– పరిపూర్ణమైన సీఎం చంద్రబాబు మేనిఫెస్టో హామీ తొలి సంతకం
– ఒక్క సంతకంతో 15,941 మంది జీవితాల్లో వెలుగులు
– ఆద్యంతం వినూత్నంగా మెగా డీఎస్సీ ఉత్సవ్
అమరావతి : మెగా డీఎస్సీ మెగా హిట్ అయ్యింది. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తొలి సంతకం వేలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఒక్క సంతకంతో 15,941 మంది డీఎస్సీ ద్వారా టీచర్లుగా ఉద్యోగ నియామకాలు పొందారు. వీరికి ఉద్యోగ నియామక పత్రాలను అందించేందుకు నిర్వహించిన మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ ఆద్యంతం అద్భుతంగా జరిగింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక… చేపట్టిన కార్యక్రమాలన్నీ ఓ ఎత్తుగా ఉంటే… మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ మరో ఎత్తుగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వారికి నియామక ఉత్తర్వుల అందజేతతో మేనిఫెస్టోలోని మొదటి సంతకం హామీ పరిపూర్ణమైంది. కోర్టు కేసుల లాంటి అనేక సవాళ్లను, కుట్రలను దాటుకుని డీఎస్సీ కార్యక్రమాన్ని విద్యా శాఖ నిర్వహించింది.
మొత్తం 15, 941 పోస్టుల భర్తీతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలు పొందిన వారితో అమరావతిలో నిర్వహించిన మెగా డీఎస్సీ ఉత్సవ్ మెగా హిట్ అయ్యింది. కుటుంబ సభ్యులతో కలిసి నియామక ఉత్తర్వులు అందుకునే కార్యక్రమంలో మెగా డీఎస్సీ విజేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకూ
డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి టీచర్లకు నియామక ఉత్తర్వులు అందజేసే కార్యక్రమం వరకు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శద్ద తీసుకున్నారు. మెగా డీఎస్సీ లో నియామకాలు పొందిన టీచర్లకు పత్రాలు అందించేందుకు విద్యాశాఖ వినూత్నంగా, ఆసక్తికరంగా కార్యక్రమాన్ని నిర్వహించింది. సభలోకి నేతల ఎంట్రీ నుంచే అదుర్స్ అనిపించే రీతిలో సభ జరిగింది. సభ ప్రాంగణంలో నలువైపులా ఏర్పాటు చేసిన ర్యాంప్ పై చంద్రబాబు, లోకేష్, మాధవ్ అభివాదం చేసుకుంటూ వెళ్లారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు సీఎం, మంత్రి నారా లోకేష్ లకు కరచాలనం ఇచ్చేందుకు ఆసక్తి చూపారు. ఇక రోటీన్ సభ మాదిరిగా కాకుండా… ముఖాముఖి తరహాలో నిర్వహించారు. కొత్తగా నియమితులైన టీచర్లు ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుణ్ణి కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికి నేతలు ముగ్గురు ఆసక్తిగా సమాధానం ఇచ్చారు. సభ ప్రారంభంలో యువగళం పాట వేయడంపై మంత్రి లోకేష్ సభికులకు క్షమాపణ చెప్పడం.. అందర్నీ ఆశ్చర్యపరిచింది.
మెగా డీఎస్సీ ఉత్సవ్ లో టీచర్ ఉద్యోగాలు సాధించిన వారి కష్టాలు,వారి నేపథ్యాలను ప్రత్యేకంగా వివరించేలా కార్యక్రమంలో వీడియోలను ప్రదర్శించారు. నిరుపేద, దిగువ మధ్యతరగతికి చెందిన యువత ఒక్కొక్కరు తమ కలల్ని ఎలా నిజం చేసుకున్నారనే అంశాన్ని వివరించేలా, స్ఫూర్తిని నింపేలా వీడియోలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆ వీడియోలు చూసి పలువురు కంటతడి పెట్టారు.
విద్యాశాఖకు సీఎం ప్రశంసలు
మెగా డీఎస్సీ మెగా హిట్ కావడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఆ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. టీచర్ల కరతాళ ధ్వనుల మధ్య భుజం తట్టి మంత్రి లోకేష్ ను వేదికపైనే అభినందించారు. మెగా డీఎస్సీ ప్రక్రియ ఆరంభం నుంచి నియామకాల వరకూ అధికారులు పడిన శ్రమను ప్రత్యేకంగా వేదికపైనే ప్రస్తావించిన మంత్రి లోకేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులను అభినందించారు.
ఈ తరహాలో ఉన్నతాధికారులను సభలో అభినందించడం తొలిసారి అనే చర్చ జరిగింది. ఉద్యోగాలు కల్పించి తమ జీవితాలను నిలబెట్టిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో సెల్ఫీలు దిగేందుకు టీచర్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. థ్యాంక్యూ సీఎం సర్ అంటూ ప్లకార్డులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఉత్సవ్ కుహాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు తమతమ జిల్లాలకు చెందిన టీచర్లతో కూర్చుని వారి సంతోషంలో భాగం అయ్యారు.