– జగన్ యువతను మోసం చేశారు
▪️ మెడికల్ కాలేజీల నిధులు ఎటు మళ్లించారో జగన్ చెప్పాలి
– ఏపీటీడీసీ సంస్థను ప్రైవేటు పరం చేయటం లేదు లీజుకు ఇస్తున్నాం
▪️ ప్రైవేటీకరణకు, పి.పి.పి.కి తేడా తెలియని జగన్
▪️ యూరియా అవసరమైన ప్రతి రైతుకు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు.
▪️జగన్ వైఖరి.. దుష్ప్రచారం, ఫేక్ ప్రచారాలే
– ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, ప్రకాశం జిల్లా టీడీఈ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ
అమరావతి: జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తీవ్రస్థాయిలో విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మెగా డీఎస్సీను పారదర్శకంగా నిర్వహించిందని తెలిపారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించి 150 రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తిచేయడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం రావడం గర్వకారణమని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు వయస్సు మినహాయింపు ఇచ్చి అండగా నిలిచామని అన్నారు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఎస్సీ సబ్క్లాసిఫికేషన్, స్పోర్ట్స్మెన్ కోటా, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేసిన డీఎస్సీ ఇదేనని స్పష్టం చేశారు. విద్యారంగంలో అవసరమైన ఉపాధ్యాయుల నియామకంతో పాటు స్టూడెంట్–టీచర్ రేషియోను సరిచేయడం వల్లనే పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని వివరించారు.
టీడీపీ ప్రభుత్వ చరిత్రాత్మక నియామకాలను ప్రస్తావిస్తూ 2014–2019 మధ్య రెండు డీఎస్సీల్లోనే 18 వేల పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, మొత్తం మీద చంద్రబాబు నాయుడు హయాంలో 14 డీఎస్సీల ద్వారా 1.96 లక్షల పోస్టులు భర్తీ చేసిన ఘనత టీడీపీదేనని గుర్తుచేశారు.
సమగ్ర శిక్షా సొసైటీ కింద 729 నాన్-టీచింగ్ పోస్టులు, 90 మంది ST యువతకు ఉపాధ్యాయ నియామకాలు, 3619 మంది జూనియర్ కాలేజీ లెక్చరర్ల సేవల పునరుద్ధరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రంగా స్పందిస్తూ – ఎన్నికల ముందు 2.3 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, చివర్లో కేవలం 6,100 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క పారదర్శక డీఎస్సీ కూడా జరపలేదని ధ్వజమెత్తారు. టీచర్లు ఉద్యమిస్తే లాఠీచార్జ్ చేయడం, అనవసరమైన ఆన్లైన్ పర్యవేక్షణలతో ఒత్తిడి పెంచడం, షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉపాధ్యాయుల గౌరవాన్ని తుంచారని విమర్శించారు.