- పోలవరం పనులను ఎంఈఐఎల్కు ఇచ్చినందుకా?
- మరి ఆరోజు ట్రాన్స్ట్రాయ్ నుంచి పనులు తప్పించారు
- రామోజీ కొడుకు వియ్యంకుడి కంపెనీ నవయుగకు ఇచ్చారు
- అది కూడా టెండర్లు పిలవకుండానే ఇచ్చారు
- కానీ మేము రివర్స్ టెండరింగ్‌లో పనులు అప్పగించాం
- ఇవేవీ రామోజీరావుకు, ఎల్లో మీడియాకు కనబడడం లేదా?
- ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో గనులపై ‘గాలి’ వార్తలు
- ఎల్లో మీడియాలో యథావిథిగా తీవ్ర దుష్ప్రచారం
- రెండు రాష్ట్రాల సరిహద్దులను జీఎస్ఐ నిర్ధారించింది
- వివాదం తేలడంతో, గనుల తవ్వకాలకు కోర్టు పర్మిషన్
- అయినా ప్రభుత్వంపై బురద చల్లుతూ కధనాలు
- తమ కేసుల్లో కోర్టు తీర్పులను కూడా ఇలాగే చూడాలా?
- పోలవరం పనులపైనా అసత్య కధనాలు. దుష్ప్రచారం
- పీపీఏ రాసిన లేఖకు సమాధానం చెబుతాం
- జూలై 31 నాటికి డయాఫ్రమ్‌వాల్ సేఫ్ లెవెల్‌కు చేరాలి
- కానీ నెల ముందే వరదలు రావడం వల్ల పనులు సాగలేదు
- అయినా ఎల్లో మీడియా అదే పనిగా బురద చల్లుతోంది
- మంత్రి అంబటి రాంబాబు
మళ్లీ వరదలకు ఛాన్స్. అప్రమత్తం:
నాగార్జునసాగర్ దాదాపు నిండిపోయింది. రేపు తెలంగాణ ప్రభుత్వం నీరు విడుదల చేయనుంది. అంటే కృష్ణా నదిలో కూడా వరద భారీగా రానుంది. ఎందుకంటే సాగర్‌పై ఉన్న అన్ని ప్రాజెక్టులూ పూర్తి స్థాయిలో నిండాయి. కాబట్టి సాగర్ దిగువన పులిచింతల, ఆ దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి. అలా ఈ సీజన్లో గోదావరికి రెండోసారి, కృష్ణా నదికి తొలిసారి వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరాం. ప్రభుత్వమూ సన్నద్ధంగా ఉంది.
గనులపై ‘గాలి’ వార్తలు:
ఇక రెండు పత్రికలు యథావిథిగా ప్రభుత్వంపై బురద చల్లుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా గాలి జనార్థన్‌రెడ్డికి గనులు అప్పగిస్తున్నారంటూ రాశాయి.
నిజానికి ఆంధ్రా– కర్ణాటక సరిహద్దులు, అక్కడి గనులపై కొన్ని దశాబ్దాలుగా వివాదం ఉన్న విషయం అందరికీ తెలుసు. ఈ వివాదాన్ని పరిష్కరించటానికి సాక్షాత్తూ సుప్రీంకోర్టే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) వారి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించాల్సిందిగా ఆదేశించారు. ఆ కమిటీ సర్వే చేసిందీ, సర్వే చేసి ఒక రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు సమర్పించింది. అంటే ఇది సరిహద్దుల నిర్ణయానికి సంబంధించిన కమిటీ. కేంద్ర ప్రభుత్వ సంస్థ చేసిన ఈ సర్వేని రెండు రాష్ట్రాలూ ఆమోదించాయి.
అంటే ఆమోదించిందీ.. గాలి జనార్థనరెడ్డి గనులనా లేక రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులనా అన్నది పాఠకులకు చెప్పకుండా ఏవో గాలి రాతలు రాశారు. గనుల తవ్వకాలకు సంబంధించి, సుప్రీంకోర్టు, సర్వే జనరల్ ఆఫ్ ఇండియా వంటివారు ఆమోదించిన నేపథ్యంలో, ఆ నివేదికకు రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపితే.. అది గాలి జనార్థన రెడ్డిది ఆమోదం తెలపటం అవుతుందా?
ఈ నిజాలన్నీ తెలిసి కూడా, గాలి జనార్థనరెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏదో జరిగిపోతుందన్నట్టు ఒక వార్త రాయడాన్ని జర్నలిజం అంటారా లేక దోచుకో, పంచుకో, తినుకో.. స్కీమ్ ప్రకారం ఈనాడుకు కలిగిన కడుపు మంట అంటారా..?
