అమరావతి: న్యూఢిల్లీలో కేంద్ర రావాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. శ్రీ సత్య సాయి, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వివిధ రహదారుల విస్తరణ, కొత్త మార్గాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు.
రాష్ట్రంలో రూ.9,500 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కోసం ఆగస్టు 2న ఏపీకి నితిన్ గడ్కరీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మాట్లాడారు. ఈ పర్యటన ఏర్పాట్ల గురించి ఆయనకు మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా మంత్రి సత్యకుమార్, ఎంపి కేశినేని శివనాథ్ చర్చించారు. న్యూఢిల్లీలో రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కూడా మర్యాదపూర్వకంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిశారు. ఏపీలో వివిధ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి చర్చించారు. అలాగే రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు సహకరించాలని మంత్రి సత్యకుమార్ కోరారు.