– సీఎం వైఎస్ జగన్‌ను కోరిన రాజమోహన్‌రెడ్డి
– ‘మెరిట్స్’ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తానని వెల్లడి
– వచ్చే అసెంబ్లీ సమావేశంలో చర్యలు తీసుకుంటామని హామీ
మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్)ను మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమోహన్‌రెడ్డి కోరారు.
అత్యంత విషాదకర సమయం.. తన ముద్దుల కొడుకు, మేకపాటి కుటుంబ రాజకీయ ఆశాసౌధం హఠాన్మరణం తట్టుకోలేక దుఃఖాన్ని పంటి బిగువున బిగబట్టుకున్న వేళ..
ఇంతటి బాధాతప్త సమయంలో కూడా నెల్లూరు పెద్దాయన రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల అభివృద్ధిని మరువలేదు.
బుధవారం ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్ జగన్ విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంతో పెద్దాయన మెట్ట ప్రాంత అభివృద్ధి, పలు విషయాల గురించి మాట్లాడారు. ఉదయగిరిలో వందెకరాల్లో తాను ఏర్పాటుచేసిన ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంతో చెప్పారు.
దీనికిగానూ మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. స్పందించిన సీఎం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కళాశాల పేరు మార్చడంతోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు, తగిన చర్యలు తీసుకుంటామని పెద్దాయనకు హామీ ఇచ్చారు.
ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలతోపాటు … గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు మెట్ట ప్రాంతాలకు తాగు,సాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టు,సోమశిల హై లెవెల్ కెనాల్, ఫేజ్–1, ఫేజ్–2లను పూర్తి చేసి, త్వరగా డెల్టాగా మార్చాలని రాజమోహన్‌రెడ్డి కోరారు. వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.