మీ కేసులనూ అలాగే చూడాలా?:
న్యాయం ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా తప్పు పట్టాలని ఈనాడు అనుకుంటూ ఉన్నట్లైతే, రేపు తమ కేసుల్లో వచ్చే తీర్పులను కూడా ఇదే పద్ధతిలో తప్పుపట్టాలా?.. అన్నది ముందుగా వారు సమాధానం ఇవ్వాలి.
పోలవరంపైనా విషం:
ఇక పోలవరం ప్రాజెక్టుపైనా పుంఖానుపుంఖాలు రాస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వం విఫలమైందని, దానిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందంటూ అదే పనిగా రాస్తున్నారు. నిజానికి పోలవరాన్ని 2018 నాటికే పూర్తి చేస్తానన్న చంద్రబాబు, దాన్ని నాశనం చేశాడు.
మేము ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాం. రాష్ట్ర ప్రభుత్వం, పీపీఏ, కేంద్ర జల వనరుల కమిషన్, డీడీఆర్పీ, కేంద్ర జల వనరుల శాఖ.. అందరం సమష్టిగా ముందుకుపోతేనే, పనులు సాగుతాయి. డబ్బులు ఇచ్చేది కేంద్రం. పనులు పర్యవేక్షించేది రాష్ట్ర ప్రభుత్వం.
కాగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్‌లు. దీంట్లో లోయర్ కాఫర్ డ్యామ్‌ను అనుకున్న సమయానికి ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. అందుకే ఈ ప్రాజెక్టు పనులు నాశనమై పోయాయి. అయితే రెండు కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండానే, డయాఫ్రమ్ వాల్ నిర్మించింది ఎవరు? ఆ వార్తను ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఎందుకు రాయరు?
ఎందుకంత కడుపు మంట?:
రామోజీరావుకు మా ప్రభుత్వంపై కడుపు మంట. ఎందుకంటే అంతకు ముందు పోలవరం ప్రాజెక్టు పనులను నవయుగ కంపెనీకి ఇస్తే, దాన్ని మార్చి ఎంఈఐఎల్కు ఇచ్చాం. నవయుగ కంపెనీ రామోజీరావు కొడుకు వియ్యంకుడిది. మరి గతంలో ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇచ్చిన పనులను ఆపిన చంద్రబాబు, ఆ పనులను నామినేషన్ పద్ధతిలో నవయుగకు ఇచ్చారు. అప్పుడు కనీసం టెండర్లు కూడా పిలవలేదు.
కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం వల్ల ఏకంగా రూ.800 కోట్లు ఆదా అయ్యాయి. ఎంఈఐఎల్ 12.6 శాతం తక్కువకు కోట్ చేసింది. అందుకే నవయుగ నుంచి పనులు మెగాకు అప్పగించాం.
తమ బంధువులు ఆ పనులు చేసి దోచుకోవాలని రామోజీరావు అనుకున్నారు. మేము కాంట్రాక్ట్ సంస్థను మార్చడం వల్ల, తమకు నష్టం జరుగుతోందని రామోజీరావుకు కడుపు మంట. అందుకే అసత్య ప్రచారాలు. బురద చల్లడం. ఏదో ఒక లేఖ చూపడం. వార్తలు రాయడం.
ఆ పనుల్లో జాప్యం ఎందుకంటే?:
పోలవరం వద్ద లోయర్ కాఫర్ డ్యామ్ పనులను జూలై చివరి నాటికి పూర్తి చేయాలని అనుకున్నాం. ఆదే విషయాన్ని పీపీఏ కూడా చెప్పింది. అయితే లోయర్ కాఫర్ డ్యామ్ డిజైన్లు ఏప్రిల్‌లో ఇచ్చారు. వారికి అంత ఆలస్యం ఎందుకు అయిందంటే, లోయర్ కాఫర్ డ్యామ్ కట్టే ప్రదేశంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఏం చేయాలన్న దానిపై పీపీఏ, డీడీఆర్పీ, ఐఐటీ, సీడబ్ల్యూసీ.. అందరూ అనేకసార్లు సమావేశమై మాకు కొన్ని సూచనలు చేశారు. కేవలం సాధారణ ఇసుక మూటలు కాకుండా, జెట్ రౌటింగ్ చేయమన్నారు. జియో బ్యాగ్స్ తెచ్చి, దాంట్లో ఇసుక నింపి వేయమని చెప్పారు. దాంతో యుద్ధప్రాతిపదికన జియో బ్యాగ్స్ తెప్పించి వేశాం.
జూలై తర్వాత వరదలు వస్తాయి కాబట్టి, దాన్ని సేఫ్ లెవెల్‌కు అంటే 25 మీటర్ల వరకు తీసుకొస్తే, వరదలు వచ్చినా, నీరు రాదని అన్నారు. ఆ పనులను జూలై 31 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ వరదలు ఎప్పుడొచ్చాయో అందరికీ తెలుసు. దాదాపు నెల ముందే వరదలు వచ్చాయి. జూలై 8న వరదలు మొదలయ్యాయి. దాంతో పనులు ఆగిపోయాయి. ఇదే విషయాన్ని పీపీఏ అడిగితే, మేము చాలా స్పష్టంగా చెప్పబోతున్నాం.
ఆలోగానే బురద చల్లుతున్నారు:
అయినా ఆ లోగానే ఈ ప్రభుత్వం తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందన్నట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశారు. అదే విషయాన్ని పీపీఏ చెప్పిందంటూ రాశారు. నిజానికి వరదలు ముందే వస్తే, పనులు జరగకపోతే, ఇక్కడ ప్రభుత్వం తప్పు చేసిందా? పొరపాటు చేసిందా? ఈ వాస్తవాలు రామోజీరావుకు, ఆంధ్రజ్యోతికి కనిపించడం లేదా?
అసలు పోలవరం ప్రాజెక్టుకు శాపం చంద్రబాబు. ఎక్కడైనా కాఫర్ డ్యామ్ పూర్తి చేయకండా డయాఫ్రమ్ వాల్ కడతారా? దీన్ని ఎల్లో మీడియా ఎందుకు రాయదు?
జూలై 31 నాటికి లోయర్ కాఫర్ డ్యామ్‌ను ఎందుకు సేఫ్ లెవెల్‌కు తీసుకురాలేకపోయారని పీపీఏ అడిగింది. మా శాఖ కార్యదర్శి సెలవులో ఉన్నారు. ఆయన తిరిగి జాయిన్ అవుతున్నారు. రాగానే పీపీఏకు లేఖ రాయడానికి సిద్ధమయ్యారు. మా సమాధానాన్ని పీపీఏ కూడా ఆమోదిస్తుంది. అయినా ఇవేవీ పట్టించుకోకుండా, పోలరం పనుల్లో ఏదో స్కామ్ జరుగుతున్నట్లు రాస్తున్నారు.
స్కామ్‌లు అంటే అవీ..:
నిజానికి స్కామ్‌లన్నీ చంద్రబాబు హయాంలో జరిగాయి.
అవెలా అంటే, ఉచిత ఇసుక అన్నారు. కానీ యథేచ్ఛగా దోచుకున్నారు. నిజానికి ఇసుక వల్ల ఏటా కనీసం రూ.750 కోట్ల ఆదాయం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చాక ఆ ఆదాయం పొందుతోంది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం తమ 5 ఏళ్ల పాలనలో అదే స్థాయిలో చూసినా, ఎంత దోపిడి చేశారనేది అర్ధమవుతుంది.
ఇక రాజధాని. అక్కడ, ఇక్కడ అంటూ, అందరినీ ఏమార్చి, తాము భూములు ముందుగా కొనుగోలు చేసిన చోట రాజధాని ప్రకటించారు.
దళితుల అసైన్డ్ భూముల కొనుగోలు చెల్లుబాటు కాదని తెలిసి కూడా ముందే తన వారితో కొనిపించి, ఆ భూములకు కూడా ఇప్పుడు ఎవరు యజమానులో వారికి రెసిడెన్షియల్, కమర్షియల్ స్థలాలు కేటాయిస్తాం అనటం.. ఇదీ స్కామ్ అంటే.
రింగు రోడ్డు అని చెప్పి, తన ఇష్టం వచ్చినట్టు హెరిటేజ్ భూముల రేట్లు పెరిగేలా రోడ్డు అలైన్ మెంటు నిర్ణయించడం.. ఇదీ స్కామ్ అంటే.
స్కామ్ అంటే ఒక పోలవరం.. అని దాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నాడని సాక్షాత్తూ మోదీనే చెప్పారు. అంతెందుకు ట్రాన్స్ట్రాయ్ ను తప్పించి రామోజీ వియ్యంకుడికి నామినేషన్ పద్ధతి మీద ఇవ్వటం కూడా ఒక స్కామే. పోలవరంలో కట్టాల్సిన పద్ధతిలో కాఫర్ డ్యామ్, స్పిల్ వే నిర్మాణాలు జరగక పోవడం కూడా స్కామే.
లేటరైట్ పేరిట, బాక్సైట్ తవ్వి వేదాంత కంపెనీకి దాన్ని సరఫరా చేయటం కూడా చంద్రబాబు మార్క్ స్కామే. చంద్రబాబు సీఎంగా ఉంటే.. సిమెంటు కంపెనీలకు లేటరైట్ సరఫరా కాలేదా..? ఒక టన్ను సిమెంటు తయారు కావాలంటే.. అందుకు 150 శాతం ఎక్కువగా సున్నపురాయి కావాలి. 30 శాతం బొగ్గు కావాలి. లేటరైట్ అనేది చాలా తక్కువ పరిమాణంలో వాడతారు. అయినా, రోజూ భారతి సిమెంట్స్ మీద వార్తలు రాయడానికి, తెలుగుదేశం, ఎల్లో మీడియా చేయని ప్రయత్నాలు లేవు.
తప్పు వారు చేసి..:
మెయిన్ డ్యామ్ పూర్తి కాగానే, కాఫర్ డ్యామ్‌లు తొలగించాల్సి ఉంటుంది. అయితే వాటిని కట్టకుండా, మెయిన్ డ్యామ్ అయిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్‌కు ప్రాణప్రదమైన డయాఫ్రమ్ వాల్ కట్టిన దుర్మార్గులు చంద్రబాబు, అప్పటి మంత్రి దేవినేని. అంత తప్పు చేసి, మామీద నెడుతున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి.
అవగాహన లేక కొందరు:
కొందరు విషయాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మొన్న అరుణ్‌కుమార్‌గారు కూడా మాట్లాడారు. డయాఫ్రమ్ వాల్ కట్టింది బావర్ కంపెనీ వాళ్లు కట్టారని. అది చాలా పేరున్న కంపెనీ అని. కాఫర్ డ్యామ్‌లు కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టకూడదని వారికి తెలియదా అని?
అది ఒక కాంట్రాక్ట్ కంపెనీ. వారు పనులు తీసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ కట్టి రూ.400 కోట్లు తీసుకుపోయారు. అక్కడ కాఫర్ డ్యామ్‌లు కట్టారా? లేదా? అనేది వారికి అవసరం లేదు.
ఇంకో మాట కూడా అన్నారు. కుందూనదిలో కాఫర్ డ్యామ్‌లు లేకుండా డయాఫ్రమ్‌వాల్ కట్టారని. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. డయాఫ్రమ్ వాల్ వేసి, ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఒకే సీజన్లో పూర్తి చేసినప్పుడు కాఫర్ డ్యామ్‌లు అవసరం లేదు. అంటే వేసవి సీజన్లో అలా పనులు పూర్తి చేసినప్పుడు, కాఫర్ డ్యామ్‌లు అవసరం లేదు.
కానీ ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో దాదాపు 1.6 కి.మీ పొడవైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కట్టడం ఒక సీజన్లో సా«ధ్యమా? అందుకే ఇక్కడ తప్పనిసరిగా కాఫర్ డ్యామ్‌లు కట్టాకే, డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి ఉంది.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
బాధ్యులపై చర్యలు తప్పవు:
బావర్ కంపెనీ నుంచి కమిషన్లు పొందడం కోసమే, డయాఫ్రమ్ వాల్ కట్టారు. అది దెబ్బ తినడం వల్ల రూ.400 కోట్ల నష్టం జరిగింది. మళ్లీ కొత్తది కట్టాలంటే మరో రూ.650 కోట్లు అవుతుంది. అక్కడి గుంతలు కవర్ చేయాలంటే రూ.1000 కోట్లు అవుతుంది. దీనంతటికీ బాధ్యులైన వారికి చర్యలు తీసుకుంటారా? అని అడుగుతున్నారు. ఎస్. తప్పనిసరిగా చర్యలు ఉంటాయి.
అయితే ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. చివరకు నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్‌కు బాధ్యతలు అప్పగించాం. వారు అక్కడ పరీక్షలు, పరిశోధన చేస్తుండగానే వరదలు వచ్చాయి. ఆ పనికి కూడా ఆటంకం ఏర్పడింది.
డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నది. అది శాస్త్రీయంగా రుజువు చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాం. అది పూర్తైతే తప్ప, మరో చర్యకు సిద్ధమవుతాం.