Suryaa.co.in

Andhra Pradesh

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌ల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రులు జూప‌ల్లి, పొన్నం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వ‌హింనున్న‌ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుక‌ల‌కు సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్ ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌ను మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ ప‌రిశీలించారు. స‌భా వేదిక‌, బారికేడ్లు, పార్కింగ్, వీఐపీ కారిడార్, వేడుక‌ల‌ను వీక్షించ‌డానికి వ‌చ్చే ప్రేక్ష‌కులంద‌రికి గ్యాల‌రీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, మైక్ సిస్టం, త‌దిత‌ర స‌దుపాయాల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా అందరి స‌మ‌న్వ‌యంతో వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించే విధంగా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.

అనంతరం మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ… ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వంద‌లాది మంది బిడ్డ‌లు త‌మ ప్రాణాల‌ను ఆర్పించార‌ని, అలుపెరుగని పోరాటంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. అందెశ్రీ రచించిన జ‌య జ‌య‌హే తెలంగాణ‌, ప్ర‌జా క‌వి గ‌ద్ద‌ర్ పాడిన పొడుస్తున్న పొద్దు మీద … అనే పాట‌లు యావ‌త్ తెలంగాణ స‌మాజానికి స్పూర్తిని, శ‌క్తినిచ్చాయ‌ని పేర్కొన్నారు.

ప్ర‌పంచంలోనే అతి గొప్ప ఉద్యమంగా నిలిచింద‌ని, తెలంగాణ రాష్ట్రం కూడా అదే స్థాయిలో అభివృద్ధి జ‌ర‌గాల‌ని ప్ర‌జ‌లు కోరుకున్నార‌ని, కానీ వారి అకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ పాల‌న సాగ‌లేద‌ని తెలిపారు. అందుకే బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు గ‌ద్దె దించార‌ని వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని పేర్కొన్నారు. గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వ పాల‌న‌కు … ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వ ప్ర‌జా పాల‌న‌కు ఎంతో తేడా ఉంద‌ని చెప్పారు. తెలంగాణ ఏవిధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో.. అదేవిధంగా నేడు కాంగ్రెస్ పాల‌న కొన‌సాగుతుంద‌ని వివ‌రించారు.

కార్య‌క్ర‌మంలో మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య , త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE