– కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ పనులను కూడా మేఘా సంస్థకే ఇస్తారని గతంలోనే చెప్పాం
– అలాగే 4, 350 కోట్ల పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థకే ఇచ్చారు
– మేఘా,పొంగులేటి రాఘవ సంస్థకు కేక్ ను కోసినట్లు అప్పగించావ్
– మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జడ్చర్ల: పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు ఇచ్చారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా అన్ని రిజర్వాయర్లు పూర్తి చేశాం. 95 శాతం పని అయిపోయింది. మిగిలిన 5 శాతం పనిని భూసేకరణ చేసి పూర్తి చేయాలి. దానికి సంబంధించిన టెండర్లు కూడా ప్రకటిస్తే ఈ ప్రభుత్వం రద్దు చేసింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను ఎందుకు పూర్తి చేస్తలేవు? కేసీఆర్ కు పేరు వస్తదనే కారణంతోనే ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తలేవా? సుంకిశాల లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి కారణమైన మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము గతంలోనే చెప్పాం. కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ పనులను కూడా మేఘా సంస్థకే ఇస్తారని చెప్పాం. అదే విధంగా కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాదాపు 4, 350 కోట్ల పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థకే ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సినప్పటికీ ఆ సంస్థకే పనులు అప్పగించాడు.
దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు, సగం పనులు మేఘా ఇంజనీరింగ్ కు మరో సగం పనులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ సంస్థకు కేక్ ను కోసినట్లు వాళ్లకు అప్పగించావ్.
కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ పట్టణంలో 4 వేల డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పట్టాలనే ఆక్రమణలుగా చిత్రీకరించారు. పేదవాళ్లు, దివ్యాంగులు అనే సోయి లేకుండా దయ, దాక్షిణ్యం లేకుండా 75 మంది ఇళ్లు కూలగొట్టారు. పాలమూరు బిడ్డనని రేవంత్ రెడ్డి చెప్పుకుంటావ్. ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది? పేదవాళ్ల ఇళ్లు కూలగొట్టటానికేనా?
ఏ కారణంతో వాళ్ల ఇళ్లు కూలగొట్టారో ఈ ప్రభుత్వం సమాధానం చెబుతుందా పేదవాళ్లు, బీదలు ఎక్కడైనా తెల్వక ఇళ్లు కట్టుకుంటే వారికే రెగ్యులరైజ్ చేసే విధంగా జీవో 58, 59 తెచ్చాం. ఇది సంస్కారవంతమైన ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ మీ ప్రభుత్వం బడికి పోయే పిల్లలను, దివ్యాంగులను రోడ్డు మీద పడేసింది.
పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. నీకు సంస్కారం ఉంటే పేదల పట్ల ప్రేమ ఉంటే…ఆ 75 మందికి డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించు. ఏ అధికారులైతే అక్రమంగా పేదల ఇళ్లు కూల్చారో, ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి.