– కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లపై ప్రేమందుకో?
– గతంలో జనరేటర్లు మునిగినా విరుచుకుపడని మీడియా
– ‘పెద్ద గొంతు’ మీడియా చేతులు కట్టేశారా?
– చిన్న ఘటనలకే ఓవరాక్షన్ చేసే పెద్ద మీడియా
– మేడిగడ్డపై మాత్రం వ్యూహాత్మక మౌనమెందుకు?
– ప్యాకేజీలకు మీడియా లొంగిపోయిందా?
– ‘మెగా’ బంధంపై కొద్దిరోజులు హడావిడి చేసిన షర్మిలక్క
– ఢిల్లీకి వెళ్లి ‘మెగా’పై ఫిర్యాదు చేశానని వెల్లడి
– మెగాలో కేసీఆర్ కుటుంబవాటాలున్నాయని ఆరోపణ
– ఆ తర్వాత ‘మెగా’పై మాట్లాడని వైనం
– ‘కాళేశ్వరం’ లోపాలపై నోరువిప్పని ‘పువ్వు’పార్టీ
– ‘మెగాై’పె కాంగ్రెస్‌దీ మౌనరాగమే
– రేవంత్, సంజయ్‌కు మెగా మామూళ్లు ఇస్తోందన్న షర్మిలక్క
– ఇంటర్ పరీక్షల నిర్వహణ కంపెనీపై విరుచుకుపడ్డ కాంగ్రెస్, బీజేపీ
– కాళేశ్వరం కాంట్రాక్టు కంపెనీలపై మాత్రం మౌనం
– మేడిగడ్డ కుంగడానికి కారకులెవరు?
– ఏ కంపెనీ సిమెంట్ వాడారన్న దానిపై చర్చ
– కాంట్రాక్టు కంపెనీ, ఇంజనీర్లపై చర్యలేవీ?
– బీఆర్‌ఎస్ నేతలు నోరు మెదపరేం?
– మేడిగడ్డపై కేటీఆర్ మాట్లాడరా?
– ‘కుంగుబాటు’ పాపం ఎవరిది?
– ‘మేడిగ డ్డ’ మేడిపండు చందమేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ ప్రాజెక్టులపై ‘నాలుగోస్తంభం’.. ‘నిధుల మొహమాటం’తో అమ్ముడుపోయిందా? అందుకే ‘ప్యాకేజీ’లతో సర్దుకుంటోందా? ‘ప్రకటనల ప్యాకేజీ’ వల విసిరి కాంట్రాక్టు కంపెనీలు, ‘నోరుపెద్ద మీడియా’ నోరు మూయిస్తున్నాయా? అందుకే ‘ప్రాజెక్టు కథలు’ బయటకు రావడం లేదా? హటాత్తుగా కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు దారుణాన్ని, పెద్ద మీడియా అందుకే విజయవంతంగా సమాధి చేసిందా? ఆ మొహమాటమే మేడిగడ్డ వైఫల్యాన్ని, పంజాగుట్ట స్మశానవాటికలో మౌనంగా పూడ్చిపెట్టాయా? మొన్నటికి మొన్న వరదల్లో జనరేటర్లు మునిగిన ఘోరంలో కాంట్రాక్టరుపై, పాలకులు చర్యల కొరడా ఎందుకు ఝళిపించలేదు?
ఇంతకూ మేడిగడ్డ కుంగుబాటుకు కారకులెవరు? పనులు చేసిన కాంట్రాక్టు కంపెనీయా? అసలు సదరు కంపెనీయే నేరుగా పనిచేసిందా? లేదా ఏదైనా ‘మెగా’స్టార్ కంపెనీకి బ్యాక్ టు బ్యాక్ ప్రాతిపదికన సబ్ కాంట్రాక్టుకు ఇచ్చిందా? అసలు ఆ పాపం పనుల పర్యవేక్షణ మరిచిన చీఫ్ ఇంజనీరుదా? కాంట్రాక్టరుదా? సబ్ కాంట్రాక్టులు చేస్తున్న కంపెనీలదా? నిజంగా కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు ఇస్తే సంజయ్ చెప్పినట్లు, జాతీయ స్థాయిలో తెలంగాణ సిగ్గుపోయేదా?.. ఇవీ ఇప్పుడు మేడిగడ్డ చుట్టూ ముసురుకున్న ప్రశ్నలు.
మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్‌లోని పిల్లర్లు హటాత్తుగా కూలిపోయాయి. గత శనివారం 9 ఇంచుల వరకూ కుంగిన రోడ్డు, ఆదివారానికి ఇంకా కుంగిపోయింది. పిల్లర్, రోడ్డుపై పగుళ్లు దర్శనమిచ్చాయి. దానిపై విచారణకు కేంద్ర బృందం పరిశీలనకు వచ్చింది. అక్కడి 20వ పిల్లర్‌ను పరిశీలించింది. మొత్తం 5 ఫీట్లకు కుంగిపోయినట్లు అధికారుల బృందం గుర్తించింది. 20వ పిల్లర్ పూర్తిగా దెబ్బతిన్నదని సమాచారం.
ఇది లక్ష కోట్ల రూపాయలు రీడిజైన్ పేరుతో, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లక్ష కోట్లు అప్పు తెచ్చి మరీ ప్రారంభించిన ప్రాజెక్టు. అసలు సీఎం కేసీఆరే స్వయంగా ఇంజనీర్ అవతారమెత్తి, డిజైన్లు మార్చి ఆ ప్రాజెక్టుకు ఊపిరిపోశారు. అయితే కేసీఆర్‌కు 30 శాతం అడ్వాన్సు కమిషన్ ఇచ్చిన బడా కాంట్రాక్టర్లు, నాణ్యతను పాటించలేదన్నది, బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ లాంటి నేతల ఆరోపణలో నిజం చంద్రుడికెరుక?
అయితే పిల్లర్లు కుంగడంలో విద్రోహచర్య ఉందన్నది ఏఈ అనుమానం. ఆ ప్రకారమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణలో ఏం తేలుతుందో చూడాలి. అయితే గతంలో భారీ వరదలు వచ్చిన సమయంలో.. పంప్‌హౌస్ సేఫ్టీవాల్ కూలిపోయింది. 6 మోటార్లు ధ్వంసమైనట్లు వార్తలొచ్చాయి. 17 మోటార్లలో 5 మాత్రమే ఉపయోగంలో ఉన్నాయట. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ 3 పిల్లర్లు కుంగిపోయాయి.
ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరుగుతోంది? అన్న అనుమానాలు సహజంగానే తెరపైకొచ్చాయి. అటు సర్కారు కూటా విపక్షాలు-మీడియాను అటు దిక్కు వెళ్లకుండా ఆంక్షల ఉక్కుపాదం మోపడం కూడా ఈ అనుమానాలకు బలమిస్తోంది.
సీఎం కేసీఆర్ స్వయంగా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు కుంగుబాటుపై, ఇప్పటివరకూ ఆయన మాట్లాడకపోవడమే విచిత్రం. రోజూ మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ కూడా, మేడిగడ్డ కుంగుబాటుపై పెదవి విప్పకపోవడం మరో వింత. రోజూ కాంగ్రెస్-బీజేపీపై విరుచుపడే మంత్రులు కూడా, గప్‌చుప్ అవడమే ఆశ్చర్యం. అంటే.. ఈ నగుబాటు ఘటనపై ఎవరూ నోరెత్తవద్దని, ప్రగతిభవన్ నుంచి ఆదేశాలు వచ్చాయన్నది మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది.
80 వేల కోట్ల నుంచి.. లక్షన్నర కోట్ల రూపాయలకు పెరిగిన ఈ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిగొప్పదని చెప్పడానికి, కేసీఆర్ సర్కారు చాలా కష్టపడింది. ఆమేరకు డిస్కవరీ చానెల్‌తో ఒక డాక్యుమెంటరీ కూడా చేయించింది. అయితే వరదల్లో పంప్‌హౌస్ కొట్టుకుపోవడంతో, సదరు డిస్కవరీ చానెల్ కూడా సిగ్గుపడి, తన డాక్యుమెంటరీని తొలగించింది. అంటే ఇది ఇది గొప్ప ప్రాజెక్టో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదన్నది విపక్షాల విమర్శ. ప్రపంచ రికార్డు కోసం పనులను, వేగంగా చేయించడమే ఇన్ని అనర్ధాలకు కారణమన్నది ఒక విమర్శ.
ఇప్పటిదాకా విపక్షాలు ప్రాజెక్టు లోపలికి వెళ్లకుండా పోలీసు పహారా పెట్టి, వారిని అడ్డుకున్న కేసీఆర్ సర్కారు దాచిన రహస్యం.. ఇప్పుడు పిల్లర్ల కుంగుబాటుతో బట్టబయలయింది. దీని కాంట్రాక్టరు ఎల్ అండ్ టీ అన్నది అధికారులు చెబుతున్న మాట. అయితే ఆ కంపెనీయే పనుల నిర్మాణంలో ఉందా? లేక ఏ మెగాస్టార్ కంపెనీకి బ్యాక్ టు బ్యాక్ ప్రాతిపదికన, సబ్ కాంట్రాక్టు ఇచ్చిందో తెలియదు. ఇదీ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించిన కథ.
మరి దీనిపై పేరు గొప్ప మీడియా స్పందన ఏమిటో ఓసారి చూద్దాం. ఇంటర్ పరీక్షల నిర్వహణ- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహణను.. కేసీఆర్ సర్కారు ఓ ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేసిందని కాంగ్రెస్, బీజేపీ విరుచుకుపడ్డాయి. యశోదా ఆసుపత్రికి కోట్లు చెల్లించిందని ఆరోపించాయి. అన్ని ప్రాజెక్టులూ మెగా కంపెనీకే ధారాదత్తం చేస్తోందని, షర్మిల ఢిల్లీ వరకూ వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత షర్మిలక్క కూడా ‘మెగా’ మోసాలపై మౌనంగా ఉండటమే ఆశ్చర్యం.
ఇక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గానీ, కమల దళపతి కిషన్‌రెడ్డి గానీ, మెగా పనితీరుపై ఫిర్యాదు చేయకపోవడం మరో ఆశ్చర్యం. రెడ్డి గారి కంపెనీపై ఇద్దరు రెడ్లు మాట్లాడటపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదన్నది విశ్లేషకుల వ్యాఖ్య. మెగా ప్రాజెక్టులపై రేవంత్-సంజయ్ నోరు విప్పరని, దానికి కారణం వారికి కావలసినవి నెలవారీ అందడమేనన్న షర్మిల ఆరోపణలపై, వారిద్దరూ ఇప్పటివరకూ స్పందించకపోవడం విశేషం.
సరే… రాజకీయ నాయకులు, పార్టీలకు కాంట్రాక్టులతో అనేక సంబంధాలుంటాయనుకోవచ్చు. పార్టీ ఫండు వంటి పితలాటకాలు ఉంటాయనుకోవచ్చు. కానీ మెరుగైన సమాజం కోసం ఉద్యమించే చానెళ్లు.. ప్రతి క్షణం ప్రజాహితం కోసం పనిచేసే చానెళ్లు.. సత్యమేవ జయతే.. మన రాష్ట్రం అని ఎలుగెత్తే పత్రికలు.. అని చెప్పుకునే పత్రికలు కూడా.. మేడిగడ్డ వైఫల్యాలపై నవరంధ్రాలు మూసుకోవడమే వింత.
అసలు సీఎం కేసీఆర్ మానస పుత్రిక- లక్షన్నర కోట్ల ఖర్చయ్యే కాళేశ్వరం పనుల నాసిరకంపై , ఒక్క మీడియా కూడా ఎందుకు కోడై కూయలేదన్నది తెలంగాణ సమాజం సంధిస్తున్న ప్రశ్న. విపక్షాలు కూడా ఈ వైఫల్యంపై విరుచుకుపడకుండా, వ్యూహాత్మక మౌనం ఎందుకు పాటిస్తున్నాయి? పవర్ ప్రాజెక్టుల్లో కేసీఆర్ సర్కారుతో ములాఖత్ అయిన విపక్ష నేతల కంపెనీలు ఎన్ని? మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కుంగిందో ఒక్క చానెల్ గానీ, ఒక పత్రిక గానీ ఎందుకు రంధ్వ్రాన్వేషణ చేయలేదన్నది మరో ప్రశ్న.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లిస్తామన్న కేసీఆర్ సర్కారు హామీ.. ఎంతవరకూ నెరవేరిందని, ఒక్క చానెల్ డిబేట్ పెడితే ఒట్టు. వరదలో పంప్ హౌస్ ఎందుకు కొట్టుకుపోయింది? ఆ పనులు చేసిన మెగా కంపెనీపై ఎందుకు కొరడా చర్యలు ఝళిపించలేదు? అంత నాసిరకం మోటార్లు ఎందుకు పెట్టారని అడిగే దమ్ము ఏ ఒక్క మీడియా లేకపోలడమే వింత.
వరదలో కొట్టుకుపోయిన పంప్‌హౌస్ వైఫల్యంలో.. మెగా కంపెనీనిని ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదని, ఏ ఒక్క చానెల్ కూడా కథనాలు ఇచ్చిన పాపాన పోలేదు. కారణం ‘మామూలే’! ఇప్పటివరకూ ఆ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా 400 టీఎంసీల నీటిని ఎత్తిపోసి, రైతులకు అందిస్తానన్న సీఎం కేసీఆర్ హామీ ఎంతవరకూ నెరవేరింది?
ఎన్ని టీఎంసీల నీటిని రైతులకు అందించారని మీడియా ఎందుకు ప్రశ్నించలేదు? అంటే కాంట్రాక్టరంటే భయమా? గౌరవమా? లేక సదరు కంపెనీలిచ్చే ప్రకటనలు, నజరానాల మొహమాటమా? చిన్న ఘటనల్లో పెద్ద గొంతుతో అరిచే బడా మీడియాలు ఈ విషయంలో నవరంధ్రాలూ ఎందుకు మూసుకున్నాయన్నది వీక్షకులు-పాఠకుల ప్రశ్న.
దానికి ప్రకటనలు-నజరానాల ‘జమిలి మొహటామయినా’.. పాలకుల భయం-నిర్బంధాలు, కలసి వెరసి మేడిగడ్డ వైఫల్యాన్ని తెలుగు మీడియా విజయవంతంగా సమాధి చేసిందన్నది, మనం మనుషులం అన్నంత నిజం. కాళేశ్వరం ఉన్నది భారతదేశ భూభాగంలోనే. అయినా అక్కడికి వెళ్లేందుకు అటు మీడియాకు, ఇటు విపక్షాలకు అనుమతి లేదంటే… లోపల ఏం జరుగుతోందో చెప్పడానికి, మేధావులే కానవసరం లేదు.
నిజంగా ప్రాజెక్టు పనులు దివ్యంగా జరుతుంటే, ఈ నిర్బంధాలు..ఆంక్షలు ఎందుకన్నది, మెడపై తల ఉన్న ప్రతి ఒక్కరి ప్రశ్న. జవాబిచ్చే ధైర్యం పాలకులకు ఉందా?