– వ్యక్తిగత నిధుల నుంచి ట్యూషన్ ఫీజు అందజేత
అమరావతి: లోకేషన్నా కష్టాల్లో ఉన్నానని అంటే చాలు… క్షణం ఆలోచించకుండా ఆపన్న హస్తం అందించే పెద్దమనసు యువనేత నారా లోకేష్ ను కోట్లాదిమంది ప్రజలకు ఆత్మబంధువుగా మార్చింది. అధికార పరిధిలో ఉన్నా, లేకపోయినా తమవంతు సాయం అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్.
ప్రజాదర్బార్ ద్వారా తమ వద్దకు వస్తున్న వారికి అవకాశమున్న మేర చేయూతనిస్తూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్థాన్ లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో మెడిసిన్ జనరల్ ప్రాక్టీషనర్ (ఫిజిషీయన్) 4వ సంవత్సరం చదువుతోంది. గత ప్రభుత్వం విధించిన అడ్డగోలు నిబంధనల కారణంగా కార్తీకకు విదేశీ విద్య ద్వారా ఎటువంటి సాయం అందలేదు.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన తమబిడ్డ చదువుకు సాయం అందించాల్సిందిగా ఇటీవల కార్తీక తండ్రి శ్రీనివాసరావు ప్రజాదర్బార్లో వినతిపత్రం అందించారు. వెంటనే సంబంధిత విద్యార్థిని వివరాలు తెలుసుకోవాల్సిందిగా లోకేష్ వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టు 14వతేదీ కల్లా కార్తీక 4వసంవత్సరం ఫీజు చెల్లించి కళాశాలకు వెళ్లాల్సిఉంది.
విదేశీ విద్య పథకానికి ఇంకా కొత్తగైడ్ లైన్స్ తయారు కాకపోవడంతో ప్రభుత్వం ద్వారా ఆ విద్యార్థినికి నేరుగా సాయం అందించే అవకాశం లేదు. దీంతో మంత్రి లోకేష్ స్పందిస్తూ కార్తీక ట్యూషన్ ఫీజుకు అవసరమైన రూ.1.43 లక్షలను సొంత నిధులనుంచి సమకూర్చాల్సిందిగా వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు.
ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి లోకేష్ శుక్రవారం సాయంత్రం ఉండవల్లి నివాసంలో కార్తీకకు అందజేశారు. తొలుత ట్యూషన్ పీజు చెల్లించి కళాశాలకు వెళ్లాలని, విదేశీవిద్య పథకానికి నూతన గైడ్ లైన్స్ రూపొందించాక ప్రభుత్వం ద్వారా సాయం అందించే అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మెడిసిన్ విద్యార్థిని కార్తీక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నిబంధనలు అంగీకరించకపోయినా మనసుంటే మార్గం లేకపోదని నిరూపించారు మంత్రి నారా లోకేష్.