Suryaa.co.in

Andhra Pradesh

ధన్వంతరి మంత్రి.. లబ్‌ డబ్‌.. లబ్‌ డబ్‌..

– ఆ సవ్వడి అంటే ఆయనకు ఎంతో ఇష్టం..
– ఆ శబ్ధం లయ తప్పకుండా చూడటమంటే ఇంకా ఇష్టం..
– అందుకోసం అర్ధరాత్రి అయినా సరే స్టెత్‌ పట్టడానికి సిద్ధం

తొలుత నేను డాక్టర్‌ను..ఆ తర్వాతే ఏమైనా.. నా వారా.. పరాయి వారా.. నాకనవసరం.. ప్రాణాలు నిలపడమే తక్షణావసరం. ఇదీ మన ఏపీ మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్ శాఖామాత్యులు డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అంతరంగం.

తమకు ఆరోగ్యం బాగోలేదని శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని ప్రజలే కాకుండా ఏ ప్రాంతం వారు ఫోన్‌ చేసినా తక్షణమే స్పందిస్తుండటం ఆయనలోని మానవత్వానికి అద్దం పడుతోంది. ఏ వేళలో అయినా సరే వెంటనే స్పందించడం ఆయన గుణం. తగిన వైద్య సూచనలిస్తూ.. అవసరమైతే వెంటనే ఆస్పత్రిలో చేర్పించే ఏర్పాట్లు చేస్తుండటం పట్ల స్థానికులతో పాటు మిగతా ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. తనకు తెలిసిన వారెవరైనా ఫలానా ఆరోగ్య సమస్య ఉందంటూ మెసేజ్‌ చేసినా, తగు సూచనలిస్తూ చక్కగా గైడ్‌ చేయడం ఆయనకే చెల్లింది.

ఒక మంత్రిగా నిత్యం బిజీ బిజీగా తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ.. ఎవరికైనా సరే హెల్త్‌ బాగోలేదంటే తక్షణమే ఆయనలోని వైద్యుడు బయటకు వస్తాడు. చేస్తున్న పని పక్కన పెట్టి పూర్తిగా ఆరా తీస్తారు. తగిన సూచనలిచ్చాక తిరిగి ఆ పనిలో నిమగ్నమవుతారు. నిత్యం ఇలాంటి దృశ్యాలు ఎన్నో సాక్షాత్కారమవుతుంటాయని మంత్రి వెంట ఉండే వారు చెబుతుంటారు.

వైద్యో నారాయణో హరి అన్న ఆర్యోక్తికి అద్దం పట్టేలా మంత్రి నడవడిక ఉండటం అరుదైన విషయం. వర్షాలు మొదలయ్యాయి.. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తుగా తన నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఆస్పత్రులకు సూచించడం ఆయన ముందు జాగ్రత్తకు నిదర్శనం. ఒక్కోసారి ఆయనే స్టెత స్కోప్ చేత పట్టుకుని వైద్యం అందించిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇలాంటి డాక్టర్‌ కమ్‌ రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారని ప్రజలు చర్చించుకోవడం అందరికీ గర్వకారణం.

LEAVE A RESPONSE