్నాయని పేర్కొన్నారు.
కొన్ని కుల సంఘాలు, మత సంస్థలు, తీవ్రవాద విభాగాలు, రాజకీయ స్వప్రయోజనాలు ఆశించే కొన్ని సంస్థలు మీడియా రంగంలోకి ప్రవేశించి విచ్చలవిడిగా ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తూ పత్రికా స్వతంత్రానికే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలు మీడియా రంగంలో ప్రవేశించడాన్ని తాను వ్యతిరేకించడం లేదని అయితే లాభాపేక్ష లేకుండా పత్రికలు నడిపే సంస్థలకు మాత్రమే మీడియాలో ప్రవేశం కల్పించేలా చట్టంలో నిబంధనలను సవరించాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2020లో 1,527 ఫేక్ న్యూస్ కేసులు నమోదయ్యాయి. 2019తో పోల్చుకుంటే 214 శాతం పెరిగాయని ఆయన చెప్పారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) ప్రకారం ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చే ప్రకటనలు చేసే వ్యక్తులు శిక్షార్హులు. కానీ పత్రికల ద్వారా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారికి ఎలాంటి శిక్ష విధించాలో ఐపిసి నిబంధనలు స్పష్టం చేయడం లేదని అన్నారు.
దేశం క్రమేణా డిజిటల్ యుగం వైపుగా సాగుతున్నందున డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ప్రెస్ కౌన్సిల్ చట్టం పరిధిలోకి తీసుకురావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. భారత పత్రికా రంగానికి వాచ్‌డాగ్‌లా వ్యవహరించే ప్రెస్ కౌన్సిల్‌కు ఇకపై డిజిటల్ న్యూస్‌ను నియంత్రించే అధికారం కట్టబెట్టాలని ఆయన సూచించారు. అన్ని రకాల డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లను నియంత్రిస్తూ ఫేక్ న్యూస్ ప్రచారం చేసే సంస్థలపై భారీగా జరిమానాలు విధించేలా చట్ట సవరణ చేపట్టాలని కోరుతూ తాను ఇప్పటికే ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు.