– మృదుస్వభావి, మంచితనానికి మారుపేరు అడపా బాబ్జి
– అడపా బాబ్జి మృతి గుడివాడ రాజకీయాలకు తీరని లోటు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)
గుడివాడ, మార్చి 18: గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అడపా బాబ్జి మృతి వార్త తెలిసిన వెంటనే మంత్రి కొడాలి నాని హుటాహుటిన హైదరాబాద్
నుండి గుడివాడకు బయలుదేరారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతానికి నేరుగా పెదఎరుకపాడులోని అడపా బాబ్జి నివాసానికి మంత్రి కొడాలి నాని చేరుకోనున్నారు. అడపా బాబ్జి మృతి గుడివాడ రాజకీయాలకు తీరని లోటని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. మృదు స్వభావి, మంచితనానికి మారుపేరుగా నిలిచే అడపా బాబ్జి మృతి ఊహించలేనిదని మంత్రి కొడాలి నాని ఆవేదన వ్యక్తం చేశారు. నిస్వార్ధ ప్రజా నాయకుడు, స్నేహశీలి, పార్టీలకతీతంగా అందరూ ఇష్టపడే వ్యక్తి, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం అడపా బాబ్జి.
రోజూ మాదిరి వాకింగ్ నుండి ఇంటికి వచ్చిన అడపా బాబ్జికు హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు గుడివాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి, విజయవాడలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్య నిపుణులు, బాబ్జి గుండెకు స్టంట్ వేసి చికిత్సలు అందిస్తుండగా, హాస్పటల్ ల్లోనే
ఆయన తుది శ్వాస విడిచారు. గుడివాడ రాజకీయాల్లో ఓ మంచి నేతను కోల్పోవడాన్ని రాజకీయ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. రాజకీయ పార్టీల కార్యకర్తలతో పాటు, సామాన్య ప్రజలు కూడా అడపా బాబ్జి మరణ వార్త విని కలత చెందారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్దఎత్తున విజయవాడ చేరుకున్నాయి. పలువురు సన్నిహితులు అడపా బాబ్జి భౌతిక కాయాన్ని చూసి కన్నీళ్ళ పర్యంత మయ్యారు. అడపా బాబ్జి భౌతికకాయాన్ని విజయవాడలోని ఆసుపత్రి నుండి గుడివాడకు తరలించారు.