– సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కు మంగళగిరి శాలువా కప్పి స్వాగతం పలికిన మంత్రి
– చంద్రబాబు, పవన్, మాధవ్ తో కలిసి బస్సులో ప్రయాణం
– అడుగడుగునా స్వాగతం పలికిన మహిళలు, కూటమి నేతలు
ఉండవల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి సమీపంలోని బస్టాండ్ వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కు మంగళగిరి శాలువా కప్పి మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు.
అనంతరం వీరందరితో కలిసి ఉచిత బస్సులో ప్రయాణించారు. బస్సు దేవుడు మాన్యం, ఉండవల్లి సెంటర్, భరతమాత సర్కిల్, 16వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులోని హెచ్ పీ పెట్రోల్ బంక్, వారధి బ్రిడ్జ్, కనకదుర్గ వారధి, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, వినాయక టెంపుల్ కార్నర్, ఆంధ్ర కేసరి సర్కిల్, కంట్రోల్ రూమ్ సర్కిల్ మీదుగా విజయవాడ సీటీ టెర్మినల్ బస్టాండ్ వద్దకు చేరుకుంది.
మహిళలతో కలిసి సీటీ టెర్మినల్ బస్టాండ్ వరకు మంత్రి ప్రయాణించారు. ఈ క్రమంలో బస్సు ప్రయాణించే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా నిల్చొని మహిళలు, కూటమి నేతలు అడుగడుగునా స్వాగతం పలికారు. అడుగడుగునా మంగళహారతులతో మంగళగిరి మహిళలు ఘనస్వాగతం పలికారు. కూటమి నేతలు పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేశారు.