Suryaa.co.in

Editorial

మంత్రి మల్లన్నతోని అట్లుంటది!

( మార్తి సుబ్రహ్మణ్యం)

మునుగోడు ఉప ఎన్నిక టీఆర్‌ఎస్.. సారీ బీఆర్‌ఎస్‌కు.. ఇజ్జత్‌కా సవాల్. కొత్తపార్టీ పెట్టినంక.. అదే .. జాతీయ పార్టీ పెట్టినంక వచ్చిన మొదటి ఉప ఎన్నిక. ఇందులో గెలవకపోతే కేసీఆర్ సారుకు ఇక ఇజ్జత్ ఇండదీ. ‘ నీ స్టేట్‌లోనే గెల్వనోడివి, ఇంక దేశంలో ఏం గెలుస్తవని’ పువ్వుపార్టీ బద్నాం చేస్తే ఇజ్జత్‌మానం పోదూ? అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు మునుగోడు చుట్టుముట్టు మోహరించిన్రు. కులాల లెక్క లీడర్లను జమ చేసి, కేటీఆర్ తానకు తోల్కొపోయి, జై టీఆర్‌ఎస్ అనిపిస్తున్రు. మాకులపోళ్ల ఓట్లన్నీ మీకే అని భరోసా ఇప్పిస్తున్రు. మంత్రులేమో తమకు కేటాయించిన గ్రామాల్లోకి వెళ్లి, లోకల్ లీడర్లతో మాటా ముచ్చట షురు చేసిన్రు.

ఇంతకూ ఇప్పటి ముచ్చటేందంటే.. మన మంత్రి మల్లన్న లేడూ.. గదే మన మల్లారెడ్డన్న.. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, రెడ్డిబావి, గుండ్లబావి గ్రామాలకు ఇన్చార్జిగా పనిచేస్తున్నర్రు. ఆ గ్రామాల్లో పెద్దమనుషులను పిలిపించి, దావత్‌లు పెట్టి మరీ కార్వాయి చేస్తున్న పుటువలు, సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. మందుపోయడం నేరం కాదనుకోండి. అది వేరే ముచ్చట. పెద్ద మనుషులకు జరింత మందు పోసి, మంచి చెడ్డలు మాట్లాడి, చివరాఖరలో ‘మన పార్టీనే గెల్వాలె. నా ఇజ్జత్ నిలబెట్టాలె పెద్ద మనిషీ’ అని మందుపోసి మరీ హితబోధ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి ప్రయత్నం చూస్తుంటే, ముచ్చటేయడం లేదూ?! మరి మల్లన్నా..మజాకనా?

LEAVE A RESPONSE