– మంత్రికి తెలియకుండానే చక్రం తిప్పుతున్న పేషీ?
– పేరు మంత్రిది.. పైసలు పేషీ వారికా?
– పేషీ లో ‘హరి’ ఓ సాంబ
– శాఖ సమీక్షలు, జిల్లా సమీక్షలతో మంత్రి బిజీ
– సొమ్ములు, బదిలీలు, గిట్టనివారిపై వ్యతిరేక వార్తలు రాయించడంలో పేషీ బిజీ
– ఫ్యాక్టరీస్-బాయిలర్స్ విభాగంలో పేషీదే పెత్తనం?
– పేషీ గుప్పెట్లో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు
– పేషీని మంత్రి నియంత్రిస్తున్నారా?.. మంత్రిని పేషీ నియంత్రిస్తుందా?
– కార్మిక శాఖలో పీఆర్వోలు ఎంతమంది?
– అనధికార పీఆర్వోతో హడలెత్తిస్తున్న పేషీ
– నచ్చని అధికారులపై ‘అనధికార పీఆర్వో’తో పేషీ ఆకాశరామన్న కథనాలు
– ఇప్పటికే కార్మిక శాఖ పేషీపై పుంఖానుపుంఖాల కథనాలు
– అయినా మంత్రి సుభాష్ మౌనం
– పేషీ పెత్తనంతో యువ మంత్రి బద్నామ్
– ప్రమాదంలో మంత్రి రాజకీయ భవిష్యత్తు
( మార్తి సుబ్రహ్మణ్యం)
సహజంగా ఏ శాఖ పేషీపై అయినా మంత్రుల పెత్తనం ఉంటుంది. కానీ కార్మిక శాఖలో అందుకు భిన్నమైన పరిస్థితి. మంత్రి సొంత నియోజకవర్గ పన్యటనలు, జిల్లా ఇన్చార్జి బాధ్యతలు, శాఖాపరమైన బాధ్యతలతో తలమునలకయిన అవకాశాన్ని పేషీ సిబ్బంది సొమ్ము చేసుకుంటున్న వైచిత్రి. పేషీలో పనిచేసే ఓ కీలక అధికారి ఓ చిన్న స్థాయి ఉద్యోగితో కలసి సాగిస్తున్న దందా.. చివరకు కార్మికమంత్రి ఇమేజీ డామేజీ అయ్యేందుకు కారణమవుతోంది. అయినా వారిపై ఎలాంటి చర్యలు లేవు. ఇదంతా మంత్రికి తెలిసి జరుగుతోందా? తెలియకుండా ఆయన పేరుతో నడుస్తున్న దందానా? ఇప్పటికే కార్మికశాఖపై పుంఖానుపుంఖాల కథనాలు వస్తుంటే పేషీ ప్రక్షాళనకు ఎందుకు నడుంబిగించలేదు? తనను అప్రతిష్ఠపాలు చేస్తున్న అక్రమార్కులపై మంత్రి ఎందుకు చర్యలుకొరడా ఝళిపించడం లేదు? .. ఇదీ ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్.
కార్మిక శాఖ పేషీ.. గోకర్ణ గజకర్ణ టక్కుటమార కళలకు కేంద్రమయిందన్న విమర్శలు అటు పారిశ్రామికవర్గాల్లో, ఇటు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. యువమంత్రి వాసంశెట్టి సుభాష్ అటు తన సొంత రామచంద్రాపురం నియోజకర్గ వ్యవహారంతోపాటు.. ఇటు జిల్లా ఇన్చార్జి మంత్రిగా బిజీగా ఉంటున్నారు. ఇక శాఖపరమైన సమీక్షలు ఎలాగూ ఉండనే ఉంటాయి.
ఇటీవలి కాలంలో కార్మిక శాఖలో పలు సంస్కరణలకు తెరలేపిన మంత్రి సుభాష్ ఇమేజీని, సొంత పేషీ వారే దారుణంగా డామేజీ
చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే సీఎంతోపాటు, సీఎంఓలో ఆ శాఖ చూస్తే కార్యదర్శి కార్తికేయ మిశ్రాకూ ఫిర్యాదుల రూపంలో వెళ్లినట్లు సమాచారం.
ముఖ్యంగా ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ విభాగంలో మంత్రి పేరుతో జరుగుతున్న దందా, ఆయన ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా బాగా ఆదాయం ఉన్న జిల్లాలకు డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్లుగా తమ సామాజికవర్గానికి, తమ చేతులు తడిపిన వారికే మంత్రితో తెలివిగా పోస్టింగులు ఇప్పిస్తున్న పేషీ అతి తెలివి తేటలు, మంత్రిని బద్నామ్ చేస్తున్నాయి.
కాగా మంత్రి బిజీని అడ్డుపెట్టుకుని ఈ పేషీ అధికారులు.. పెద్ద కంపెనీలకు నేరుగా ఫోన్లు చేసి, ఆయన పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రామచంద్రాపురం, అచ్యుతాపురం, పరవాడ, నెల్లూరు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో జరిగిన ప్రమాదాలను అడ్డుపెట్టుకుని, పేషీలోని కొందరు యాజమాన్యాలకు నేరుగా ఫోన్ చేసి.. మంత్రి పేరిట డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదులు చివరకు సీఎంఓ వరకూ చేరాయి.
అయితే చివరకు ఆరా తీస్తే అసలు మంత్రికి అక్కడ ప్రమాదం జరిగిన ఘటన కూడా తెలియదట. అసలు ఆ ఫిర్యాదులేవీ ఆయన దృష్టికే రాలేదట. అంటే మంత్రి పేరు అడ్డుపెట్టుకుని పేషీ సిబ్బంది ఏ స్థాయిలో బరితెగిస్తున్నారో అర్ధమవుతోంది.
కాగా.. రామచంద్రాపురం ప్రాంతంలో జీడిపిక్కల ఫ్యాక్టరీలపై.. పేషీ సిబ్బందే ఆకాశరామన్న పేరుతో ఫిర్యాదులు చేసిన వైనం మంత్రికీ తెలియదట. ఆ జీడిపిక్కల ఫ్యాక్టరీలు నిబంధనలు పాటించడం లేదు కాబట్టి, వాటిపై చర్యలు తీసుకోవాలన్నది ఆ ఆకాశరామన్న ఫిర్యాదుల సారాంశం.
అదే ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం ఒక ఫ్రోజన్ ఫుడ్స్ కంపెనీలో జరిగిన ప్రమాదాన్ని అడ్డుపెట్టుకుని, పేషీ నుంచి ఒకరు నేరుగా కంపెనీ యజమానికి ఫోన్ చేసి, లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఆ విషయాన్ని సదరు కంపెనీ యజమాని అక్కడి ఫ్యాక్టరీస్ ఉన్నతాధికారికి ఫోన్ చేసి.. ఫలానా వ్యక్తి మంత్రిగారి పేషీ నుంచి ఫోన్ చేసి ఇంత కావాలని అడిగారు. ఆయన ఎవరు అని ఆ కంపెనీ యాజమాన్యం ఆరా తీస్తే.. ఆ పేషీ సిబ్బంది సిఫార్సుతో అక్కడ పోస్టింగు తెచ్చుచుకున్న ఆ ఫ్యాక్టరీ అధికారి.. ‘‘అబ్బో ఆయన మంత్రి గారికి చాలా కావాలసిన మనిషి. షీషీ అంతా ఆయనే చూసుకుంటారు. ఆయన చెప్పింది చేయండి’’ అని ఉచిత సలహా ఇచ్చారట. ఇదే కంపెనీ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని పేషీలోని ఓ కీలక అధికారి, డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయంపై ఒత్తిడి చేస్తున్నట్లు కార్మికశాఖ వర్గాలు చెబుతున్నాయి. పేషీలో పనిచేసే ఆ అధికారికి సైలెంట్ కిల్లర్ అన్న పేరుందని కార్మిక శాఖ ఉద్యోగులు చెబుతున్నారు.
కాగా అసలు ఆ కంపెనీకి ప్రొహిబిటరీ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు క్యాన్సిల్ చేశారన్న సమాచారం చివరకు డైరక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ ఆఫీసుకూ తెలియకపోవడం విచిత్రం. అంటే ఇదంతా కేవలం అక్కడి ఫ్యాక్టరీస్ అధికారి-కంపెనీలు-పేషీకి తప్ప, డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆఫీసుకూ తెలియనంత గుంభనంగా జరుగుతోందని అర్ధమవుతోంది.
కాగా ఫ్యాక్టరీస్ విభాగంలో తమ మాట వినని ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా.. పేషీలోని వారే మీడియా-సోషల్‌మీడియాలో వ్యతిరేక వార్తలు రాయిస్తున్నట్లు సమాచారం. ఇటీవల శాఖాపరమైన కథనానికి సంబంధించి.. అసలు కార్మికశాఖతో ఎలాంటి సంబంధం లేని ఓ జర్నలిస్టు ద్వారా మంత్రి-కమిషనర్‌పై వ్యతిరేక కథనాలు రాయించడం కలకలం రేపింది.
చివరకు ఆ కథనం రాసిన జర్నలిస్టును విచారిస్తే.. పేషీలో డిప్యుటేషన్‌పై పనిచేసే ఒకరు, సదరు జర్నలిస్టును తన వద్దకు తీసుకువచ్చి.. వారిపై వ్యతిరేక కథనాలు రాయించారని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. నిజానికి కార్మిక శాఖకు ఎంతమంది పీఆర్వోలు? అన్న సందేహం సచివాలయ మీడియా వర్గాల్లో లేకపోలేదు.
జీతం బత్తెం లేని షాడో పీఆర్వోను.. పేషీలో పనిచేసే ఓ ఉద్యోగి, సచివాలయ మీడియావర్గాలకు ఆయనే మా పీఆర్వో అని పరిచేయం చేస్తున్నారట. మంత్రి ప్రెస్‌మీట్‌కూ ఆ జీతం బత్తెం లేని జర్నలిస్టు పీఆర్వోగా వస్తుండటం, ఆయన ఇచ్చిన ప్రెస్‌నోట్‌నే పేషీ కూడా విడుదలు చేస్తుండటంతో అసలు పీఆర్వో ఎవరన్న గందరగోళం మొదలయింది. నిజానికి ఇప్పటికే కార్మికశాఖలో ఒక పీఆర్వో పనిచేస్తున్నారు. దానితో కార్మిక శాఖకు ఎంతమంది పీఆర్వోలు? ఒకరా?ఇద్దరా? అన్న గందరగోళం మీడియా వర్గాల్లో మొదలయింది.
అయితే నిజానికి ఆ జర్నలిస్టుకు, కార్మిక శాఖలో జరిగే వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. పేషీలో పనిచేసే ఒక ఉద్యోగి.. ‘తాను మంత్రితో చెప్పి నీకు పీఆర్వో ఉద్యోగం ఇప్పిస్తా’నని ఆశ పెట్టి.. ఆ జర్నలిస్టుతో కార్మిక శాఖలో తనకు గిట్టని అధికారులపై, ఆ జర్నలిస్టులతో వ్యతిరేక థనాలు రాయిస్తున్నట్లు తెలుస్తోంది. విచిత్రంగా కార్మికశాఖ ఉన్నతాధికారులపైచిన్నా చితకా పేపర్లు, వాట్సాప్ పేపర్లన్నీ కాకినాడ కేంద్రంగా ఉండటం గమనార్హం.
ఈవిధంగా మంత్రి అనుభవరాహిత్యం-పర్యటనలు-సమీక్షలతో బిజీగా ఉండే అవకాశంగా వాడుకుని.. ఆయన పేరు చెప్పి ఫ్యాక్టరీలను బెదిరించి పిండేస్తున్న పేషీతో, మంత్రి సుభాష్‌కు ఎప్పటికయినా ప్రమాదమేనంటున్నారు. దీనిపై ఆయన దృష్టి సారించి.. పేషీని ప్రక్షాళన చేయకపోతే.. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న ఆయన పొలిటికల్ కెరీర్ కూడా ప్రమాదంలో పడక తప్పదని హెచ్చరిస్తున్నారు.
‘వజ్ర’ వైచిత్రి! (BOX)
కార్మికశాఖలోని ఫ్యాక్టరీస్ విభాగంలో ఆ విభాగపు అధికారుల అసమర్థత ఏ స్ధాయిలో ఉంది? కన్సల్టెంట్లకు ఎంత లోకువయ్యారు? వారితో ఏ స్థాయిలో అంటకాగుతున్నారో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. కొద్దిరోజుల క్రితం కాకినాడ పరిథిలోని అవంతి ఫ్రోజెన్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అదే కంపెనీలో ఒక ప్రమాదం జరిగితే, అధికారులు దానికి నోటీసులు జారీ చేశారట. కంపెనీ ఆవరణలో అమ్మోనియా లేదు. ఇకపై
ఇలాంటివి జరగవంటూ ఒక లేఖను కన్సల్టెన్సీ ఏజెన్సీ కాకినాడ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌కు 16-9- 2025న రాశారు. నిజానికి అలాంటి లేఖ రాయాల్సింది తప్పు చేసిన కంపెనీ తప్ప, దానికి వకాల్తా పుచ్చుకునే కన్సల్టెన్సీ కాదు. ఇలాంటి చిత్రవిచిత్రాలు ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటులో బోలెడు. కాకినాడ, అనకాపల్లి, అచ్యుతాపురం, పరవాడ, ఏలూరు ప్రాంతాల్లోని ఫ్యాక్టరీస్ అధికారులకు పేషీలో పనిచేసే ఆ ఇద్దరితో బాదరాయణ బంధం ఉందట. కారణం.. ఆ ఇద్దరి సిఫార్సులతోనే వారంతా అక్కడికి బదిలీ అయ్యారట.
ఇదిలాఉండగా.. ఆ కంపెనీలో జరిగిన ప్రమాదం గానీ.. దానికి ప్రొహిబిటరీ ఆర్డర్ ఇచ్చిన విషయం గానీ, దానికి క్యాన్సిల్ చేసిన విషయం గానీ తమకు తెలియదని డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వర్గాలు వివరణ ఇచ్చాయి. అంటే దీన్ని బట్టి.. ఈ లోపాయికారీ సర్దుబాట్లన్నీ, ఎక్కడికక్కడ పేషీలోని ఆ ఇద్దరు-ఫ్యాక్టరీస్ జిల్లా అధికారులు-కంపెనీల మధ్య గుంభనంగా జరుగుతున్నట్లు అర్ధమవుతుంది.