అద్దంకి: మున్సిపాలిటీ లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మంచి నీటి సరఫరా, రహదారులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలపై దృష్టి పెట్టాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులకు సూచించారు.
పట్టణ వీధుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా శుభ్రం చేయాలని తెలిపారు. పట్టణ ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరాపై అధికారులు దృష్టిసారించాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. పట్టణంలో రోడ్ల మరమ్మత్తుల, వీధిలైట్లను అమర్చడం లాంటి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి ఆదేశించారు.
గత ప్రభుత్వం ప్రజలు, వ్యాపారుల నుంచి చెత్త పన్నును వసూలు చేసిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తపన్నును రద్దు చేసిందని మంత్రి తెలిపారు.
చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని వస్తే, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వాటి ఊసే లేకుండా చేసినట్లు పేర్కొన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికంగా వచ్చిన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వినతిపత్రాలు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యల సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం కృషి చేయాలని పేర్కొన్నారు. అద్దంకి ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ ప్రజలు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.