Suryaa.co.in

Andhra Pradesh

టిడ్కో ఇళ్లల్లో మంత్రి నిమ్మల శ్రమదానం

పాలకొల్లు: టిడ్కోఇళ్ళను ఆరువేల కోట్లకు జగన్ మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి నిధులు మళ్ళించి లబ్దిదారులను రుణ గ్రస్తులనుచేశారని జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాల సముదాయ కాలనీలో ఆదివారం టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. కాలనీలో ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా అడవిలా పెరిగిన పిచ్చి వృక్షాలను, మట్టి గుట్టలను తొలగించారు. మంత్రి రామానాయుడు స్వయంగా పార, గునపం పట్టి పనులు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో గృహాలను 90 శాతం పూర్తి చేస్తే, వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో అర బస్తా సిమెంటు, రూపాయి పని చేయ లేదన్నారు. జగన్ రాష్ట్రంలో టిడ్కో ఇళ్లను ఆరు వేల కోట్లకు తాకట్టు పెట్టి నిధులను మళ్లించి లబ్ధిదారులను రుణగ్రస్తులను చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలు మహిళలపై కక్ష సాధింపుకు టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేయడమే నిదర్శనమని ఆరోపించారు.

ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఉండేందుకు జగన్ అర్హత లేదని విమర్శించారు. పేదవాడి సొంత ఇంటి కల తెలుగుదేశం ప్రభుత్వం లోనే సాధ్యమవుతుందన్నారు. మిగిలిన పదిశాతం పనులు పూర్తిచేసి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు.

ఈ శ్రమదాన కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులతో పాటు మహిళలు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, నాయకులు జీవి, పేచ్చేటి బాబు, బోనం చిన్నబాబు, జక్కంపూడి కుమార్, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, కోడి విజయ భాస్కర్, మామిడి శెట్టి పెద్దిరాజు, బొప్పన హరి కిషోర్, పాముల రజిని, కర్నేన గౌరు నాయుడు, కర్నేన రోజారమణి, పాలవలస తులసీరావు, మాతా రత్నం రాజు, ఆరిమిల్లి చిన్ని, పి రామభద్ర రాజు, మండాది అవినాష్, వీర కృష్ణ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE