– తల్లికి వందనం పథకం కింద నలుగురు విద్యార్థులకు అందిన సాయం
– విద్యార్థులు, వారి తల్లితో మంత్రి లోకేష్ ముఖాముఖి
– విద్యార్థుల ఉన్నత చదువుల బాధ్యత తీసుకుంటానని హామీ
కొత్తచెరువు: విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముందుగా జూనియర్ కళాశాల ప్రాంగణంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లికి వందనం పథకం కింద సాయం పొందిన పి.మాధవి, ఆమె నలుగురు పిల్లలతో ముఖాముఖి నిర్వహించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కొత్త చెరువు బీసీ కాలనీకి చెందిన పి.మాధవికి ఎనిమిదో తరగతి చదివే బాలు, ఏడో తరగతి చదివే నరసమ్మ, ఐదో తరగతి చదివే బేబీ, మూడో తరగతి చదివే సన అనే నలుగురు పిల్లలు ఉన్నారు. మాధవి నలుగురు పిల్లలకు తల్లికి వందనం పథకం కింద రూ.52వేల సాయం అందింది. దీంతో పీటీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు పాఠశాలకు చేరుకున్న మంత్రి లోకేష్ ముందగా తల్లి మాధవి, నలుగురు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
పాఠశాలలో వసతులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. యూనిఫాం, మధ్యాహ్న భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి మాధవి మాట్లాడుతూ.. తమకు తల్లికి వందనం పథకం కింద రూ.52వేల సాయం అందిందని, ఆ నగదును పిల్లల పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పిల్లల ఉన్నత చదువుల బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. పిల్లలను బాగా చదివించాలని చెప్పారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగుందని ఈ సందర్భంగా విద్యార్థులు చెప్పారు. మధాహ్న భోజనంలో సన్నబియ్యం అందిస్తున్నామని, పుస్తకాల బ్యాగ్ బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం తీసుకువచ్చామని, వర్క్ బుక్ లు అందజేశామని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. బాగా చదువుకోవాలని, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని పిల్లలకు సూచించారు. తల్లికి వందనం కింద నలుగురు పిల్లలకు సాయం అందించడంతో పాటు.. మంత్రి నారా లోకేష్ తమ పట్ల చూపించిన ఆపాయ్యత పట్ల మాధవి, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.