– అమరావతి రైతులతో కమిషనర్ కన్నబాబు
– ప్లాట్ల సరిహద్దు రాళ్లు కనిపించడం లేదన్న రైతులు
– డిసెంబర్లో పార్లమెంటుకు అమరావతి గెజిట్ – న్యాయశాఖ అభ్యంతరాలు పరిష్కరిస్తున్నాము – ఈనెల 21, 22 తేదీల్లో మరోసారి త్రిమెన్ కమిటీ సమావేశం
అమరావతి: రాజధాని పరిధిలో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రతినెలా మూడో శనివారం రైతుల జెఎసితో సమావేశం నిర్వహిస్తామని కమిషనర్ కన్నబాబు తెలిపారు. రాజధాని సమగ్ర ప్లాను అమలు, నోటిఫై చేసిన డ్రాఫ్ట్ ప్లాను, గైడ్లైన్స్ అంశాలను వివరించేందుకు మంగళవారం సాయంత్రం సిఆర్డిఎ కార్యాలయంలో రైతు ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. దీనికి కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవతేజ హాజరయ్యారు. ప్రస్తుతం అమరావతి బ్లూప్లాను, రోడ్లు, కాలువలు, రిజర్వాయర్లు, రోడ్ల వెంట గ్రీనరీ, నడక, సైకిల ట్రాక్, విద్యుత్ లైన్లు, మంచినీటి పైపులైన్లు వంటివి ఎలా ఉంటాయి. వాటిని ఎలా వినియోగిస్తామనే అంశాలను అధికారులు, కమిషనర్ రైతులకు వివరించారు. అనంతరం రైతులు జెఎసి తరుపున సమర్పించిన 14 డిమాండ్లను లేవనెత్తారు.
గ్రామ కంఠాలు, అబ్బురాజుపాలెం, దొండపాడు, బోరుపాలెం గ్రామాల పరిధిలో సుమారు 150 ఎకరాలకు సంబంధించిన జరీబు భూముల అంశంతోపాటు ఫ్లోరేస్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) పెంపుదల అంశాలను ప్రస్తావించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ కొన్నిటిని పరిష్కరించామని, గ్రామ కంఠాలు, జరీబు భూముల అంశాల సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ త్రీమెన్ కమిటీ ఇటీవల సమావేశం అయిందని, కొన్ని అంశాలు పెండింగ్లో ఉన్నాయని వివరించారు.
ఈనెల 21, 22 తేదీల్లో మరోసారి సమావేశం అవుతుందని, అప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆ సమావేశానికి అవసరమైతే జెఎసి ప్రతినిధులను ఆహ్వానిస్తామని తెలిపారు. ప్రతి నెలా మూడో శనివారం రైతుల జెఎసితో సమావేశం అవుతామని, అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని చెప్పారు. గ్రీవెన్స్ పెడుతున్నారని, రైతులు ఇచ్చిన వినతిపత్రాలు చెత్తబుట్టలో వేస్తున్నారని పట్టించుకోవడం లేదని జెఎసి సభ్యులు తెలిపారు.
దీనికి కమిషనర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, స్వయంగా తానే గ్రామాల్లోకి వచ్చి రైతుల వద్ద సమస్యలు తెలుసుకున్నాని, అటువంటప్పుడు పరిష్కారం చేయడానికి ఇబ్బందులు ఏమి ఉంటాయని ప్రశ్నించారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ప్రస్తుతం 2.8 ఇచ్చారని, దీన్ని 5కు పెంచాలని రైతులు కోరారు. కనీసం 3.5 అన్నా ఇవ్వాలని కోరారు. దీనికి కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పెంచితే ఇబ్బందులు పడతారని, బిల్డర్లతో సమస్యలు వస్తాయని తెలిపారు. వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం తరువాత సమావేశంలో వివరిస్తానని అన్నారు.
డిసెంబర్ లో అమరావతి బిల్లు
రాజధానిని గుర్తిస్తూ గెజిట్ ఇచ్చే అంశం ఇంతకాలం ఎందుకు పెండింగ్లో ఉందని రైతులు అడిగారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ ఇప్పటి వరకూ దేశంలో ఏ రాజధానికి గెజిట్ లేదని అమరావతికి అవసరం ఏముందని అన్నారు. హైదరాబాద్ నగరానికి కూడా గెజిట్ లేదని చెప్పారు. దీనిపై రైతులు మాట్లాడుతూ విభజన చట్టంలోనే హైదరాబాద్ పది సంవత్సరాలు రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారని, అందువల్లే గెజిట్ అని అడిగామని తెలిపారు. ఇదే అంశంపై తాము కేంద్ర హెూం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళితే గెజిట్ ఇచ్చేందుకు అంగీకరించారని, అయితే న్యాయ విభాగం అధికారులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారని తెలిపారు.
వాటిని కూడా క్లియర్ చేస్తున్నామని, డిసెంబర్లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో అమరావతికి సంబంధించిన బిల్లు పెట్టే అవకాశం ఉందని కమిషనర్ రైతులకు తెలిపారు. గ్రామాల్లో నుండి రోడ్లు వేసేందుకు తీసుకున్న ప్లానులో కొన్నిచోట్ల కొద్దిస్థలాన్ని వదిలేస్తున్నారని తెలిపారు. వాటిని దుకాణాలు నిర్మించుకుని వినియోగించుకునేలా ప్లాను చేస్తున్నామని కమిషనర్ రైతులకు తెలిపారు. ప్రస్తుతం రైతులకు ఇచ్చిన ప్లాట్లకు సంబంధించి సరిహద్దు రాళ్లు కనిపించడం లేదని, ఆందోళనలో ఉన్నారని రైతులు తెలపగా పనులు జరుగుతున్న నేపథ్యంలో పగ్మార్కు చూపిస్తామని అక్కడ నుండి డెవలపర్ అభివృద్ధి చేసిన తరువాత రైతులకు ఇచ్చే సమయంలో రాళ్లు వేసి ఇస్తామని కమిషనర్ అన్నారు. ఇప్పుడు సరిహద్దు రాళ్లు పెట్టినా మెరకతోలాల్సి ఉంటుందని, అనంతరం కనిపించకుండా పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో లేఅవుట్లు అభివృద్ధి తరువాత సరిహద్దు రాళ్లను పెట్టి ఇస్తామని కమిషనర్ వివరించారు.
– వల్లభనేని సురేష్ 9010099208 విజయవాడ