– ప్రధాని వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టాలి
– విమాన ప్రయాణీకుల సమస్య తీర్చాలి
– మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
– కోటి సంతకాల సేకరణకు విశేష ప్రజా స్పందన
– కోనసీమ జిల్లాలో సంతకాల కార్యక్రమం సక్సెస్
– డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో వైయస్సార్సీపీ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్, పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడిన పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.
రావులపాలెం: టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో గత 18 నెలలుగా ఏ ఒక్క రంగంలోనూ అభివృద్ధి లేదని, ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, అన్ని రంగాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం, ప్రజా కంఠక పాలన చేస్తోందని వైయస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. రెండేళ్లు కోవిడ్ వంటి విపత్కర పరిస్థితి ఉన్నా, గత ప్రభుత్వంలో వైయస్ జగన్, సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యాక్రమాలు ఆపలేదని ఆయన స్పష్టం చేశారు. జగన్ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటపరం చేస్తున్నారని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మీడియాతో మాట్లాడిన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులు పూర్తి చేయకపోగా, నిధులు లేవన్న సాకుతో, పీపీపీ పేరుతో 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. ఈ నిర్ణయం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే కాకుండా, సామాన్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను దూరం చేస్తుంది. అందుకే ఇది ఒక విధంగా ప్రజారోగ్యంపై దాడి.
10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అన్ని చోట్లా ప్రజలు స్వచ్ఛందంగా కదలివచ్చారు. ర్యాలీల్లో పాల్గొన్నారు. సంతకాలూ చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా కోటి సంతకాల కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. టార్గెట్‌కు మించి సంతకాలు చేయడం.. కూటమి ప్రభుత్వ విధానాన్ని ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో చెప్పడానికి నిదర్శనం.
కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో జాతీయ ఉపాధి హామీ పథకం (మనరేగా)లో ఏడు కోట్ల పని దినాలు తగ్గించి పేద కూలీల కడుపు కొట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల ఆకలి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏంటి? కూలీలకు పని దినాలు కల్పిం^è లేని ప్రభుత్వం, అద్భుతమైన ఉద్యోగాలు కల్పిస్తామని ఎలా హామీ ఇస్తుంది?.
ఇండిగో సంక్షోభం. మంత్రి రామ్మోహన్నాయుడు వైఫల్యం:
కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్నాయుడు వైఫల్యం వల్ల దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఇండిగో సంస్థకు చెందిన విమాన సర్వీసులు ఒకేసారి వందల సంఖ్యలో రద్దయ్యాయి. కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకపోవడంతో, ఎక్కడికక్కడ విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కేవలం మంత్రి రామ్మోహన్నాయుడు అసమర్థత వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ప్రతిష్ట దిగజారిపోయింది.
తన శాఖలోని పరిణామాలు అంచనా వేయకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఆయన తరుచూ ఇక్కడ భోగాపురం విమానాశ్రయ పనులు పరి«శీలిస్తూ, రీల్స్ చేయడంతోనే గడిపేస్తున్నారు. నిజానికి ఆ విమానాశ్రయం పనులను ఆయన పర్యవేక్షించాల్సిన అవసరం లేదు. అయినా పబ్లిసిటీ కోసం ఇక్కడ పర్యటిస్తున్నారు. విమాన ప్రయాణికుల దారుణ ఇబ్బందులపై వెంటనే ప్రధాని నరేంద్రమోదీ దృష్టి పెట్టాలని, సమస్య పరిష్కరించాలని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.