– వైయస్సార్సీపీ హయాంలో అప్పులపై కూటమి చేసిందంతా దుష్ప్రచారమే
– గత ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు రూ.3.70 లక్షల కోట్లేనని పయ్యావుల వెల్లడి
– రూ.14 లక్షల కోట్లు అంటూ చేసిన ప్రచారం తప్పేనని తేలిపోయింది
– అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు జీతం తీసుకోలేదా?
– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
తాడేపల్లి:: అసెంబ్లీ సమావేశాల సాక్షిగా అప్పులపై కూటమి నాయకుల కుట్రలు బట్టబయలు అయ్యాయని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైయస్సార్సీపీ పాలనలో రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లన్నట్టు చేసినదంతా దుష్ప్రచారమేనని స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిన గణాంకాలతో నిజం బయటపడిందని అన్నారు.
అయిదేళ్ళ వైయస్ జగన్ హయాంలో చేసిన అప్పులు కేవలం రూ.3.70 లక్షల కోట్లేనని ఆర్థిక మంత్రి ఎట్టకేలకు వాస్తవాన్ని బయటపెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. అంటే రాజకీయంగా బురదచల్లేందుకే వైయస్ జగన్ పాలనపై అసత్య ప్రచారం చేసినట్లుగా కూటమి ప్రభుత్వమే తప్పును అంగీకరించిందని, కూటమి దిగజారుడు ప్రచారాల్లోని అవాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.
వైయస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లంటూ విపరీతంగా తప్పుడు ప్రచారం చేసింది. వైయస్సార్సీపీ ప్రభుత్వం మీద బురద జల్లడమే లక్ష్యంగా అప్పులతో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తీరు మార్చుకోకుండా పలు సందర్భాల్లో అవే అబద్ధాలను వల్లె వేస్తూ వచ్చారు.
నిజం నిలకడ మీదనే తెలుస్తుందన్నట్టు కూటమి కుట్రలు బద్దలయ్యాయి. అప్పులపై కూటమి నాయకులు చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని వారే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. రాష్ట్ర అప్పులపై వైయస్సార్సీపీ సభ్యుడిగా నేను అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ నిజాలను చెప్పాల్సి వచ్చింది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి బడ్జెట్‌తోపాటు గ్యారెంటీ కలిపి మొత్తం అప్పు రూ.3,06,952.26 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
అలాగే వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,70,897 కోట్లేనని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అధికారంలోకి రావడం కోసం తెలుగుదేశం నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని పలుమార్లు ఆధారాలతో సహా వైయస్సార్సీపీ చెబుతూనే వస్తోంది.
తాజాగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల సమాధానంతో వైయస్సార్సీపీ హయాంలో రూ. 14 లక్షల కోట్లు అప్పులు చేశారని జరిగిన ప్రచారమంతా అబద్ధమేనని తేలిపోయింది. వైయస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే 2024 జూన్ 12 నాటికి బడ్జెట్ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు కలిపి మొత్తం రూ.6,77,849.80 కోట్లు మాత్రమే ఉన్నట్లు మంత్రి చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన 15 నెలల్లోనే దాదాపు రూ.2 లక్షల కోట్లకుపైగా అప్పు చేసింది. అప్పులపై నేను అడిగిన అదే ప్రశ్నలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేసిన అప్పులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానికి అసెంబ్లీ సాక్షిగా మంత్రి అబద్ధం చెప్పి అడ్డంగా దొరికిపోయారు.
ఈ ఆర్థిక సంవత్సరం అంటే కేవలం అయిదు నెలల్లో (ఆగస్టు 31 నాటికి) చేసిన అప్పులు రూ. 44,364 వేల కోట్లు అని, దానిలో రూ.9,058 కోట్లు చెల్లింపులు చేశామని, మిగిలిన నికర అప్పు రూ.35,305 కోట్లు అని వెల్లడించారు. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ చెప్పిన లెక్కల ప్రకారం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు చేసిన అప్పు అక్షరాలా రూ.55,901 కోట్లని తన ఆడిట్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొంటున్నా కూడా ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు అడ్డగోలుగా అబద్దాలు చెబుతోంది.
ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోయినా ఇన్ని అప్పులు ఎందుకు చేశారంటే దానికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 61,578 కోట్లు కాగా, ఇది కాకుండా రికవరీ రుణం రూ. 31.25 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 61,609 కోట్లు. ప్రభుత్వం చేసిన వ్యయం రూ. 1,16,626.53 కోట్లు. లోటు రూ. 55,901 కోట్లని స్పష్టంగా అర్థమైపోతున్నా సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు ఆర్థిక మంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.
చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీకి రాకుండా ఇంటి రెంట్, జీతాలు, ఇతర అలవెన్సులతోపాటు ఆఖరుకి డీజిల్ డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇది నిజమో కాదో ఆయన చెప్పాలి. అసెంబ్లీకి గైర్హాజరు అయినా జీతాలు తీసుకున్నారో లేదో చెప్పాలని ఆర్టీఐ ద్వారా కోరడం జరిగింది.
దీంతో అసెంబ్లీ సెక్రటరీ నన్ను పిలిచి ఆర్టీఐ ద్వారా చేసిన దరఖాస్తును వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరినా నేను వెనక్కి తగ్గలేదు. కానీ ఇప్పటికీ దానికి సంబంధించినవివరాలు ఇవ్వడంలేదు. చంద్రబాబు జీతాలు, ఇతర అలవెన్సులు, డీజీల్ డబ్బులు తీసుకోకపోయుంటే వివరాలు ఇవ్వడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నట్టు చెప్పాలి.