– మంత్రి గోరిని అంతేసి మాటలంటే ఒగ్గేత్తారా ఏటీ?
– మరి పోలీసు సంఘానికి ఇంకా బీపీ పెరగలేదేటి సెప్మా?
-పెద్దాఫీసర్లను తిడితేనే సంఘ నేతలకు బీపీ ఒచ్చేత్తుందేటి?
( మార్తి సుబ్రహ్మణ్యం)
సిక్కోలు మంత్రి.. అదేనండి పశువుల శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గోరికి పోలీసులపై మాచెడ్డ చిరాకేసింది. మరేయదేటి?.. అంతలావు మంత్రిగోరు పటాలం పాండు మాదిరిగా మందీమార్బలమేసుకుని, విశాఖ సాములోరి దర్శనానికి వెళితే.. ఆ పోలీసాయన అడ్డుకుంటాడా? ‘ఎల్తే నువ్వొక్కడివే లోపలికి బేగెల్లు. నీ ఎనక ఉన్న గ్యాంగును పంపించనని చెప్పడానికి’ ఆ పోలీసోడికి ఎన్ని గుండెలేటి? ఆ పక్క రాష్ట్రంలో జీయరు సాములోరు, మంత్రులను కొత్త గుడిలోకి దగ్గరుండి తీసుకువెళుతుంటే, ఇక్కడ మా జగనన్న రాజగురువు ఆశ్రమంలో మమ్మల్ని ఆపడానికి పోలీసోళ్లకు ఎంత ధైర్యం?
మరి అంతమంది అనుచరుల ముందు ఇన్‌సల్ట్ చేస్తే, మామూలు కౌన్సిలర్లకే బీపీ పెరుగుతుంది. మరి మంత్రి గోరికి బీపీ పెరగదేటీ?.. డీజీపీ గోరు కూడా జనాలకు బీపీ పెరగడం సహజమని ఓపాలి చెప్పారు కదా? అందుకే సీదిరి అప్పలరాజు గోరు పోలీసులను ‘ఏయ్ ఏటి బాబు..ఏటి తమాషాలు చేస్తున్నవా? ఎలాక్కనిపిస్తున్నమేటి? చొక్కా పట్టుకుని లాగేస్త నా కొడకా.. తమాషా దెం… తున్నావా?’ అని ఏదో బీపీ
పెరిగి, పోలీసాయనను మంత్రిగోరు అభిమానంగా తిట్టినంతనమాత్రాన.. ఈ పాపిష్టి సోషల్‌మీడియా దాన్ని అంతలా ప్రచారం చేసేస్తుందేటి? ఇదేటి ఇడ్డూరమో? కాకపోతే.. కొడాలి నాని, పేర్ని నాని మాత్రమే ఇప్పటిదాకా బూతుల మంత్రులని పేరుంది కాబట్టి ఈ తిట్లన్నీ ఆంధ్రావాళ్లకు అలవాటే. ఇప్పుడు లేటెస్టుగా వారి పక్కన అప్పలరాజు గోరు చేరారు. అద్గదీ అందరి ఆశ్చర్యానికి కారణం.
విన్నారుగా.. విశాఖ చినముషిడివాడలో కొలువుదీరిన కలియుగ శంకరాచార్యులయిన స్వరూపానంద వారి పీఠం వద్ద ఉదయం కనిపించిన సీన్ ఇది. జగనన్న వస్తున్నందున జనరల్‌గా శ్రీకాకుళం మంత్రి సీదిరి అప్పలరాజు కూడా అక్కడ హాజరువేయించుకోక తప్పదు. ఆ ప్రాక్టీసులో భాగంగానే ఆయన తన అనుచరులను వెంటేసుకుని, ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే బందోబస్తులో ఉన్న సీఐ ఆయనను ఆపి, ‘మీరొక్కరు మాత్రమే వెళ్లుడి. మీ అనుచరగణానికి ప్రవేశము లేద’ని నిర్మొహమాటంగా చెప్పారు.
దానితో డీజీపీ గతంలో చెప్పినట్లు.. మంత్రిగారికి బోలెడంత బీపీ వచ్చేసి, తన అనుచరులను ఆపేసిన పోలీసాయనపై బూతులు లంకించుకున్నారు. పోలీసు కమిషనర్‌ను పిలవాలని ఆర్డరేసినా ఫలితం సున్నా. విశాఖ పోలీసు కమిషనరేమన్నా, శ్రీకాకుళం జిల్లాలో పనిచేసే డీఎస్పీ అనుకున్నారేటి? ఎప్పుడు పిలిస్తే అప్పుడు బేగి వచ్చేయడానికి! అయినా.. మంత్రి గారు అమాయకుడు కాకపోతే… సర్కారు రాజగురువు దగ్గరకు వెళుతూ, ఆ రెగ్యులర్ టీమును కాకుండా, ఏ వీవీఐపీలతో వస్తే ఫ్రీ ఎంట్రీ ఉంటుందని మర్చిపోతే ఎలా?
సరే.. సరే.. ఈ ఎపిసోడ్‌ను సోషల్‌మీడియాలో వీడియోల ద్వారా చూసిన ప్రజాస్వామ్య ప్రేమికులకే బీపీ వచ్చింది. మరి ఈ సీన్ జరిగి, అది రాష్ట్రమంతా గత్తరయి ఇన్ని గంటలయినా.. ‘ఎలాంటి పక్షపాతం లేకుండా’, ‘ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా’, ‘పాలకులు చెప్పినా లెక్కచేయకుండా’, ‘డ్యూటీనే దైవంగా భావించి’, తమ ఉద్యోగులపై చీమవాలినా అవత లివారిని చీల్చిచెండాడి, ముఖ్యంగా ‘ప్రతిపక్షపార్టీల నేతలు తమ సార్లను విమర్శిస్తే వారిపై నిప్పులు కక్కి, తమ విధేయత ప్రదర్శించే’ ఏపీ పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్‌కు ఇప్పటివరకూ బీపీ రాకపోవడమే వింత. ఈ మొత్తం ఎపిసోడ్‌లో.. అసలు పశువుల శాఖ మంత్రి తిట్లకు బలయిన పోలీసు అధికారికి బీపీ పెరగకపోవడమే రొటీన్‌కు భిన్నం.
సాయంత్రం వరకూ పోలీసు సంఘం స్పందించకపోవడంతో, లోకేష్ ట్వీటిన ట్వీటుతో కూడా సంఘంలో చలనం లేకపోవడం మరో వింత. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అసలు తప్పంతా పోలీసోళ్లదేనంటూ వైసీపీ సోషల్‌మీడియా ప్రచారం చేసింది కాబట్టి.. పోలీసు సంఘం ‘పిత్తినపేరమ్మ’ మాదిరిగా, గట్టిగా మాట్లాడితే అసలుకే ఎసరు వస్తుందని భయపడి గమ్మున ఉందనుకోవచ్చు. కానీ అసలు యవ్వారమేందో వీడియోలతో సహా బయటకు వచ్చినా, సదరు సంఘాధినేతలు నవరంధ్రలూ మూసుకోవడమే ఆశ్చర్యం. ఈలోగా కాగలకార్యం లోకేష్ కానిచ్చి, సీఐను తిట్టిన మంత్రిగారి మూతుపురాణం వీడియోను ట్విట్టర్‌లో వదిలినా, పోలీసు సంఘంలో మునుపటి పౌరుషం పొడుచురాకపోవడం మరో వింత.
మామూలుగా లెక్క ప్రకారమయితే ఇదే ఏపీ పోలీసు అధికారుల సంఘం తమ అధికారికి జరిగిన అవమానంపై శివాలెత్తాలి. మీడియాలో గత్తర లేవగానే ఎక్కడోచోట ప్రెస్‌మీట్ పెట్టో, లేదా ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసో.. జరిగిన దానిని ఇంత పొడుగు కత్తితో ఖండించి, ప్రజల ప్రాణ రక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమపై మీ జులుమేమిటని కన్నెర్ర చేయాలి. వెంటనే డీజీపీ సార్‌కో, దగ్గరలో ఉన్న కొత్వాల్ సాబుకో అర్జెంటుగా వినతిపత్రం ఇచ్చి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి.
ఆ లెక్క ప్రకారమే గతంలో లోకేష్, వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై ఇదే సంఘం నేతలు బుసలుకొట్టారు. టీడీపీ నేతలు డీజీపీని విమర్శించినప్పుడు ఈ నేతలే అత్యంత భక్తిప్రపత్తులు ప్రదర్శించి, టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. మరి ఆ సంప్రదాయం ప్రకారమే సీఐపై, అందునా దళిత సీఐపై మంత్రి
అప్పలరాజు బూతుపురాణం యావత్ ప్రజలు శ్రవణానందంగా విన్నప్పటికీ, అవి అధికారుల సంఘానికి ఇన్ని గంటలు గడిచినా వినిపించకపోవడమే వింత. అంటే డీజీపీ, ఎస్పీ స్థాయి అధికారులను తిడితే తప్ప.. సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులను తిడితే పోలీసు వీరవిప్లవ సంఘాలు స్పందించవే మో!