Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ కంటైనర్ టర్మినల్ లో స్వల్ప ప్రమాదం

– వెంటనే అప్రమత్తమైన విశాఖ టెర్మినల్
– త్వరితగతిన చర్యలు చేపట్టిన పోర్టు ఫైర్ సిబ్బంది.. తప్పిన అగ్ని ప్రమాదం
– పొగలు వ్యాప్తి చెందిన కంటైనర్ లోని ఒక బాక్స్ లో ఉన్న లిథియం బ్యాటరీలు దగ్ధం
– ఘటన జరిగిన వెంటనే ఆరా తీసిన రాష్ట్ర ప్రభుత్వం

విశాఖపట్నం: బీచ్ రోడ్ లో ఉన్న వీసీటీపీఎల్ లో జరిగిన లిథియం బ్యాటరీ కంటైనర్ లోడ్ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని విశాఖ కంటైనర్ టెర్మినల్ పేర్కొంది. శనివారం మధ్యాహ్నం లిథియం బ్యాటరీ అన్ లోడ్ చేస్తున్న సమయంలో కంటైనర్ లోని ఒక బాక్స్ లో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో సంబంధిత అధికారులు పోర్ట్ ఫైర్ విభాగాన్ని అప్రమత్తం చేసి, వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టడంతో ప్రమాదం తప్పింది.

మొదట పొగ రావడంతో అప్రమత్తం అయిన సంబంధిత టెర్మినల్ సిబ్బంది ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు.. త్వరితగతిన పోర్టు ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో చర్యలు చేపట్టడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటనతో ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టెర్మినల్ పేర్కొంది.

చైనా నుండి కోల్ కతా వెళ్లాల్సిన కంటైనర్ లోడ్ గత నెల 28న విశాఖకు చేరిందని సంబంధిత అధికారులు తెలిపారు. పోర్టు ఫైర్ సిబ్బంది శాయశక్తుల ప్రయత్నించి ప్రమాదం తప్పించారని అధికారులు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసి పోర్టు అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంది.

LEAVE A RESPONSE